పూలే సిద్ధాంతంతోనే బహుజన రాజ్య స్థాపన

 


పూలే సిద్ధాంతం నేటి అవసరం 


పూలే సిద్ధాంతంతోనే బహుజన రాజ్య స్థాపన


సమాన విద్యా సాధన


 రిజర్వేషన్లపై 50 శాతం సీలింగ్ ఎత్తివేత


బి.సి లకు జనాభా దామాషా ప్రకారం సకల సామాజిక రంగాల్లో  రిజర్వేషన్లు


 బి.సి లకు చట్టసభల్లో రిజర్వేషన్లు


 జాతీయ న్యాయ విద్యా సంస్థల్లో, జ్యుడిశరీ లో బి. సి లకు రిజర్వేషన్లు




మహాత్మ జ్యోతిరావు పూలే లాంటి మహనీయులు ఎన్నో త్యాగాలు చేసి సాధించిన ఎన్నో హక్కులను నేటి పాలకులు మెజార్టీ ప్రజలకు దక్కకుండా చేస్తున్నారు. ప్రైవేటికరణ, ప్రపంచీకరణ, పట్టనీకరణకు పాలకుల దోపిడి తోడై ప్రజల మధ్య మరింత అసమానతలు పెరిగిపోతున్నాయి. ఇలాంటి తరుణంలో అనగారిన వర్గాలు మహాత్మ జ్యోతిరావు పూలే ఆశయాలు, పని విధానం ఆయుధంగా చేసుకొని ఉద్యమించాల్సిన అవసరం ఉంది. 


    అధర్మానికి మారుపేరైన మనుధర్మ శాస్త్రంతో దేశ మూలవాసులను విద్యకు, ఆస్తికి, అధికారానికి, ఆత్మగౌరవానికి దూరం చేసిన చరిత్రను 180 ఏండ్ల క్రీతమే అధ్యయనం చేసి బహుజనుల ఐక్యత కోసం రక్త సంబంధాల చరిత్రను, అభివృద్ధి కోసం విద్య ప్రాముఖ్యతను చాటి చెప్పి ఆచారణాత్మక ఉద్యమం చేసిన పూలే సిద్ధాంత అవసరాన్ని బహుజన వర్గాలు గుర్తించాల్సిన అవసరముంది. 


"శూద్ర జాతిలో కొంతమంది ఈనాడు తాము మాలీలమని, కుంబీలమని, కంసాలులమని, దర్జీలమని, కుమ్మర్లమని, వడ్రంగులమని, వాళ్ళ వాళ్ళ వృత్తుల ప్రాతిపదికగా గొప్పగా చెప్పుకుంటారు. వీరి పూర్వీకులు మహార్లు, మాంగులు, మాదిగలు అనబడి పిలువబడే అంటరానివాల్ల పూర్వీకులు స్వయానా తోడబుట్టిన వాళ్ళని, రక్త బంధువులనీ, మన మన వంశ పరంపర మూలాన్ని జాడతీస్తే మనది ఒకటే మూల కుటుంబమని పాపం వాళ్లకు తెలియదు." 

....మహాత్మ జ్యోతిరావు పూలే


    మతాల మధ్య విద్వేశాలను రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొంది రాజ్యాలు ఏలుతున్న బ్రాహ్మణీయ ఆధిపత్య పార్టీల కుట్రలను బద్దలు కొట్టాల్సిన తరుణంలో ఉద్యమ నాయకత్వం వాస్తవ చరిత్రను ప్రజలకు తెలియజెప్పి వర్తమానంలో పూలే లాగా శోధించి భోధించి లక్ష్యం చేరుకోవాల్సిన అవసరముంది. 

   భారతదేశంలోకి చొరబడిన ఆర్యులు ఒకే రక్త సంబంధీకులైన దేశ ప్రజల మధ్య కుల దొంతరలను, మతాలను చొప్పించి ఎన్నో అసమానతలు సృష్టించారు. ఆర్యుల పాలన, అంటరానితనం వల్లనే భారతదేశంలో మత మార్పిడులు ఎక్కువగా జరిగాయి. ఆర్య బాపండ్లు అమలు చేసిన అంటరానితనం, మనుధర్మ శాస్త్రం వల్లనే మెజార్టీ శూద్రులు ఆనాటి పాలక మతమైన ఇస్లాం, క్రిస్టియన్ మతాలలోకి మారారు. సమానత్వం కోసం, ఆత్మగౌరవం కోసమే శూద్రులు ఆనాడు ఇస్లాం మతంలోకి మారారని, సమానత్వం, స్వాభిమానం తో పాటు విద్య, వైద్య అవకాశాల కోసం శూద్రులు క్రిస్టియన్ మతంలోకి మారారనే సత్యంతో పాటు పూలే చెప్పిన రక్త సంబంధాల చరిత్రను ప్రజలకు తెలియజెప్పి బహుజన ఐక్యత కోసం కృషి చేయాలి. రెండు వేల సంవత్సరాల పాటు మనుధర్మ శాస్త్రాన్ని దేశంలో అమలు పరచడం వల్లనే ప్రజలు ఇస్లాం, క్రిస్టియన్ మతంలోకి మారిన వాస్తవాన్ని తెలపాలి. 

    విదేశీ బ్రాహ్మణులు దేశీయులుగా ప్రచారం చేసుకుంటూ దేశ మూలవాసి ప్రజల నుండి విడిపోయిన ఇస్లాం, క్రిస్టియన్ ప్రజలను విదేశీయులుగా తప్పుడు ప్రచారం చేసి మత కల్లోలాలను సృష్టిస్తూ రాజ్యాధికారాన్ని కాపాడుకుంటున్న ఆధిపత్య కులాల కుట్రలను బద్దలు కొట్టాల్సిన అవసరముంది. ఇలాంటి భయంకర రాజకీయాలను ఎదురుకోవడం కోసం పూలే కాలం నుండి ఎన్నో ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. పూలే, పెరియార్, అంబేడ్కర్, కాన్షీరాం వారసులు బహుజన రాజ్య స్థాపన కోసం ప్రయత్నాలు చేస్తుండగా ప్రగతిశీల శక్తులు "భారత్ బచావో" అంటూ నినదిస్తున్నారు. బహుజన, ప్రగతిశీల శక్తులు, బౌతికవాదులు పీడిత వర్గ ప్రజల ఐక్యత కోసం పూలే లాగా సత్య శోధన చేయాల్సిన అవసరముంది. 


విద్యకు జ్యోతిబా పూలే సహకారం


విద్య లేనందున - జ్ఞానం లేకుండా పోయింది

జ్ఞానం లేనందున - నైతికత లేకుండా పోయింది 

నైతికత లేనందున - ఐకమత్యం లేకుండా పోయింది

ఐకమత్యం లేనందున - శక్తి లేకుండా పోయింది

శక్తి లేనందున శూద్రులు అణచివేయబడ్డారు. 

ఇన్ని అనర్ధాలు కేవలం అవిద్య వల్లే జరిగిపోయాయి

...మహాత్మ జ్యోతిరావు పూలే


    వేల ఏండ్లు భారతదేశ మూలవాసి ప్రజలను అణచివేసిన పురోహిత వర్గంపైన శూద్రులకు ఉండే పిచ్చి భక్తిని, వాళ్ళు ప్రజలపై రుద్దిన పనికిమాలిన చాదస్తాల్ని, మనిషి అభివృద్ధికి అడ్డంకి అయిన గుడ్డి నమ్మకాలను, పరంపరగా వస్తున్న చిత్ర విచిత్ర కల్లబొల్లి కథల్ని మహాత్మ జ్యోతిరావు పూలే అసహ్యంచుకొని శూద్రుల, అతి శూద్రుల దుస్థితికి, బానిసత్వానికి కారణం విద్య లేకపోవడం వల్లనే అని  శాస్త్రం, మతం, సంఘాచారాలన్నీ మూఢ, స్వార్ధ మానవులు కల్పించినవేనని కంచు పదును లాంటి రాతలతో వాటిని ఖండించాడు. యుగ యుగాలుగా ఈ జడ సమాజంలో ఒదిగి ఉన్న చీకటిని, పేరుకుపోయిన కుళ్లును, స్వార్ధాన్ని, తొలిగించడానికి చివరి నిమిషం వరకు కృషి చేసిన మహాత్మ జ్యోతిరావు పూలే చరిత్ర నేటి తరం సామాజిక ఉద్యమకారులకు, బహుజన రాజ్యం కోరుకునే వారికి ఎంతో స్ఫూర్తినిస్తుంది. 

    బ్రిటీష్ పాలనలోనే జన శ్రేయస్సుకు వ్యతిరేకమైన ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించిన పూలే పేద కుటుంబాలను ధ్వంసం చేసే కళ్ళు దుకాణాలను వ్యతిరేకించడమే కాకుండా ప్రాథమిక విద్యాభివృద్ధికి నిధులు కేటాయించాలని పోరాటం చేశారు. 19 వ శతాబ్దంలో పూలే రచించిన "గులాంగిరి" రచన దేశ మూలవాసి ప్రజల బానిసత్వానికి అద్దం పడుతుంది. ఈ రచన శూద్ర, అతి శూద్రులను పురోహిత వర్గం పైనున్న మానసిక దాస్యాన్ని ఒదులుకొమ్మని భోధించడమే కాకుండ సమాజంలోని కుళ్లును, దాన్ని కడిగి వేసే మార్గాన్ని సూచిస్తుంది. మత గ్రంధాలన్ని మాయాబజారు సరుకులేనని, వాటిలో ఏమి ఆలోచన, పరిశుద్ధతా, నాణ్యత, పవిత్రతా, ప్రామాణికతలు లేవని "గులాంగిరి" రుజువు చేసింది. సమసమాజ స్థాపన కోసం ప్రతి కులానికి జనాభా దామాషా ప్రకారం సకల సామాజిక రంగాల్లో అవకాశాలు కల్పించాలని బ్రిటీష్ కాలంలోనే పూలే సూచించడం గొప్ప విషయం.


మహాత్మ బిరుదు


    బ్రాహ్మణ సంస్కృతిలో అత్యంత దారుణంగా అణచివేయబడిన మహిళలు, అంటరానివారి అభ్యున్నతి కోసం కృషి చేసిన జ్యోతిరావు ఫూలే సత్యశోధక్ సమాజాన్ని స్థాపించి సత్యాన్ని శోధించడంతో పాటు కుల అసమానతలను తొలిగించడం, లింగ వివక్షకు వ్యతిరేకంగా, సామాజికన్యాయం కోసం కృషి చేసారు. పూలే ఉద్యమ ప్రాముఖ్యతను గుర్తించిన మహారాష్ట్ర సామాజిక కార్యకర్త విఠల్‌రావ్ కృష్ణాజీ వందేకర్ 1888 లో జ్యోతీరావ్ ఫూలే కి 'పూజ్యనీయుడు' లేదా 'మహాాత్ముడు' అని అర్థం వచ్చే గౌరవప్రదమైన మహాత్మా బిరుదును ప్రదానం చేశారు. అప్పటి నుండి జ్యోతిరావు పూలే ను మహాత్మ అని గొప్పగా పిలుస్తున్నారు.


    జ్యోతిబా ఫూలే సంఘ సంస్కర్త


   సాంప్రదాయ బ్రాహ్మణులు, ఇతర ఉన్నత కులాలను "కపటవాదులు" అని దాడి చేసిన మహాత్మా జ్యోతిరావు పూలే అధికార వ్యతిరేక ప్రచారాన్ని నడిపాడు. రైతులు, శ్రామికవర్గంపై విధించిన పరిమితులను నిరోధించమని పోరాటం చేసాడు. విభిన్న నేపథ్యాలు కలిగిన అట్టడుగు కులాలకు చెందిన అతిథులను అతను తన ఇంటికి ఆహ్వానించాడు. సామాజిక సంస్కరణ కార్యక్రమాలన్నింటిలో తన భార్యను చేర్చుకోవడం ద్వారా తన అభిప్రాయాలను ఆచరణలో పెట్టాడు. జ్యోతిరావు చర్యలపై మండిపడిన సాంప్రదాయ బ్రాహ్మణులు అతను సామాజిక నియమాలు, నిబంధనలను భ్రష్టు పట్టించాడని ఆరోపించారు. అతను చాలా మంది క్రైస్తవ మిషనరీలకు ప్రాతినిధ్యం వహించాడని అభియోగాలు మోపారు. జ్యోతిరావు వెరవకుండా తనకు నిజాయితీగా మద్దతునిచ్చే బ్రాహ్మణ సోదరులతో కలిసి ఉద్యమాన్ని కొనసాగించి విజయం సాధించాడు. 


మహాత్మా జ్యోతిబా ఫూలే భావజాలం


 కుల వివక్ష యొక్క సామాజిక అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడటానికి జ్యోతిబాను ప్రేరేపించిన ఒక సంఘటన ఫలితంగా 1848లో భారతీయ సమాజంలో ఒక సామాజిక విప్లవం ప్రారంభమైంది.  ఉన్నత కుల బ్రాహ్మణ కుటుంబానికి చెందిన తన స్నేహితుల వివాహానికి జ్యోతిరావుకు ఆహ్వానం అందింది.  కానీ పెళ్లికొడుకు కుటుంబానికి జ్యోతిబా మూలాల గురించి తెలియడంతో, వారు పెళ్లిలో అతన్ని అవమానించి హింసించారు. ఆనాడు ఉన్న కుల వ్యవస్థను, సామాజిక పరిమితులను వ్యతిరేకించాలని నిర్ణయించుకున్నందున జ్యోతిరావు పూలే వేడుక నుండి పారిపోయారు. బ్రాహ్మణీయ ఆదిపత్యాన్ని కనికరం లేకుండా వ్యతిరేకించి మెజార్టీ ప్రజల సామాజికన్యాయం కోసం పని చేయడమే తన జీవిత లక్ష్యంగా చేసుకున్న పూలే సామాజిక అన్యాయానికి గురైన ప్రజలందరి విముక్తి కోసం పనిచేశాడు.

   థామస్ పైన్ యొక్క ప్రసిద్ధ గ్రంధం "ది రైట్స్ ఆఫ్ మ్యాన్" చదివిన తర్వాత పెద్ద ప్రభావానికి గురైన పూలే సామాజిక రుగ్మతలను పరిష్కరించడానికి మహిళలకు, అట్టడుగు కులాల సభ్యులకు విద్యను అందించడమే ఏకైక మార్గమని ఆయన భావించారు.


జ్యోతిబా ఫూలే మరణం


  తన జీవితాంతం బ్రాహ్మణుల అణచివేత నుండి అంటరాని వారిని విడిపించడానికి కృషి చేసిన పూలే సామాజిక సంస్కర్త మరియు కార్యకర్త మాత్రమే కాదు, విజయవంతమైన వ్యాపారవేత్త కూడా. మున్సిపల్ కార్పొరేషన్‌లో కాంట్రాక్టర్‌గా, సాగుదారుగా కూడా పనిచేసిన పూలే 1876 ​​- 1883 మధ్య పూనా మునిసిపాలిటీ కమిషనర్‌గా ఉన్నారు. 1827 ఏప్రిల్ 11 న మహారాష్ట్రలోని సతార జిల్లాలో చిమ్నా పూలే, గోవిందరావు పూలే లకు  జన్మించిన పూలే 28 నవంబర్ 1890న మరణించారు.



(ఏప్రిల్ 11 న మహాత్మ జ్యోతిబా పూలే 196 వ జయంతి సందర్భంగా)


     సాయిని నరేందర్ న్యాయవాది

సామాజిక, రాజకీయ విశ్లేషకులు

     9701916091





కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు