అధికార వ్యతిరేక ఓట్ల చీలికే ప్రత్యామ్నాయమా ?

               


 బిఆర్ఎస్ జాతీయ రాజకీయాలలో దేనికి ప్రత్యామ్నాయం ?

 భారతీయ రాష్ట్ర సమితి ఏర్పాటు ఎన్నికల కమిషన్ గుర్తించింది. ఒక జాతీయ పార్టీ అవతరించింది. దాన్ని మూడో ప్రత్యామ్నాయం అనో, సిసలైన ప్రత్యామ్నాయం అనో అనుకోవాలని ఆ రాజకీయ పార్టీ నాయకులంటున్నారు. 

అయితే ,ఒక ఆమ్ ఆద్మీ పార్టీని, ఒక తృణాముల్ కాంగ్రెస్ ను, ఒక మజ్లిస్ ను, ఒక భారతీయ రాష్ట్ర సమితిని మూడో లేదా తక్షణ ప్రత్యామ్నాయం గా చూడడం పప్పులో కాలేసినంత తప్పిదమని ఎందుకో అనిపిస్తున్నది. 

ఇవాళ్ళ పైన పేర్కొన్న ఏ రాజకీయ పార్టీ అయినా ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగా కాకుండా కేంద్ర ప్రభుత్వ అనుకూల పార్టీగా ఉపయోగపడు తున్నాయేమో అనే అనుమానం కలుగుతున్నది.

కొన్ని ఎన్నికలను విశ్లేషించిన క్రమం లో ఆ అనుమానాలకు నివృత్తి కలుగుతుంది. ఉత్తరప్రదేశ్ ఎన్నికల నాడు, ఒకప్పుడు ఆ రాష్ట్రాన్ని ఏలిన బహుజన్ సమాజ్ పార్టీ పూర్తిగా స్తబ్ధం గా ఉన్నది. కారణం తెలియదు గానీ ఆ పార్టీని ఎంచుకోవాలనుకున్న ఓటర్ కి మాత్రం ఆ పరిణామం ఆశ్చర్యం కలిగించి వుంటాది. అలాగే అక్కడి ముస్లిం ఓట్లను గంప గుత్తా పొందగలిగే అవకాశం ఉన్న సమాజ్ వాది పార్టీ ఓట్ల ను చీల్చేందుకు మజ్లిస్ అక్కడ అనేక నియోజక వర్గాల్లో బరిలోకి దిగి అధికార పక్ష వ్యతిరేక ఓట్ల ను చీల్చింది. 

వ్యతిరేక ఓట్ల చీలిక ఇవాళ్టి అధికార పక్షాలెంచుకుంటున్న పాశుపతాస్త్రం. ఆ అస్త్రం ఊతం గా అధికారం మళ్ళీ చేజిక్కించుకునే వ్యూహం ఇప్పుడమలవుతున్నది. అది బెంగాల్ కానీ, ఇతర ఉత్తర భారత రాష్ట్రం కానీ చివరకు గుజరాత్ కానీ చీలాల్సిన ఓట్లు చీల్చే ప్రక్రియ కొనసాగుతున్నది. దీనికి ప్రత్యేక వ్యూహ రచన అవసరం లేదు. ప్రతిపక్ష ఓట్ ను అధికార పక్షం చాకచక్యం గా చీలుస్తుంది. అలా మరో అయిదేళ్ళపాటు అధికారం రెనివల్ అవుతుంది. 

ఆంధ్రప్రదేశ్ లో జనసేన, తెలంగాణ లో వై ఎస్సార్ టీపీ, ఇవి వీలుకానప్పుడు ఏపీలో తెలుగుదేశం ఓట్లు చీల్చేందుకు భారాస ముసుగు ఇవన్నీ ఇవాళ్టి ప్రజాస్వామ్య సూత్రాలు.

కర్ణాటక లో అలా జరగడానికి ప్రతిపక్ష ఓట్ చీలాల్సిన తక్షణావసరం ఉన్నది. దానికి పప్పుచారులో కరివేపాకులా జనతాదళ్ ఎస్ అవసరం ఉన్నది. కుమారస్వామి లాంటి అధికారాపేక్ష తప్ప వ్యూహ పరిజ్ఞానం లేని నాయకుడి అవసరమున్నది. 

దాంతో అక్కడ మళ్ళీ భాజపా అధికారం లోకి వస్తది. ఒక ఆమ్ ఆద్మీ, ఒక మజ్లిస్, ఒక తృణాముల్,ఒక భారాస , చివరికి జనతాదళ్ ఎస్ లు భారతీయ జనతాపార్టీ అమ్ముల పొదిలోని అస్త్రాలుగానే నిలుస్తాయి. ఈ లిస్ట్ ను మరింత పెంచేందుకు తెలంగాణ కృషి చేస్తది. వీళ్లకు కావలసింది ప్రత్యామ్నాయం కాదేమో....!



పి.వి కొండల్ రావు 

సీనియర్ జర్నలిస్ట్





వీడియో కసం ఇక్కడ నొక్కండి




కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు