*_బాబు బాసూ.. భద్రం.._*
*_జగన్ సారూ..జాగ్రత్త..!_*
ప్రజాస్వామ్యంలో బలమైన ప్రతిపక్షం అవసరం..
ఏకపక్ష పాలన..
ఒంటెత్తు పోకడలు ఎప్పుడూ వాంఛనీయం కావు.
ప్రస్తుతం రాష్ట్రంలో అలాంటి ఏకపక్ష పాలన సాగే దిశగానే పరిస్థితులు నడుస్తున్నాయి.
మొన్న ఎన్నికల్లో కూటమికి
అసాధారణ మెజారిటీ లభించడం..అంతకు ముందు
అంతే బలమైన సంఖ్యాబలంతో సర్కారును నడిపిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
కేవలం పదకొండు సీట్లకే పరిమితమై పోవడంతో
తెలుగుదేశం నేతృత్వంలో ఏర్పడిన ఎన్డీయే కూటమి సర్కారు ఇష్టారాజ్యానికి తెర లేచినట్టయింది.
ఇంతకు ముందు
ఇలాగే 1994 లో..
మళ్ళీ 2019 లో..
మొదటిసారి ఎన్టీఆర్ నేతృత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వం..రెండోసారి జగన్మోహన రెడ్డి సారథ్యంలో
వైసీపీ సర్కారు అధికారం చేశాయి.అయితే 1994లో..
మళ్ళీ 2019లో సరైన సంఖ్యాబలం లేకపోయినా గాని
మొదట్లో కాంగ్రెస్..తర్వాత తెలుగుదేశం ప్రతిపక్షంగా
తమ పాత్రను బలంగానే పోషించాయి.
నిజానికి మొన్న కాలం చెల్లిన సభలో తెలుగుదేశం గెలిచిన స్థానాలే తక్కువ.వాటిలో కూడా తదనంతర కాలంలో కొన్ని హుష్ కాకి అయిపోయాయి. అయినా కూడా తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడి పాత్రను సమర్ధవంతంగా
పోషించారు.
2024 ఎన్నికల్లో తెలుగుదేశం.. జనసేన కూటమికి అంతటి భారీ విజయం సిద్ధించడానికి
అది కూడా కీలకమైన కారణంగానే పరిగణించవచ్చు.
సభలో తెలుగుదేశం పోషించిన
పాత్రతో పాటు బయట కూడా
తెలుగుదేశం..అంతకంటే
ఎక్కువగా జనసేన జగన్ సర్కార్ ఒంటెత్తు పోకడలకు
వ్యతిరేకంగా బలమైన పోరాటాలు చేసి ప్రజల మధ్య ఉన్నట్టు నిరూపించుకో గలిగాయి.
ఇక వర్తమానానికి వస్తే..
2024 ఎన్నికల్లో జగన్ పార్టీ గెలిచిందే పదకొండు స్థానాలు.
ప్రతిపక్ష హోదా కూడా దక్కని దైన్య స్థితి.తిరుగులేని ఆధిపత్యానికి,అలవిమీరిన అధికార దర్పానికి అలవాటు పడిన జగన్మోహన రెడ్డి
మొన్నటి ఓటమిని జీర్ణించుకోలేకపోయారు.
నిన్నటి వరకు తాను చాలా
చులకనగా చూసిన వ్యక్తులు
అధికార స్థానాల్లో కూర్చోవడం..
తనకు ప్రతిపక్ష నాయకుడి హోదా సైతం మిగలని దశలో
జగన్ సభకు రావడానికే ఇష్టపడడం లేదు.
శాసనసభ్యుడిగా ప్రమాణస్వీకారానికి కూడా ఆయన అయిష్టంగానే వచ్చినట్టు కనిపించింది.
ఇప్పుడు ఆయన సభలో కూర్చుని కొత్త ప్రభుత్వ విధానాలపై మాట్లాడే ప్రయత్నం చెయ్యకుండా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
అరాచక పాలన సాగుతున్నట్టు ఢిల్లీ రోడ్లపై గగ్గోలు పెడుతున్నారు.
ప్రజాతీర్పును గౌరవించని రీతిలో ప్రతిపక్ష నేత హోదానే అన్నిటి కంటే ముఖ్యం అన్నట్టు
ఆ హోదా కోసం కోర్టుకు వెళ్ళే ప్రయత్నంలో ఉన్నారు.ఇలా అయితే జగన్ గాని..
ఆయన పార్టీ గాని మళ్ళీ జనంలోకి వెళ్ళేదెలా...
ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జనంలోకి వచ్చింది ఎటూ తక్కువే.ఇప్పుడూ అలాగే ఉంటే కష్టమే.ఇప్పటికే సరైన దశదిశ చూపేవారు లేక కార్యకర్తలు..నాయకులు
పక్క చూపులు చూస్తున్నారు.
అధినేత వ్యవహార శైలి ఇలాగే ఉంటే రానున్న రోజుల్లో
వైసిపి ఖాళీ అయిపోయే ప్రమాదం ఉంది.జగన్ ఇది ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది!
*_సురేష్..జర్నలిస్ట్_*
9948546286
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box