పతంజలికి అక్షరాంజలి


ఒక కవితాధార..



రచనా ప్రవాహం..మాటల తూటాలు..భావాల పరంపరలు..వ్యవస్థతో పయనిస్తూ తిరుగుబాటు చేయకుండానే కుళ్ళు కడిగిన వైనం..తన జరుగుబాటు చూసుకోకుండా సమాజం కళ్ళు తెరిపించిన విధానం..ఇవన్నీ కలగలిపితే ఒకే వ్యక్తి..ఆ వ్యక్తిని దగ్గర నుంచి పరిశీలిస్తే ఒక శక్తి..ఆయన హృదయాంతరాలను కదిలిస్తే ఒక విస్ఫోటనం..ఆయన చేతి వేళ్ళు కదిపి మాటలు రాస్తే సంచలనం..ఓ నాలుగు కథలను కలిపి చూస్తే సమున్నత భావాల సంకలనం..ఇలాంటి ఎన్నో అంశాలను పరంపరగా పేర్చినా..మరెన్నో మాటలను ఒక్కటొక్కటిగా కూర్చినా ఇంకెన్నో లక్షణాలను ఒకేచోట చేర్చినా ఆ మహావ్యక్తి పరిచయాన్నే ఇంకా ప్రారంభించినట్టు కాదు..ఆ మాటల మహాసాగరాన్ని,రచనల హిమశిఖరాన్ని,భావాల భాండాగారాన్ని ఓ చిన్న వ్యాసంతో తరచి 

చూడడం..అభివర్ణించడం దుర్లభం..దుస్సాహసం..

        పతంజలి అనే మాటల మాంత్రికుడు,అక్షరాల అక్షయుడు భావాల భాస్కరుడు ఈ యుగంలో..మన విజయనగరం జిల్లాలో పుట్టడం సుకృతం..పతంజలి అనే వ్యక్తి పాత్రికేయుడు కావడం..అదే పాత్రికేయ వృత్తిలో నేను సైతం ఉండడం వల్ల ఆయనతో పరిచయ భాగ్యమే కాక కొన్ని సందర్భాలలో ఆయనతో మాటాడే అవకాశం..అదృష్టం లభించింది.ఆయనలా రాయలేక పోయినా ఆయన రచనలు కొన్నింటిని చదివి వాటిపై ఆయనతో చర్చించే మహద్భాగ్యం దక్కింది..ఆ సందర్భంలోనే ఆయన భావాలను ఇంకాస్త లోతుగా తెలుసుకోగలిగాను..పతంజలి రచనల గురించి ఇక్కడ విశ్లేషించే ప్రయత్నం చేయడం లేదు.అది సూర్యుడిని దివిటీతో చూపించే యత్నమే అవుతుంది.అయినా ఆయన రచనలు చదవడంలోనే కిక్కు..అదే లక్కు..పతంజలి మన దృష్టిలో గొప్ప వ్యక్తే అయినప్పటికీ ఆయన పాండిత్య స్థాయిని బట్టి ఆయనకు దక్కిన గుర్తింపు తక్కువే.విజయనగరం అంటే  గురజాడ ఎలాగో,చాసో ఎంతో..ద్వారం వారు ఏపాటో..ఆదిభట్ల ఏ రీతో..కోడి రామ్మూర్తి ఏ మాత్రమో..

ఘంటసాల,సుశీలమ్మ 

ఏ స్థాయో పతంజలి కూడా అంతే.ఇది అతిశయోక్తి కాదు.నిజానికి పతంజలి ప్రపంచ స్థాయి రచయిత..గురజాడ ఆధునిక యుగ మనిషిని గిరీశం రూపంలో సృష్టించగా పతంజలి ప్రతి మనిషిలోనూ దాగి ఉండే గిరీశాన్ని తన పాత్రల ద్వారా ఆవిష్కరించారు..నాటి తరం రచయితల్లో గురజాడ శైలి ఎంత సలక్షణమైనదో నిన్నటి తరం రచయితలలో పతంజలి శైలి అంత విలక్షణమైనది..వ్యంగాస్త్రాలు సందించడంలో పతంజలి శైలే వేరు. ఒక్కో అక్షరం అణ్వాస్త్రం..ఒక్కో మాట తూటా..ప్రతి పంక్తిలోనూ ఒక చలోక్తి..ప్రతి పుటా ఒక కీర్తి బావుటా..పతంజలి వాడే భాష మనకు బాగా పరిచయమైనదే..అది మనం నిత్యం వాడే భాషే.మన గుండె ఘోషే.ఆయన పాత్రల మధ్య సంభాషణలను పరికిస్తే మనం మాటాడుకుంటున్నట్టే ఉంటుంది..

     విజయనగరం జిల్లాలో వాడే మాటలు,పడికట్టు పదాలు పతంజలి రచనల్లో చక్కగా ఇమిడిపోయి ఉంటాయి.ఎక్కడ ఏ పదం పడాలో అక్కడ సరిగ్గా అదే పదం..అందులో లోతైన వాదం..ఆయన అంతరాంతరాలలో నిత్యం జరిగే సంవాదం..ఇవన్నీ పతంజలి రచనలలో అణువణువునా కనిపించేవే..

       విజయనగరం జిల్లా పతంజలి రచనలకు కేంద్రబిందువు..ఈ జిల్లాలోని అలమండ ఆయన కథలకు స్ఫూర్తిధాతువు.నిత్యం మన కళ్ళ ముందు కదలాడే సాధారణ మనుషులు ఆయన కథలలో హీరోలు.గ్రామాలలో చిన్న స్థాయి పెత్తందార్లు..పైస్థాయి గుత్తేదారులు వాటిలో క్యారెక్టర్లు.మన మధ్య రోజూ కనిపించే కొందరు మనుషులే ఆ కథలలో కమెడియన్లు.

ఆయన రచనలలోని ప్రతి పాత్ర సజీవ రూపమే.ఒక్క గోపాత్రుడు చాలు ఆయన పాత్రల విలక్షణతను చాటడానికి...!

    ఒక వ్యక్తిగా పతంజలితో నాకు పరిచయం ఏర్పడడానికి నాకున్న ఒకే అర్హత జర్నలిస్టు కావడమే.విజయనగరం జిల్లా వాడినే అనే టాగ్ లైన్ కొంత సాన్నిహిత్యాన్ని ఏర్పరిస్తే..ఆయన సోదరుడు..సహచర జర్నలిస్టు జైముని స్నేహం నన్ను అలమండలో ఆయన ఇంటికి కొన్నిసార్లు తీసుకు వెళ్ళింది..అలమండలో రాజసం ఉట్టిపడే కాకర్లపూడి వారి ఇంట్లో ఆరుబయట పాక నీడలో వారి ఆతిథ్యం స్వీకరిస్తూ ఆ గొప్ప వ్యక్తితో మాటాడే అవకాశం లభించింది.ఆయన అన్నదమ్ముల పేర్లే చిత్రంగా ఉంటాయి. నృసింహయోగ పతంజలి..గౌతమ న్యాయ శంకర్..భగవాన్ 

కృష్ణమీమాంశ జైముని..ఇలా ఆరుగురు అన్నదమ్ముల పేర్లు తెలుసుకున్న తర్వాత అర్థమైంది అవి ఆరుగురు ఋషుల పేర్లని..అలాంటి అద్భుతమైన పేర్లు పెట్టిన వారి తండ్రి మరో అద్భుతం..ఆయనది మరో ప్రపంచం.ఆయనో నడిచే విజ్ఞాన భాండాగారం.

మరుగున ఉండిపోయిన 

ఓ మాణిక్యం.ఆయుర్వేద వైద్యుడైన ఆయనతో మాట్లాడితే ప్రపంచాన్ని ముందు పరిచేసారు.పిండం నుంచి బ్రహ్మాండం వరకు ఆయనకు తెలియని విషయమే లేదు.ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శాస్త్రవేత్తలు, వైద్యులు..ఇతర రంగాలలోని ఎందరో ప్రముఖులతో 

ఆ రోజుల్లోనే ఆయన ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపి ఎన్నో గొప్ప విషయాలను పంచుకున్నారు.అంతటి మేధస్సుకు వారసుడు గనకనే పతంజలి గొప్ప యశస్సును పొందారు..

     పతంజలి అంత గొప్ప రచయిత,వ్యక్తి అయినా కూడా ఆయనలో గర్వం రవ్వంతయినా కనిపించలేదు.

అంతెందుకు..మా జర్నలిస్టులకు సంబంధించి ఆయనో పెద్ద బాసు..కానీ ఆ తిరకాసు ఆయనలో లేదు..తమ్ముడిలాగే ఆదరించారు.. గురువులాగా ఎన్నో విషయాలు చెప్పారు..మాటాడిన ప్రతిసారి ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్న భావన..మనమూ ఆయనలా రాయాలని తపన..ఆ శైలిలో కొంతయినా పట్టాలని యాతన..అందుకోసం సాధన..కొంతయినా సాధించగలిగితే స్వాంతన..మొత్తానికి ఆయన పట్ల అంతులేని ఆరాధన..


సుప్రసిద్ధ రచయిత..

పాత్రికేయుడు 

కాకర్లపూడి నృసింహ యోగి పతంజలి జయంతి సందర్భంగా

        *సరస్వతీ పుత్రునికి* 

             *అక్షర నీరాజనం*

    

   *ఎలిశెట్టి సురేష్ కుమార్*

                *9948546286*

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు