మాటే పాటై ఆ పాటే తానై..!


 

నాటు నాటు..

పొలం గట్టు దుమ్ములోన

పోట్లగిత్త దూకినట్టు..

పోలేరమ్మ జాతరలో

పోతరాజు ఊగినట్టు..

నా పాట సూడు..

నా పాట సూడంటూ

ఆస్కారోళ్ళకి సూయించి

కొట్టేశాడు అవార్డు..

భారతీయ రికార్డు..!


ఎక్కడో పుట్టి 

ఎక్కడో పెరిగి 

ఇక్కడే కలిశాడు

పాటలమ్మ చెట్టు నీడలో..

సముద్రాల..ఆత్రేయ..

ఆరుద్ర..దాశరథి..కొసరాజు..

వీటూరి..వేటూరి..

సిరివెన్నెల కట్టిన పాటల 

కోట నుంచి

మాటల మూటలు కట్టి

బోసు మొదలెట్టాడు

స్వరపదగమనం..!


చంద్రబోస్..

పాటలలో

మాటల మాంత్రికుడు..

వచనంతో బోణీ...

కీరవాణి బాణీ

అది బోసు పాట..

కొన్ని సత్యాలు..

ఇంకొన్ని పైత్యాలు..

అక్కడక్కడా భావాలు..

సొంత మనోభావాలు 

మిక్స్ చేస్తే 

అది బోసు పాట బాసూ..!


బోటని మాస్టారి 

బోడి గుండుపై

బోలెడు జోకులు..

రాగిణి మేడం రూపురేఖపై

గ్రూపు సాంగులు..

ఈ పాట హిట్టు కదాని

దానికి అలాంటి

ఇంకొన్ని పాటలు జట్టు..

తెలుగు భాష తియ్యదనం

తెలుగు జాతి గొప్పదనం

తెలుసుకున్న వాళ్ళకి

తెలుగే ఒక మూలధనం..

తెలుగు నీకు సరే..

మమ్మీ డాడీ పిలుపులో

నీకు ఉండదేమో మాధుర్యం

ఇంగ్లీషుోడు 

అలా పిలిస్తేనే కదా 

అతగాడికి ఆ తన్మయత్వం

దాన్ని తప్పుపట్టేది

కాకూడదు మన తత్వం..!


దేశమంటే మట్టి కాదోయ్..

మతం కాదోయ్..

రాజభవనాల రాసలీలలు కాదోయ్..

నాటి తివారీ ఉదంతానికి

బోసు ఇచ్చిన డోసు..

చక్కని పదన్యాసం..

చిరు పాడాడు కదాని

మాటలే పాటగా

చాయ్ చటుక్కున 

తాగరా భాయ్..

అనవసర విన్యాసం..

మొత్తంగా మన బోసు..

మంచు కొండల నుంచి

దిగి వచ్చిన చంద్రమై..

నేనున్నానని చీకటితో చెప్పిన వెలుగై..

మంచి పాటలు..

వాటిలో ఎక్కువ మాటలు

రాస్తూ..మౌనంగానే 

ఎదిగిన గీత రచయిత..

ఎదిగిన కొద్దీ ఒదిగినా

హిట్టుల పరమార్థం తెలిసినోడు..

సీనియర్లు వెళ్ళాక 

సిన్సియర్ గా రాయాల్సినోడు!

_________

హ్యాపీ బర్త్ డే బోస్

-------------------------------------

      సురేష్ కుమార్ ఇ

       9948546286


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు