*_నేతకు వెతలే!_*
(చేనేత దినోత్సవం)
రేయనక పగలనక నేత..
మిగిల్చింది గుండెకోత..
మగ్గం ఆడించే నీ కళ
ఎందరికో అందించింది
బట్టల తళతళ..
మంచి జీవితం కావాలన్న
నీ కల..
అమాస రాతిరి వెన్నెల!
బాపూ కట్టాడు
నువ్వు నేసిన గోచీ...
దూరమైనా వచ్చి పొందూరు..
చాటి చెప్పాడు
ఇదే నా ఊరని..
రౌండ్ టేబుల్ కూ వెళ్ళినా
నీ పంచె..
నీ చుట్టూ ఎప్పుడూ
కష్టాల ముళ్ళ కంచె..
నూలు నీ ముడి సరకు..
ఎంత బాగున్నా
నీ ఉత్పత్తి ఎప్పటికీ
అమ్ముడయ్యేది
సరసమైన ధరకు..
శ్రమ..పరిశ్రమ..
జీవితం ఎప్పటికైనా బాగుపడుతుందన్న
నీ భ్రమ..
తప్పడం లేదు
నిరంతర దిగ్భ్రమ..!
బాపూ ఇష్టంగా
నాడు తిప్పిన చరఖా..
నీకు కష్టమే మిగిలి
కప్పేసింది కన్నీటి బురఖా!
నమ్మకు నమ్మకు అధనిక
ఖద్దరు బాబులను..
ఎన్నికల ముందు
నీ గడపకు
వచ్చి చూపించే డాబులను..
సొగసైన నీ బట్ట
తాను కట్టి
బతికి బట్టకట్టి..
నీలాంటి బడుగులను
కట్టగట్టి గోదాట్లో పడేసే
నయవంచకులను
నయా"పంచ"కులను..!
************************
*_ఎలిశెట్టి సురేష్ కుమార్_*
9948546286
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box