పది మంది నోట్లో నానేదే హిట్టు పాట.._


ఆస్కార్ హ్యాపీ...

అయినా తప్పని ఈ కూపీ!_


పది మంది నోట్లో నానేదే హిట్టు పాట..


దేవదాసు సినిమాలో 

ఎన్ని పాటలున్నా 

ఆ రోజుల్లో జనాలు 

తెగ పాడేసుకున్న పాట..

జగమే మాయ.

*_బ్రతుకే మాయ.._*

*_వేదాలలో సారమింతేనయా.._*


అలాగే మాయాబజార్లో 

*_వివాహ భోజనంబు.._*

*_వింతైన వంటకంబు.._*

*_వియ్యాల వారి విందు.._*

*_అహహ నాకె ముందు.._*

ఈ పాట ఇప్పటికీ..ఎప్పటికీ

ఒక సంచలనమే..

ఉన్నది పౌరాణిక సినిమాలోనే అయినా

పూర్తిగా తెలుగుదనం ఉట్టిపడే పాట.. 

*న భూతో..న భవిష్యత్..!*

రోజులు మారాయి సినిమాలో 

*_ఏరువాక సాగారోరన్నో.. చిన్నన్నో_*

*_నీ కష్టమంతా_*

*_తీరునురోరన్నో చిన్నన్నో.._*

పల్లె పదానికి పరాకాష్ట..!


*_అయయో జేబులో డబ్బులు పోయెనే..అయయో_*

*_జేబులు ఖాళీ ఆయెనే.._*

ఈ  పాట ఎంత పాపులరో

తెలియనిది కాదు..


అలాగే 

*_సరదా సరదా సిగిరెట్టు.._*

*_ఇది దొరల్తాగు_*

*_భల్ సిగిరెట్టు.._*

*_కంపు గొట్టు ఈ సిగిరెట్టు.._*

*_ఇది కాల్చకోయి నాపై ఒట్టు.._*

అచ్చ తెలుగు పదాలు...

మన వాడుక భాషకు 

పాటెత్తు రూపం..!


పై రెండు పాటలూ

వ్యసనాలను అటూ ఇటూ

చూపించిన గొప్ప గీతాలు..

జనం వీటికి విపరీతంగా కనెక్ట్

అయిపోయిన మాట తిరుగులేని సత్యం..!


*_ఆడుతు పాడుతు పని చేస్తుంటే అలుపూ సొలుపేమున్నది.._*

*_ఇద్దరమొకటై చేయి_* *_కలిపితే ఎదురేమున్నది.._*

*_మనకూ కొదవేమున్నది.._*

మన పల్లెసీమ వాతావరణాన్ని కళ్ళకు కట్టినట్టు చూపుతూ చెమటే సిరాగా రాసిన గీతం..!


ఇక అడవిరాముడులో

*_ఆరేసుకోబోయి పారేసుకున్నాను.._*

*_హరి...హరి.._*

*_కోకెత్తుకెళ్ళింది కొండగాలి.._*

*_నాకు ఉడుకెత్తిపోతోంది_*

*_హరి హరి.._*

ఉరకలెత్తించేసే పాట..

వింటుంటే ఎవరైనా గాని

ఆటోమేటిగ్గా ఒళ్ళు 

ఊపాల్సిందే..!


నవయుగంలో 

పుష్ప పాట

*_చూపే సింగారమాయెనే.._*

*_శ్రీవల్లి మాటే మందారమాయెనే.._*

ఇది దేశదేశాల్ని కుదిపేసింది...

ఎన్నో దేశాల్లో టిక్టాక్లు..

మైములు..

ప్రమోలు..డెమోలు...

ఒక సంచలనం..

ఇటీవలి కాలంలో అత్యధికంగా జనబాహుళ్యంలోకి

చొచ్చుకుపోయిన పాట

ఇదేనంటే అతిశయోక్తి కాదు..!


ఇవి నాకు తెలిసినవి..

గుర్తు వచ్చినవనే కాదు..

తెలిసిన వాటిలో కొన్ని ఉటంకించానంతే..నా కలం అన్నీ రాస్తే ఈ కాలమ్ 

పేజీలు..కేజీలు దాటి 

ఆస్కార్ ను చేరే ఆస్కారం లేకపోయినా ఎక్కడికో పోతుంది..!


ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే

*_ఆర్ ఆర్ ఆర్ నాటు_* పాటకి

ఆస్కార్ వచ్చినప్పటి నుంచి

సాగరమధనాలు..

అంతర్మధనాలు జరుగుతూనే ఉన్నాయి.

ఈ అంశంపై నేను రాసిన రెండు కథనాలపై వ్యక్తమైన అభిప్రాయాల్లో సైతం..

*_పోనీలెండి సార్..మన భారతీయ సినిమా.._* *_అందునా తెలుగు పాటకి_*

*_ఆస్కార్ వచ్చింది..అదే_* *_సంతోషం.._* అంటున్నారు కొందరు.. అంతేగాని అది గొప్ప పాట సుమా..అనలేదు..!


ఎక్కువమంది  మన తెలుగు సినిమాల్లో ఎన్నో అపురూప గీతాలను మించి నాటులో

అంత ఘాటు ఏముందో తెలియదు అన్న వారే..

సరే..ఏ విషయంలోనైనా భిన్నాభిప్రాయాలు సహజం.

అయితే మన తెలుగు పాటను ఆస్కార్ వరించడం అందరికీ సంతోషమే..

ఇది పక్కా.!


నిజానికి ఆస్కార్  రాకమునుపు ఈ పాటను సినిమాలో గాక బయట ఎందరు ఎన్నిసార్లు పూర్తిగా విని ఉంటారు.ఎంతమందికి 

ఆ పాట కంఠస్థం వచ్చి ఉంటుంది..అంతలా మన నోట్లో ఆ పాట నానిందా..

మనం నిత్య జీవనంలో 

యధాలాపంగా ఆ పాటను హమ్ చేస్తున్నామా..

ఆ పాట వింటుంటే 

మన శరీరం ఊగుతోందా..

పూనకాలు వచ్చేస్తున్నాయా..

ఏదైనా సందర్భంలో 

ఈ పాటని 

గుర్తు చేస్తున్నామా..?

చేసుకుంటున్నామా..!?


వాస్తవానికి స్టెప్పులే సాహిత్యం కంటే ఎక్కువగా 

ఆ పాటను హిట్టు కొట్టించాయి..అవి కూడా 

పదేపదే పడీపడీ 

చూసేంతగా కాదు..!


ఇంకో విషయం ఏమిటంటే

నాటు నాటుకు ఆస్కార్ ప్రకటించగానే రచయిత చంద్రబోస్ తో పాటు..

అంతకంటే హుషారుగా వేదికపైకి వెళ్లిన సంగీత దర్శకుడు కీరవాణి..

కార్యక్రమంలో ఎలాగైతే డామినేట్ చేశారో

అలాగే పాట కంపోజింగులో

కూడా సంగీతంతో సాహిత్యాన్ని మింగేశారు.

నాటు పాటలోని బీటు

సాహిత్యం ఎవరికీ అర్థం కానంతగా హోరెత్తించి ఇప్పుడు ఆస్కార్ మెచ్చిన తర్వాత జనం కూడా గొప్ప జానపదం అంటూ పొగిడేస్తున్నారో..ఆ పదాలు సరిగా అర్థం కాని మోత..

నాటు పాట గనక అంతటి వీరమోత అవసరమే అనొచ్చు.. అప్పుడిక సాహిత్యానికి పాటలో పట్టం కట్టిందెక్కడ..?


ఇక హిందీ..తమిళ..

మలయాళ..ఇతర భారతీయ భాషల్లో ఎన్నో హిట్టు పాటలు మనం విన్నాం..కన్నాం..

మన భారతీయ సినిమాలు

ఎన్నిటికో గతంలో ఆస్కార్ వస్తుందని..ఒకనాటి దిగ్గజ హీరోలు రాజ్ కపూర్..

దిలీప్..రాజ్ కుమార్..

నర్గీస్(మదరిండియా)..

అమితాబ్.. 

కమల్(ది ఇండియన్)..

విక్రమ్(పితామగన్..అన్నియన్)..ఇలా రాసుకుంటూ పోతే ఓ పరంపర...!


మహానటులు.. దిగ్గజ దర్శకులు..అద్భుత గాయకులు..గొప్ప రచయితలు..

ఎవరూ సాధించలేని విజయం..*రాజమౌళి..కీరవాణి..చంద్రబోస్..* సాధ్యం చేశారు.

భారతీయులు అందరిలో పట్టరాని సంతోషం..

కాని..నిజాయితీగా మాటాడుకుంటే 

ఆ మాటున ఎక్కడో 

ఓ బాధా వీచిక...

*_అంత సీనుందా..!?_* అని...


ఇంగ్లీషు సినిమా చూస్తున్నప్పుడు ఎక్కడో ఒక మంచి డైలాగ్ పడినప్పుడు థియేటర్లో ఒక్కరెవరైనా నవ్వితే  మనకి అర్థం కాలేదని అనిపించుకాకుండా

అందరూ బిగ్గరగా నవ్వినట్టు..


బహిరంగ సభకో..ప్రవచనానికో వెళ్ళినప్పుడు ఒక్కరు చప్పట్లు కొడితే ప్రాంగణం అంతా చప్పట్లతో మారు మోగిపోయినట్టు ఆస్కార్ రాగానే నాటు నాటు పాట అందరికీ తెగ నచ్చేస్తోంది..

మాస్ హిస్టీరియా అదేనేమో..!


నా వాదం మీకు ఖేదం తెప్పిస్తే మన్నించండి..

నేను రాసింది 

నిజమని అనిపిస్తే

మనసులోనే మెచ్చుకోండి..!


*_ఎలిశెట్టి సురేష్ కుమార్_*

       9948546286

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు