ఎన్నిక"లై"పోనాయి..!

 

ఎన్నిక"లై"పోనాయి..!


(సురేష్..9948546286)


అభ్యర్థుల్లో 

స్మశాన వైరాగ్యం..

ఊళ్ళలో స్మశాన నిశ్శబ్దం..!


నిన్నటి వరకు 

ఓటోఓటో

అన్న ఆటోలు..

ఇప్పుడు బేరాల్లేక 

ఓ మూల పడున్నాయి..

మైకులు..

మళ్లీ ఇనాయక సవితి

వరకు మూగనోము

పట్టి కూసుంటాయి..!


ఆడిచ్చిన..ఈడిచ్చిన

పైకంతో మైకంలో

ఊగిపోయిన 

తాగుబోతునాయాల్లు

మత్తు దిగిపోయినాక

దేశం ఏమైపోద్దా

అనే దిగులుతో

ఓ మూల బద్దకంగా

తొంగున్నారు..!


చట్ట సభలు..

ఈసారి గతాన్ని మించి

అదెంత గూండాలు..

స్వాహా స్వాములు..

కులమత  పిచ్చోళ్లు వచ్చి 

ఇంకెంత కలుషితం చేస్తారోనని 

బెంగగా ఎదురుచూస్తున్నాయి..!


యధేచ్చగా అక్రమాలు జరిగినా ఆపలేకపోయిన

ఎన్నికల యంత్రాంగం

పోలింగ్ శాతం లెక్కల్లో 

మునిగి తేలి..

ఎన్నికలు ప్రశాంతంగా

జరిగాయని..

జనం స్వేచ్చగా ఓటేసే

పరిస్థితి కల్పించామని

సిగ్గులేని స్టేట్మెంట్

ఒకటి మన మొహాన

కొడుతుంది..!


ఇంత హింసకీ కారణమైన

అభర్ధులనబడే గూండాలు

ఏసి రూముల్లో

తీరిగ్గా కూకుని

జరిగిన ఖర్చుల లెక్కల్లో 

తలమునకలై ఉంటే

ఆళ్ళ పనుపున దెబ్బలు తిన్న అభిమానులు

ఆస్పత్రులు..

పోలీసు ఠానాల చుట్టూ

తిరుగుతున్నారు..

పోసిన మందుకి న్యాయం చేశామన్న తృప్తితో..!


ప్రజాస్వామ్యం 

తనలో తాను కృంగిపోతూ

ఎప్పటిలా ధనస్వామ్యం చేతిలో కృశించిపోతూ..

ఏదో ఒకనాడు

ఇదిగో..ఇలా అరాచకం 

రగిలించే చితిలో నశించిపోతుంది..

(రాజ్యాంగమా మన్నించు)!


ఓ నా దేశమా..

నీ వాకిట్లో జరిగిన ఎన్నికల్లో

ఎవరు గెలిచినా..

ఇంకెవరు ఓడినా..

నువ్వైతే ఐదేళ్లకోసారి

ఖచ్చితంగా

ఓడిపోతునే ఉన్నావు..!!



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు