*_ఓ నాన్నా_*
*_నీ మనసే వెన్న..!_*
అమ్మ చేతి ముద్దలోని రుచిని
ఆస్వాదిస్తున్నప్పుడు అందులోనే నాన్న
పడిన కష్టంలోని
మాధుర్యాన్నీ పసిగట్టు..!
రాత్రి అమ్మ పాడే జోల
శ్రావ్యంగా వినిపిస్తుండగా
కనురెప్ప వేసే ముందు
అక్కడ నాన్న రాత్రి షిఫ్టుల్లో
కంటి మీద కునుకు లేకుండా శ్రమిస్తున్న దృశ్యాన్ని
ఓసారి ఊహించు..
కొత్త బట్టలు వేసుకున్న
నీ ఆనందం వెనక చక్కగా కుట్టిన దర్జీ కంటే
బట్టల కోసం
నువ్వు పెట్టుకున్న
అర్జీని వెంటనే
ఓకే చేసిన నాన్న
గొప్ప మనసును చూడు..!
నీ స్కూల్ యూనిఫాం
తళతళ మెరుపు వెనక
నాన్న వెలిసిపోయిన
ఖాకీ యూనిఫాం
చెమట తడిని ఫీలవ్వు..!
స్కూలు తరపున
ఋషికొండకు
నువ్వెళ్ళే పిక్నిక్..
వెళ్ళరా కొండా అని బుజ్జగిస్తూ నీకు తెలియకుండా
అప్పు చేసిన
నాన్న టెక్నిక్..!
క్లాసు పెరుగుతున్న కొద్ది
నీ క్లాస్ తగ్గకుండా
మొదట సైకిల్..
తర్వాత రిక్షా..
ఆపై ఆటో..తదుపరి బైక్
నీకు అందుబాటులో ఉంచిన నాన్న జీవితమంతా సైకిల్ పైనే
తిరుగుతున్నాడని..
టైరు మార్చకుండగనే
రిటైరు అవుతున్నాడనే
కఠోర సత్యాన్ని గ్రహించు..!
ఆయనకు వ్యతిరేకంగా
ఒక్క మాటైనా
అనే ముందు నిగ్రహించు..!!
ఇంట్లో నువ్వు తప్పు చేసినప్పుడు అమ్మ దృష్టికి వెళ్లకుండా నాన్న
తీసుకున్న జాగ్రత్త..
బడిలో పెంకితనం
చేసినప్పుడు
నీ బదులు మాస్టారికి
క్షమాపణ చెప్పిన
ఆయన నమ్రత..
ఆటలలో..పాటలలో..
ఇతర పోటీలలో నువ్వు గెలిచినప్పుడు
ఆయన సంబరం..
జీవితంలో
ఏ దశలోనైనా ఓడినప్పుడు ఆయన చూపిన నిబ్బరం..
నువ్వు తప్పు చేసినా కోపాన్ని ప్రదర్శించలేని
కడుపుబ్బరం..!
నీకు వచ్చిన
మార్కులకు సంతోషం..
అమ్మ నిన్ను తిడుతూ
మీ గారాబం వల్లనే
ఇలా జరుగుతోందని రిమార్కులిచ్చినా
పట్టువదలని విక్రమార్కుడిలా అమ్మ మెప్పు కోసం..
నిన్ను అమ్మ
మెచ్చుకోవడం కోసం
ఆయన పడిన పాట్లు..
అమలు చేసిన ప్లాట్లు కోటానుకోట్లు..!
స్కూల్లో నువ్వు క్యారేజిలో అన్నం వదిలేస్తే మళ్లీ అమ్మ నిన్ను తిడుతుందేమోననే ఆలోచనతో
నీ ఎంగిలి మెతుకులు తినేసి
ఇంటికెళ్ళాక
మళ్లీ అమ్మ తనకు ప్లేటు నిండా వడ్డించినప్పుడు కక్కలేక..మింగలేక
నాన్న పడిన యాతన..
నిన్ను కాపాడడానికి
ఆయన పడిన చింతన..
ఒకటా రెండా ఉదంతాలు..
నాన్న ప్రేమకు దృష్టాంతాలు..!
నీ కోసం మళ్లీ పలక బలపం పట్టి అ ఆ లు దిద్దినా..
పెన్సిల్ తో బొమ్మలు వేసినా..
తనకు అంత బాగా రాకపోయినా
బుర్ర గోక్కుంటూ
నీకు లెక్కలు చెప్పి..
ఒక వేళ తప్పయితే
నీ ముందు బయట పడలేక నువ్వే తప్పు రాసుకొచ్చావంటూ
ఎప్పటికప్పుడు కవరింగులిచ్చుకునే
సూడో జ్ఞాని..
సంసార సాగరంలో ఈదులాడడం సరిగ్గా తెలియని ఓ అజ్ఞాని..
జీవితంలో నువ్వు వేసే
ప్రతి పనిలో ముందుండి నడిపించే పరిజ్ఞాని..
నీ కాలమాని..
నీ ప్రతిభకు కొలమాని..
నీ హితుడు..స్నేహితుడు..
సన్నిహితుడు..శ్రేయోభిలాషి..అమ్మ ముందు మితభాషి..
నువ్వు ఎక్కడకు వెళ్ళినా
నీ ఆగమనాభిలాషి..
ఇదంతా ఒక్కోసారి
నీ దృష్టిలో ఆషామాషి..
నిరంతరం నీ మేలు కోసం తపించే రుషి..
నీతోనే ముడిపడి ఉంటుంది అతగాడి ఆజన్మాంత ఖుషి..!
మొత్తానికి నీ ఓటములకు ఆయన జవాబు..
గెలుపులకు నవాబు..
ఎన్ని చేసినా తనకుగా
ఏమీ మిగుల్చుకోని గరీబు..!
ఒక్కటి గుర్తుంచుకో..
నువ్వున్నంత కాలం
నాన్న ఉండడు..
కానీ నాన్న ఉన్నంతకాలం నువ్వుంటావు..ఉండాలి..
అదే నాన్న కోరిక..!
నీ పుట్టుక ఆయనకు పండగ..
నీ ప్రతి పుట్టినరోజు
ఆయనకు బ్రహ్మోత్సవం..
నీ ఆట అచ్చట..
నీ మాట ముచ్చట..
నీ చదువు ఆయన పరువు..
నీ ఎదుగుదల గెలుపు..
నీ ఉన్నతి ఆయన పదోన్నతి..!
నీ పెళ్లి లోకకళ్యాణం..
నువ్వు పక్కనుంటే నిత్యకళ్యాణం..
నీ చిరునగవే పచ్చతోరణం..
నీ పిల్లలు ఆయన ఆస్తి..
మళ్లీ వారి కోసం
ఆనందంగా మరో కుస్తీ..
ఏదిఏమైనా నీ జీవితంలో ఎన్నిసార్లు వెనక్కి
తిరిగి చూసుకున్నా
ప్రతి పటంలో
అమ్మ ప్రేమ..
ప్రతి ఫ్రేములో నాన్న మోము..
ఇంత చేసి..జీవితం ధారపోసి..
అనుభవాన్ని కాచి వడబోసి..
తన చెమట
అనే సిరాతో
నీ కథ రాసి..
అలసి..సొలసి..
నీ ప్రేమలో తడిసి..
మళ్లీ నువ్వు తనను కొడుగ్గా
ఈ భూమ్మీదకు తీసుకు వచ్చి రుణం తీర్చుకుంటావని భ్రమసి..
నీ ఉన్నతికై తపించి..
అహరహం శ్రమించి..
జీవితం మొత్తాన్ని నీకోసం ధారపోసే ఓ కర్మయోగి..
సర్వసంగపరిత్యాగి..
నీ నాయన..
మీ అమ్మకు ఆయన..
మీ ఇంటికి పెద్దాయన...
చివరాఖరికి ఆయనకు
ఆయనే నిజమైన వేమన..!
ఇంత చేసిన ఆ పెద్దమనిషి నిను కోరే ప్రతిఫలం
కానే కాదు అతగాడి భుక్తి..
నువ్వు కూతురువైతే
కన్యాదాన పుణ్యంతో ముక్తి..
కొడుకువైతే పున్నామనరకం నుంచి విముక్తి..!!!
బిడ్డల ఉన్నతి కోసం
శ్రమించే..పరిశ్రమించే
తపించే..తరించే
పితృదేవులందరికీ..
🙏🏼 అంకితం..🙏🏼
*_సురేష్ కుమార్ ఎలిశెట్టి_*
*విజయనగరం*
*9948546286*
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box