జగత్ విజేతలకు బ్రహ్మరథం -టీమిండియా ఆటగాళ్లకు ఘన సత్కారం

 


టీ20 ప్రపంచకప్‌ 2024 ట్రోఫీ గెలుచుకుని  14o కోట్ల మంది భారతీయులు ఉప్పొంగి పోయే విజయం సాధించిన   భారత గడ్డకు చేరుకున్న టీమిండియా ఆటగాళ్లను ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఘనంగా సన్మానించారు.  మెరైన్ డ్రైవ్‌ ప్రాంతంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. అభిమానులు వేలాదిగా తరలి రావడంతో  ముంబయి రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. వాంఖడే మైదానం పరిసర ప్రాంతలన్నీ ట్రాఫిక్ రద్దీతో స్తంభించిపోయాయి.



కొన్ని గంటల పాటు ముంబయి నగరం జన సునామీని తలపించింది. ఇసుక వేస్తే రాలనంత జనంతో వాణిజ్య రాజధాని నిండిపోయింది. టీ20 ప్రపంచకప్ సాధించి ముంబై గడ్డపై అడుగుపెట్టిన భారత జట్టుకు యావత్ భారతం ఘన స్వాగతం పలికింది. ముంబై మహానగరంలో భారీ విజయోత్సవ ర్యాలీ అనంతరం భారత క్రికెట్ జట్టు వాంఖడే స్టేడియానికి చేరుకుంది. అప్పటికే మైదనామంతా జనసంద్రాన్ని తలపించింది. టీ20 ప్రపంచకప్ సాధించిన భారత జట్టును బీసీసీఐ ఘనంగా సత్కరించింది. 



తిరుగు ప్రయాణమైన క్రికెటర్లు

వేడుకలు ముగిసిన అనంతరం ఆటగాళ్లందరూ తాము వచ్చిన బస్సులోనే తిరుగు ప్రయాణమయ్యారు. మీడియాతో రోహిత్ శర్మ మాట్లాడుతూ ఈ వరల్డ్ కప్ విక్టరీ తనకెంతో ప్రత్యేకమని చెప్పారు. 2011 వన్డే వరల్డ్ కప్ విజయం, 2007 టీ20 వరల్డ్ కప్ విజయం కూడా ఎంతో ప్రత్యేకమైనవని అన్నాడు.

క్రికెటర్లకు ఘనంగా సన్మానం

వాంఖడే స్టేడియంలో భారత క్రికెటర్లందరినీ బీసీసీఐ ఘనంగా సన్మానించింది. అనంతరం ఆటగాళ్లు జాతీయ జెండాలు చేతబూని స్టేడియమంతా కలియతిరిగారు. బాలీవుడ్ పాటలకు స్టెప్పులు వేసి అభిమానుల్లో జోష్ నింపారు.

BCCI రూ.125 కోట్ల నగదు బహుమతి

భారత జట్టు ఆటగాళ్లకు సన్మాన కార్యక్రమం నిర్వహించి రూ. 125 కోట్ల నగదు బహుమతిని అందించనుంది బీసీసీఐ. వాంఖడే స్టేడియంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి అభిమానులకు ఉచిత ప్రవేశం కల్పించారు. దీంతో స్టేడియంలోని స్టాండ్స్‌ అన్నీ ఫ్యాన్స్‌తో కిక్కిరిసిపోయాయి. భారత క్రికెటర్లు బీసీసీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో బార్బడోస్ నుంచి ఢిల్లీకి.. అక్కడి నుంచి ముంబయికి చేరుకున్నారు.

రోహిత్ రియాక్షన్..


టీ20 ప్రపంచకప్‌ గెలుపును సమిష్టి విజయంగా పరిగణించాలని రోహిత్ శర్మ పేర్కొన్నారు. ప్రతి ఆటగాడు, సహాయక సిబ్బంది కృషి ఫలితంగా కప్ సాధించామన్నారు. ఎవరో ఒక ఆటగాడి ఘనతగా ఈ విజయాన్ని చూడలేమన్నారు. టీ20 వరల్డ్ కప్‌ గెలిచిన తర్వాత తాను రిలాక్స్ అయిపోయానన్నారు. ఈ దేశానికి టీ20 ప్రపంచకప్ తీసుకురావడం చాలా ప్రత్యేకమని అన్నారు. విజయోత్సవ ర్యాలీ అద్భుతంగా సాగిందని.. ఘన స్వాగతం పలికిన ముంబై అభిమానులను రోహిత్ ప్రత్యేకంగా అభినందించారు.

కోహ్లి-కోహ్లీ నినాదాలు


రోహిత్, రాహుల్ ద్రవిడ్ తర్వాత మాట్లాడేందుకు విరాట్ కోహ్లీ పోడియం వద్దకు చేరుకోగానే వాంఖడే స్టేడియంలో కోహ్లి-కోహ్లీ నినాదాలు మిన్నంటాయి. ఈ విజయం 140 కోట్ల దేశ ప్రజలదని కోహ్లి అన్నారు. ముంబైలో తమకు ఘన స్వాగతం పలికిన క్రికెట్ అభిమానులకు కోహ్లీ ధన్యవాదాలు తెలిపారు. ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత తాను, రోహిత్‌ కలిసి పెవిలియన్‌ మెట్లు ఎక్కుతున్నప్పుడు ఇద్దరూ ఒకరినొకరు కౌగిలించుకుని.. ఏడ్చేశామని.. ఆ క్షణం తమకు ఎప్పటికీ ప్రత్యేకమైనదని విరాట్‌ కోహ్లీ అన్నారు. మరోవైపు జస్ప్రీత్ బుమ్రాకు చప్పట్లు కొట్టాలని అభిమానులను కోహ్లీ కోరడంతో వాంఖడే స్టేడియం మొత్తం బుమ్రా నినాదాలతో మారుమోగింది.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో  టీమిండియా 



బార్బడోస్ నుంచి భారత్‌కు తిరిగొచ్చిన టీమిండియా (Team India) ప్రధాని నరేంద్ర మోదీతో (PM Narendra Modi) భేటీ అయ్యింది. తొలుత ఐటీసీ మౌర్యలో కేక్ కట్ చేసిన ఆటగాళ్లు.. అక్కడి నేరుగా ప్రధాని నివాసానికి వెళ్లి మోదీని కలిశారు. తాము గెలిచిన ట్రోఫీని (20 World Cup Trophy) ప్రధానికి అందజేసి.. ఫోటోలు దిగారు. ఆపై ఆటగాళ్లందరిని మోదీ ఆప్యాయంగా పలకరించారు. వరల్డ్‌కప్ గెలిచినందుకు ప్రతిఒక్కరికీ అభినందనలు తెలిపారు. అంతేకాదు.. ఈ టోర్నీలో ప్రయాణం ఎలా సాగింది? ఎదుర్కొన్న సవాళ్లేంటి? ట్రోఫీ గెలిచేందుకు చేసిన కృషి ఏంటి? వంటి వివరాలను ఒక్కొక్కరిని అడిగి తెలుసుకున్నారు. అందరితోనూ కాసేపు ముచ్చటించారు.


--ఎండ్స్


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు