రాతగాళ్ళ వెతలు..!


జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా..



ఈ దేశంలో ఏ జర్నలిస్టూ పని చేసిన మొత్తం కాలం జీతం అందుకుని ఉండడు...ఎంత పెద్ద పేపర్లో ఎంతటి హోదాలో పని చేసిన జర్నలిస్టు అయినా అయితే తొలి రోజుల్లో,లేదంటే మలి సంధ్యలో..కాకుంటే పేపర్లు మారిన మధ్య దశలో..
మొత్తానికి ఏదో ఒక దశలో వేతనం లేకుండా జీవితాన్ని..కొందరైతే దుర్భరమైన బ్రతుకులను వెళ్ళదీసిన వారే..ఇక చిన్న పేపర్లలో పని చేసిన వారి పరిస్థితి మరీ దుర్భరం..భారం..
డెస్కుల్లో అయితే చాలీచాలని కన్సాలిడేెట్ వేతనం.. రిపోర్టర్లకు
లైన్ అకౌంట్..కొలతల బ్రతుకులు..ఎంత రాస్తే..
అందులో ఎంత వేస్తే..
అది సక్రమంగా కొలిస్తే..
యాజమాన్యం దయ తలస్తే పేమెంట్..అది కూడా ఎప్పుడు చేతికి
వస్తుందో తెలియని
అయోమయ వ్యవస్థ..!

జర్నలిస్టుగా జీవితం ఆరంభించిన తొలి రోజునే
నీ తప్పటడుగు పడినట్టు..అడుగు పెట్టేస్తావు..ఇక అందులోంచి బయటికి రాలేవు..
సమాజానికి ఏదో చేద్దామని..నీ రాతలతో జనాన్ని ఉద్ధరించేద్దామని అనుకుని ఫీల్డ్ లో అడుగుపెట్టే నీకు రెండ్రోజుల్లో వాస్తవ పరిస్థితి అర్థమైపోతుంది.అయితే అప్పటికి ఇంకా కుర్రవాడివి..తండ్రి చాటు బిడ్డవి గనక పరిస్థితి అంత ప్రమాదభరితంగా కనిపించదు... రోజులు గడిచే కొద్ది..లోతుకు వెళ్తున్న కొలది నువ్వెక్కడ ఉన్నావో అవగతం అవుతుంది..
ఈలోగా పెళ్లి..పెళ్ళాం..
పిల్లలు..సంసారం..సాగరం..
అప్పుడు తేరుకున్నా బయటికి రాలేని దుస్థితి..అలాగే బండి
లాగిద్దామనుకున్నా నడవదు..ఈలోగా చేస్తున్న పేపర్లు సంక్షోభంలో పడడమో,ఇతర కారణాల వల్లనో ఉన్న ఉద్యోగం పోద్ది.. మరో పేపర్లోకో..చానల్లోకో వెళ్ళలేక..కొత్త దారి
వెతుక్కోలేక..వేరే పని రాక..వ్యాపారం చాతకాక.. ఆదుకునే దిక్కులేక తెలిసిన ఒకే విద్య..కొత్త అవతారం.. సొంతపత్రిక..దాని పేరే చిన్న పత్రిక..కష్టాల పుత్రిక.. పెట్టిన దగ్గర నుంచి కష్టాలే..
రావణకాష్టాలే..!

నిన్ను పోషిస్తుందని తలపోసే పత్రికను నువ్వు పోషించాల్సిన
భయంకరమైన భారం..!
ఆత్మలింగంలా బరువు
మొయ్యలేవు..దింపలేవు..
దినదిన గండం..ఎప్పుడు తీరిపోతుందో తెలియని ఆయుష్షు..రోజూ వేస్తే ఒక బాధ..వేయకపోతే మరో బాధ..దీనికి తోడు క్షుద్బాధ..
రోజూ పేపర్ తీసుకురావడం కష్టం..గర్భం దాల్చే స్త్రీకి తొమ్మిది నెలల వ్యవధి ఉంటుంది..దినపత్రికకు అదీ ఉండదు..సాయంకాలానికి తీసుకురాలేకపోతే పడిన శ్రమంతా వృధా...
ఉదయం నుంచి తిరిగిన తిరుగుడు..సేకరించిన సమాచారం అంతా వ్యర్థం..అవి చాలవన్నట్టు పోయే పరువు..రాని పేపరుకి ఎందుకింత బిల్డప్పు అంటూ సెటైర్లు..ఇవి బాధల్లో కొన్నే..!

ఒక జర్నలిస్టుగా నేను పడిన బాధలే కొల్లలు..
నాలాగా ఎందరో..
ఇంకా దుర్భరంగా ఇంకెందరో..
జీవితాలు ఎటూ వడ్డించిన విస్తర్లు కావు..నాకడానికి ఎంగిలాకులు కూడా మిగలని
కష్టాల బ్రతుకులు ఇంకెన్నో..
ఇవి చాలవన్నట్టు అక్రిడేషన్
కష్టాలు..ఏడాదికి ఓసారి ప్రభుత్వం ఇచ్చే గుర్తింపు కార్డు..బస్సు పాసు..
రైల్వే పాసు(ఇప్పుడు అదీ లేదు) మినహా దేనికీ పనికిరాని నాలిక బద్ద..
ఆ కార్డుపై చేసే ప్రయాణాలు కూడా పూర్తిగా ఉచితం కాదు..జిల్లాలో ఫ్రీ..రాష్ట్ర స్థాయి అక్రిడేషన్ అయితే కన్సషన్..అంతే..దాని కోసం ఎన్నో నియమాలు..
నిబంధనలు..పేపర్ తీసుకు రావడమే కష్టంగా అనిపించే చిన్న పత్రికల జర్నలిస్టులకు పన్నులు..మొదటి దానికి మొగుడు లేడన్న.. చందం..జర్నలిస్టులను ప్రివిలేజ్డ్
క్లాస్ కింద చిత్రిస్తున్న ప్రభుత్వాలు ఇచ్చే అక్రిడేషన్
విషయంలో అడ్డగోలు నిబంధనలతో యాతనలకు గురి చేస్తున్నాయి..అందరి బాధలను గురించి రాసే జర్నలిస్టులు తమ గోడు ఎవరికి చెప్పుకోవాలి..
ఇంతోటి కార్డు కోసం రోడ్డెక్కి ఆందోళనలు చెయ్యాల్సి వస్తున్న దుర్భర స్థితి..!

✍️✍️✍️✍️✍️✍️✍️

*_ఎలిశెట్టి సురేష్ కుమార్_*
           జర్నలిస్ట్
      విజయనగరం
      9948546286

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు