సమగ్ర కుల జనగణన ఏకీ రాస్తా



 సమగ్ర కుల జనగణన ఏకీ రాస్తా

కుల జనగణనపై రాహుల్ మాట నిలుపుకోవాలి

కుల జనగణన జరిపి 42 శాతం రిజర్వేషన్ల తర్వాతే ఎన్నికలు

బి.సి లకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుంటే రాష్ట్రం అగ్ని గుండమే

తాజ్ కృష్ణ హోటల్ లో జరిగిన బి.సి మేధావుల సభలో పాల్గొని గర్జించిన నాయకులు

పార్టీలకు అతీతంగా పాల్గొన్న నాయకులు

అందరి నోట ఒకటే మాట రాహుల్ మాట నిలబెట్టుకొని కుల జనగణన జరపాలి



    పాల్గొన్న ప్రముఖులు జస్టిస్ ఈశ్వరయ్య, జస్టిస్ చంద్రకుమార్, బండ ప్రకాష్, తీన్మార్ మల్లన్న, చిరంజీవులు, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మధుసూదన చారి, రాజారాం యాదవ్, సాయిని నరేందర్, జాజుల శ్రీనివాస్ గౌడ్, ప్రొ. పి ఎల్ విశ్వేశర్ రావు, ప్రొ. సింహాద్రి, ప్రొ ఇనుగంటి తిరుమలి, చెరుకు సుధాకర్, పూల రవీందర్, వినయ్ కుమార్, ఆకుల లలిత



    పార్టీలు, జెండాలు వేరైనా అందరి బాట ఒకటే కావాలి, కుల జనగణన జరిపే వరకు విశ్రమించేది లేదు, కుల జనగణన జరిపి స్థానిక సంస్థల్లో బి.సి లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించకుండా తెలంగాణలో ఎన్నికలు జరుపుతే ఊరుకునేది లేదని బి.సి రాజకీయ నాయకులు, మేధావులు, సంఘాల నాయకులు నినదించారు. మంగళవారం తెలంగాణ రాష్ట్ర రాజదాని కేంద్రం హైదరాబాద్ లోని తాజ్ కృష్ణ హోటల్ లో బి.సి మేధావుల ఫోరం ఆధ్వర్యంలో రిటైర్డ్ ఐ ఎ ఎస్ అధికారి చిరంజీవులు అధ్యక్షతన జరిగిన బి.సి కుల సంఘాల, రాజకీయ నాయకుల విస్తృత సమావేశంలో పార్టీలకతీతంగా నాయకులు, మేధావులు పాల్గొని మాట్లాడారు.



    రిటైర్డ్ ఐఎఎస్ అధికారి చిరంజీవులు మాట్లాడుతూ సామాజికంగా వెనుకబడిన వర్గాలకు ఇచ్చే రిజర్వేషన్లను అర్హులకు ఇవ్వకుండా తరతరాలుగా అన్ని రంగాలను కబ్జా చేసుకున్న ఆధిపత్య వర్గాలకు ఇస్తున్నారని అన్నారు. తమిళనాడులో అణగారిన వర్గాలకు 69 శాతం రిజర్వేషన్లు సాధ్యమైనప్పుడు తెలంగాణలో ఎందుకు సాధ్యం కావని, పాలకులకు చిద్దశుద్ది ఉంటే ఏదైనా సాధ్యమవుతుందని అన్నారు. బి.సి కుల గణన కోసం జి.ఓ ఇచ్చి ఐదు నెలలు అయినా ఇప్పటివరకు పని మొదలు పెట్టలేదని అన్నారు. బి.సి ల రాజకీయ హక్కుల కోసం ఐక్య ఉద్యమాలు చేయాలని అన్నారు. జస్టిస్ ఈశ్వరయ్య మాట్లాడుతూ చట్టపరంగా బి.సి రిజర్వేషన్లు సాధించడం ఒక మార్గమైతే పార్టీల పరంగా బి.సి లకు 50 శాతం అవకాశం ఇవ్వడం ఒక మార్గమని అన్నారు. బి.సి రిజర్వేషన్ల కోసం బి.సి లు తెగించి పోరాడాలని ఆయన పిలుపనిచ్చారు. 



   బి.సి జనసభ అద్యక్షులు రాజారాం యాదవ్ మాట్లాడుతూ తరతరాలుగా అణచివేతకు గురైన బి.సి సమాజానిది ఇప్పుడే ఒకటే బాట అని సమగ్ర కుల జనగణన అని, జెండాలు, పార్టీలు వేరైనా అందరి దారి కుల జనగణన వైపు నడవాలని అన్నారు. మిల్లో మారిన్ సంస్కరణల నుండి మొదలు కొని అంబేద్కర్ పోరాటం వరకు సిక్కులు, ముస్లిం లు దళితులకు రాజ్యాంగ హక్కులు లభించాయని, బి.సి ల అభివృద్ధి కోసం పెరియార్ మొదలు మండల్ కమీషన్ వరకు ఎన్ని నివేదికలు సమర్పించినా, పోరాటాలు చేసిన బి.సి లకు హక్కుల సాధన జరగడం లేదని అన్నారు. రాహుల్ గాంధీ వాగ్దానం, సిద్ధిరామయ్య కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ మాట నిలబెట్టుకొని కుల జనగణన జరిపి స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రొఫెసర్ పి ఎల్ విశ్వేషర్ రావు మాట్లాడుతూ సకల సామాజిక రంగాలలో ఆధిపత్య కులాలు పాగా వేశారని, రాజకీయం, సినిమా, రియల్ ఎస్టేట్, ఫార్మా, నిర్మాణ తదితర రంగాలన్ని ఆధిపత్య కులాల చేతిలో ఉన్నాయని, అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఆధిపత్య వర్గాలు ప్రభుత్వ ఆస్తులను కాజేస్తున్నారని అన్నారు. 



     మాజీ స్పీకర్ మధుసూదన చారి మాట్లాడుతూ బి.సి లు దందాలు పెట్టీ దరఖాస్తులు ఇచ్చే స్తాయి నుండి ఎదగాలని, రెండు నుండి మూడు శాతం ఓట్లతో రాజ్యాలు మారుతున్న నేటి కాలంలో బి.సి రాజకీయంగా కీలకపాత్ర పోషించాలని, బి.సి లకు అన్యాయం చేస్తున్న పార్టీలను కట్టడి చేయాలని అన్నారు. మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంత రావు మాట్లాడుతూ సామాజిక న్యాయానికి  కుల జనగణన ఎక్సరే అని, జితినే హిస్సే దారి ఉత్నా బాగేదారి అన్న రాహుల్ గాంధీ మాట నిలబెట్టుకోవాలని అన్నారు. జోడో యాత్ర ద్వారా బి.సి ల ఓట్లతో మెజార్టీ సీట్లను సాధించిన రాహుల్ గాంధీ బి.సి లను విస్మరించి రాదని అన్నారు.  

   శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ మాట్లాడుతూ అన్ని రాజకీయ పార్టీలు బి.సి కులగణనను వ్యతిరేకించేవేనని, కుల జనగణన చేస్తామని రాజ్యసభలో మాట్లాడిన బిజెపి రాజ్ నాథ్ సింగ్ తర్వాత మాట మార్చాడని అన్నారు. 1931 నుండి వేసిన అన్ని కమీషన్లు కుల జనగణన చేయాలని నివేదికలు ఇచ్చిన కూడా ఏ పార్టీ కూడా కులజనగణన చేయకపోవడం దుర్మార్గమని అన్నారు. బి.సి లకు వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చిన జడ్జీలందరు ఆధిపత్య కులాల వారేనని, న్యాయ వ్యవస్థ అంతా ఆధిపత్య కులాలతో నిండి పోవడం వల్లనే బి.సి లకు వ్యతిరేకంగా తీర్పులు వస్తున్నాయని విమర్శించారు. కుల జనగణన లేకుండా స్థానిక సంస్థల ఎన్నికలను బి.సి లు ఎదురించాలని పిలుపునిచ్చారు. 

   ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ నన్ను ఓడించడానికి ఆధిపత్య కులాల వారు ఎన్నో కుట్రలు చేసారని, నా బి.సి ప్రజలు నన్ను గెలిపించారని, బి.సి ప్రజల రుణం తీర్చుకుంటానని, బి.సి ల రాజ్యాధికారం కోసం ఏ త్యాగానికైనా సిద్ధమని అన్నారు. కుల జనగణన జరిపి స్థానిక సంస్థల్లో బి.సి లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని మాట ఇచ్చాడని వాటిని సాధించి రాహుల్ ను గెలిపిస్తానని అన్నారు. కుల జనగణన జరిపి బి.సి లకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా ఎన్నికలు నిర్వహిస్తే రాష్ట్రం రణ రంగంగా మారుతుందని అన్నారు. బి.సి హక్కుల సాధనకు పార్టీ జెండాలు పక్కకు పెట్టి ఐక్య ఉద్యమాలు చేయాలని అన్నారు. బి.సి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ రైతుల విషయంలో రాహుల్ మాట శిలా శాసనం అంటున్న రేవంత్ రెడ్డి బి.సి లకు కామారెడ్డి లో చేసిన వాగ్దానం శిలా శాసనం కాదా అని ప్రశ్నించారు. బి.సి ల హక్కుల కోసం గ్రామ స్థాయి నుండి మొదలుకొని డిల్లీ లోని ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ముట్టడి చేయాలని పిలుపునిచ్చారు. జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ చరిత్రలో మొత్తం అణగారిన కులాలను అణచివేసిన చరిత్రనే ఉందని అన్నారు. తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్లు అమలు జరిగేటప్పుడు తెలంగాణలో ఎందుకు సాధ్యం కాదని, శాస్త్రీయ కుల జనగణన జరిపి బి.సి లకు రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేశారు. బి.సి ల అంశాన్ని 9వ షెడ్యూల్ లో చేర్చితేనే బిజెపి పార్టీ దేశంలో మనగలుగుతుందని అన్నారు. 

   ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు ఆల్ ఇండియా ఒబిసి జాక్ చైర్మన్ సాయిని నరేందర్, బి.సి రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు దాసు సురేష్, చొల్లేటి ప్రభాకర్, ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్, సంగెం సూర్యారావు, తిరునగరి శేషు, పటేల్ వనజ, ఆకుల లలిత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, తొలి వెలుగు రఘు, కాళోజి చానల్ శ్రీనివాస్, డాక్టర్ చెరుకు సుధాకర్, డాక్టర్ వినయ్ కుమార్, బి ఎస్ రాములు, బత్తుల సిద్దేశ్వర్లు, మేకపోతుల నరేందర్ గౌడ్, చాపర్తి కుమార్ గాడ్గే, ఐరబోయిన రాజు యాదవ్, చేమకూర రాజు, వెలిశాల దత్తాత్రేయ, కె వి కొండల్ గౌడ్, వెన్నాపూజ పరుషరాజ్ యాదవ్, జక్కాని సంజయ్, అశోక్ పోషం, కూర వెంకట్, ఏటిగడ్డ అరుణ, పర్వత సతీష్, రోజా నేత, చింతనిప్పుల భిక్షపతి, నాగమణి, పుట్టల మధుసూదన్, కూతురు శ్రావ్య, యశోద, లిఖిత, వలిబాబ, శ్రీను, నరహరి, పర్వత వెంకన్న తదితరులు పాల్గొని మాట్లాడారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు