హైదరాబాద్​ లో కాగ్నిజెంట్ కొత్త సెంటర్

 



10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో క్యాంపస్

దాదాపు 15 వేల మంది యువతకు ఉద్యోగాలు

అమెరికాలో సీఎంతో చర్చలు జరిపిన కంపెనీ ప్రతినిధి బృందం

ప్రపంచ స్థాయిలో ఐటి రంగంలో పేరొందిన కాగ్నిజెంట్ కంపెనీ తెలంగాణలో భారీ విస్తరణ ప్రణాళికకు ముందుకు వచ్చింది.  హైదరాబాద్ లో దాదాపు 15 వేల మంది ఉద్యోగులకు పని కల్పించేలా కొత్త సెంటర్ నెలకొల్పనున్నట్లు ప్రకటించింది.  ఇరవై వేల మంది ఉద్యోగులుండేలా పది లక్షల చదరపు అడుగుల స్థలంలో ఈ  సెంటర్ ను స్థాపించనుంది. 


అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి, ఐటి శాఖ మంత్రి శ్రీధర్ బాబు కాగ్నిజెంట్ సీఈవో రవికుమార్, కంపెనీ  ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జరిగిన చర్చల సందర్భంగా ఈ ఒప్పందం జరిగింది. గత ఏడాది ముఖ్యమంత్రి బృందం దావోస్ పర్యటన సందర్భంగానే ఈ ఒప్పందానికి పునాదులు పడ్డాయి.  సాంకేతికత, కొత్త ఆవిష్కరణలకు అభివృద్ది కేంద్రంగా హైదరాబాద్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అందుకే  కాగ్నిజెంట్ కంపెనీ హైదరాబాద్​ లో తమ కంపెనీ విస్తరణకు మొగ్గు చూపింది. 


టెక్నాలజీ, ఇన్నోవేషన్ హబ్‌గా సత్తా చాటుకుంటున్న హైదరాబాద్ లో తమ కంపెనీ విస్తరించటం సంతోషంగా ఉందని కాగ్నిజెంట్ సీఈవో ఎస్.రవికుమార్ అన్నారు. 



హైదరాబాద్ లో నెలకొల్పే కొత్త సెంటర్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ క్లయింట్లకు మెరుగైన సేవలందించేందుకు ఉపయోగపడుతుందని అన్నారు. ఐటీ సేవలతో పాటు కన్సల్టింగ్ లో అత్యాధునిక పరిష్కారాలను అందిస్తుందని చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డిజిటల్ ఇంజనీరింగ్ మరియు క్లౌడ్ సొల్యూషన్స్‌తో సహా వివిధ అధునాతన సాంకేతికతలపై కొత్త కేంద్రం ప్రత్యేకంగా దృష్టి సారిస్తుంది.


ఐటి రంగానికి మరింత  అనుకూలమైన వాతావరణం కల్పించేందుకు తమ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడారు.  కాగ్నిజెంట్ కంపెనీ కొత్త సెంటర్ ఏర్పాటుతో ప్రపంచ టెక్నాలజీ కంపెనీలన్నీ హైదరాబాద్ ను తమ ప్రధాన గమ్యస్థానంగా ఎంచుకుంటాయని అభిప్రాయపడ్డారు. కాగ్నిజెంట్ కంపెనీకి తమ ప్రభుత్వం తగినంత మద్దతు ఇస్తుందని ప్రకటించారు. కొత్త సెంటర్ ఏర్పాటుతో వేలాది మంది యువతకు ఉద్యోగాలతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం ఉంటుందని అన్నారు. 


హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని ఇతర టైర్-2 నగరాలలో కూడా ఐటీ సేవలను విస్తరించాలని ముఖ్యమంత్రి చేసిన సూచనకు కంపెనీ ప్రతినిధులు సానుకూలత వ్యక్తం చేశారు. 


ఇప్పటికే ప్రముఖ టెక్ కంపెనీలన్నీ హైదరాబాద్ వైపు చూస్తున్నాయని,  ఇక్కడ కొత్త కేంద్రాన్నిస్థాపించాలనే కాగ్నిజెంట్ నిర్ణయం హైదరాబాద్ వృద్ధికి దోహదపడుతుందని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు అభిప్రాయపడ్డారు.

----

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు