ఫారిన్ చదువుల మోజు – డాలర్ కోసం పరుగులు - ఆగమవుతున్న బతుకులు

 


                         మాకెందుకన్నట్లు పట్టించుకోని ప్రభుత్వాలు

 

అమ్మాయి పేరు సరస్వతి (పేరుమార్చబడింది). మంచి ఇంజ నీరింగ్ కీలేజీలో ఇంజనీరింగ్ పట్టా పుచ్చుకుంది. మధ్యతరగతి కుటుంబం. తండ్రి సంపాదన మీదనే కుటుంబం గడవాలి. అయినా ఖర్చులు తగ్గించుకుని ఉన్నంతలో చాలా కష్ట పడి చదివించాడు. ఆమె తర్వాత ఇంట్లో మరో ఇద్దరు ఆడ సంతానం. వారిని కూడ ప్రొఫెషనల్ కోర్సులు చదివించాలి. పెద్ద కూతురిగా తండ్రి కష్టాలు అర్దం చేసుకున్న సరస్వతి తన కుటుంబాన్ని ఆర్థిక కష్టాల నుండి గట్టెక్కించి తన చెల్లెల్లకు మంచి భవిష్యత్ ఇవ్వాలను కుంది. ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారు చాలా మంది విదేశాలకు వెళ్లి ఎట్లా  పై చదువులు చదివి  ఉద్యోగాలలో చేరి బాగా స్థిరపడ్డారో స్నేహితుల ద్వారా తెల్సుకుంది. తన ముందు ఉంది ఒక్కటే పరిష్కారం. ఇండియాలోఎంతగా కష్ట పడ్డా కుటుంబాన్ని ఓ మంచి స్థాయిలోకి తీసుకువచ్చేందుకు చాలా కాలం పడుతుంది. చెల్లెల్లను మంచి చదువులు చదివించడం కూడ కష్టం. అందుకే సరస్వతి విదేశాల దారి వెదుక్కుంది.

ఇంజనీరింగ్ లో మంచి మార్కులు పొందిన సరస్వతికి పై చదువుల కోసం రుణం ఇచ్చేందుకు బ్యాంకు కూడ ముందుకు వచ్చింది. రెండు మూడు దేశాలలో ఏదో ఒక దేశానికి వెళ్లేందుకు తన ప్రయత్నాలు మొదలు పెట్టింది.  ఆయా దేశాల్లో కాలేజీలలో దరఖాస్తుల కోసం 20, 30 వేలు ఖర్చుపెట్టింది. కొన్నికాలేజీల నుండి చదువుకు ఆమోదం వచ్చింది. పాస్పోర్ట్ అని, పోలీస్ వెరిఫికేషన్అని, హెల్త్ చెకప్ అని, ఎన్నో ఆఫీసులు తిరిగి అన్ని అవసరమైన డాక్యుమెంట్సు సమ కూర్చుకుంది. విదేశాలకు పోయేందుకు అక్కడి ఇంగ్లీషు భాషలో ప్రావీణ్యత అవసరం కనుక IELTS,GRE,  పరీక్షలకు ప్రిపేర్ అయి వాటిల్లో కూడ మంచి స్కోర్ సాధించింది. బ్యాంకు రుణంతో విదేశాలకు వెళ్లింది.  అక్కడ ఒక సంవత్సరం వరకు ఖర్చులు భరించేందుకు ముందుగానే కావలసిన ఖర్చులను కూడా బ్యాంకులో జమ చేసుకుంది.  ఇదంతా జరిగేందుకు ఆరునెలలు పట్టింది. ఫీజుకట్టిన కాలేజీ ఉన్నదేశం నుండి వీసా రాలేదు. పంపిన డబ్బులకు వడ్డీ మాత్రం పెరుగుతోంది. మంచి మార్కులు ఉన్నాయి. విదేశాల్లో చదివేందుకు అవసరమైన కోర్సుల్లో అవసరమైన స్థాయికన్నా ఎక్కువ మార్కులు సంపాదించింది. అయినా అదంతా వృధా ప్రయాసగా మారింది.  ఇక్కడ కూడా ఉద్యోగాలు వచ్చాయి కానీ. అవి అతితక్కువ వేతనంతో బొటాబొటి అయిన ఉద్యోగాలు కావడంతో  ఆ జీతాలతో వారి కుటుంబం అవసరాలు అనుకున్న మేర తీరేవి కావు. తండ్రి రిటైర్ మెంట్ కు దగ్గర్లో ఉన్నారు.  ఈ పరిస్థితుల్లోనే సరస్వతి ఎంతో ఆశతో ప్రయత్నాలు చేసింది. 

సరస్వతి దరఖాస్తును తిరస్కరించినట్లు ఆమెకు సమాచారం ఇచ్చారు. ఇంతకు ఆమె దరఖాస్తును నిరాకరించేందుకు ఇచ్చిన కారణాలు కూడ చాలా విచిత్రమైనవి.  మీరు చదువుకున్నకోర్సుకు మీరు అప్లై చేసిన కోర్సుకి సంబంధం లేదని. మీరు ఈదేశం వచ్చేందుకు మీరు చెప్పిన ఉద్దేశం(స్టేట్మెంట్ఇఫ్పర్పస్) చదువుకునేందుకని,   స్థిర పడేందుకు కాదని రాసి ఇచ్చింది మేము నమ్మడం లేదు అని వీసా తిరస్కరించారు. నిజంగా అలా నే రాసి ఇవ్వాలి అని ఆమెకు సహాయపడ్డ ఏజెంట్  ఇచ్చిన సలహా మేరకు ఆమె రాసి ఇచ్చింది.

కొన్ని నెలల తర్వాత ఆమె కాలేజీకి కట్టినషడబ్బు తిరిగి పంపారు . దాని మీద కట్టిన వడ్డీ వేలకు వేలు పెరిగింది. ఇక ఇప్పుడు ఆమెకు ఏదారి తోచక . ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంది. ఆ ప్రయత్నం ఫలించ లేదు. గత్యంతరం లేక ఇక్కడ ఏదో చిన్న ఉద్యోగం చేస్తూ పెళ్లిళ్ల గురించి, మంచి జీవితం గురించి మర్చి పోయి కుటుంబ భారాన్ని మీదేసుకుని విదేశి మోజు కలగా మిగిలి జీవనం సాగిస్తోంది.

 ఇలాంటి వారు చాలామంది ఉన్నారు. వీరి కోసం మన దేశం చేస్తున్నటు వంటి సహాయం ఏంటంటే విదేశాలకెలా పోవాలో తెలిపే సమాచారమున్న ఒకపుస్తకం ప్రచురించటం. అంతకు మించి విదేశాలకు వెళ్లే వారికి చేసే సహాయం అంటూ ఏమి లేదు. ఇందు కోసం ఓ ప్రత్యేక మైన సెల్ అంటూ లేదు. చిత్ర విచిత్రమైనటు వంటి కారణాలతో దారి తెన్నూ లేక చాలా మంది తమ కోరికలు తీరక నిరాశా నిస్పృహకు లోనవుతున్నారు.  ఇలాంటి వారి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా  మంత్రిత్వ శాఖలు ఏర్పాటు చేసి అదుకోవాల్సిన అవసరం ఉంది.

 

ఉన్నత విద్యకు వారి దేశాలకు వచ్చే విద్యార్థుల విషయంలో విదేశాలు కూడా రకరకాల పద్ధతులు అవలంబిస్తున్నాయి. కొన్నిదేశాలు, చదువుకొని అక్కడ స్థిరపడేందుకు చదువుకునేప్పుడు సంపాదించుకునేందుకు అవకాశాలు కల్పిస్తే  మరి కొన్నిదేశాలు అలాంటి అవకాశాలు కల్పించడం లేదు. వారి దేశానికి విద్యార్థుల ద్వారా విదేశీ మారక ద్రవ్యం వస్తున్నా, వారి కాలేజీలకు సంపాదన విపరీతంగా పెరిగినా, చదువుకున్న తర్వాత ఉద్యోగం చేస్తూ వారి ఆర్థిక వ్యవస్థకు ఎంతో దోహదపడుతూ అక్కడ సాంకేతిక అభివృద్ధికి తమసర్వస్వం ధారపోస్తున్న, ఇలాంటి విద్యార్థులను అక్కడి దేశాలు చాలా చిన్నచూపు చూస్తున్నాయి. వారి జీవితాలతో ఆడుకుంటున్నాయి. అమెరికాలో అయి తే ఉద్యోగం రాక శాశ్వత పౌరత్వం వారికి ఇవ్వక పోగా వీసా కోసం తిరిగి తమ దేశం వెళ్లేందుకు అయినా కావల్సిన ఖర్చులు తిరిగి సంపాదించేందుకునేందుకు ఆదేశంలో ఉండే వారిని దొంగల్లాగా వారిపై నిరంతరం నిఘా ఉంచి  రేడియోఫ్రీక్వెన్సీ డివైస్ లను వారి కాళ్లకు కట్టి వారిని బంధించి మళ్ళీ తిరిగి ఇక్కడికి పంపించేస్తున్నారు.

నిజానికి అభివృద్ధి చెందిన దేశాలకు వెళ్లే అందరి విద్యార్థులు కూడా అక్కడ చదివి ఉద్యోగం చేసి ఎక్కువ సంపాదనతో హాయిగా బతకడం కాకుండా ఇక్కడ ఎన్నో త్యాగాలు చేసి వారిని చదివించిన తల్లిదండ్రులకు దోహదపడదామనే ఉద్దేశంతోనే లక్షల మంది ఆదేశాల్లో సిరపడ్డారు. ఒక అమెరికాలోనే 44 లక్షల పైచిలుకు మన దేశీయులు ఉన్నారు. అలాంటి వారి ద్వారా మన భారత దేశానికి ఏటా 80 బిలియర వి డాలర్లే విదేశీ మారక ద్రవ్యం వస్తున్నది. అసలు 1990లో విదేశీ మారక ద్రవ్యం లేకుండా అత్యంత క్లిష్ట పరిస్థతిలో  ఈ దేశం ఉంటే ఇలాంటి విద్యార్థులు కష్టపడి చదువు కొని సొంత డబ్బులతో విదేశాలకు వెళ్లి అక్కడి నుండి విదేశీ మారక ద్రవ్యం పంపడం వల్ల మన దేశపరిస్థితినీ తట్టుకునేందుకు చాలా దోహద పడింది అనేది ఆర్థికవేత్తలు అంగీకరించిన విషయం.

అయినా ఇలాంటి విద్యార్థులు చదువుల కోసం అంటూ వచ్చినా ఆ తర్వాత అక్కడే ఉద్యోగాల చేయవచ్చనే ఆశతో వస్తున్నారని విదేశీయులకు బాగా తెల్సు. అయినా దానికి సంబంధించిన సరైన విధానం ఎందుకు అవలంబించటం లేదో అర్థం కాదు. వారి దగ్గ ర ఇలాంటి విద్యార్థుల గురించి కచ్చితంగా సమాచారం ఉంది.  కేవలం చదువుకునేందుకే ఎంతమంది విద్యార్థులు వచ్చారు ఎంతమంది తిరిగిపోయారు వారికి తెలుసు. తిరిగి వచ్చిన వారి సంఖ్య చాలా తక్కువ ఉంటుంది. అలాంటప్పుడు ప్రతి సంవత్సరం ఎంత మంది విద్యార్థులు ఇక్కడికివచ్చేందుకు, చదువుకొని ఇక్కడ స్తిర పడేందుకు అవకాశం ఇవ్వగలరో అంత మందినే ఒకపద్ధతి ద్వారాఇక్కడ  ప్రవేశ పరీక్ష వంటిది పెట్టి ఓ విధానం ఎందుకు రూపొందించడం లేదో ఇక్కడి కేంద్ర ప్రబుత్వం అయినా ఈ విషయాలపై ఎందుకు దృష్టి సారించడం లేదో అర్దం కాని విషయం.

ఇక్కడి నుండి విదేశాలకు వెళ్లిన విద్యార్థులు పంపే డాలర్లు కావాలి కాని వారి సమస్యలు వద్దు. వారి కష్టాలు వద్దు. మీ ఖర్మ మీరు అనుభవించండి అన్నట్లు కేంద్రం వ్యవహరిస్తోంది. విద్యార్థులు మన దేశం నుండి ఏటా 12 లక్షల మంది విదేశాలకు పోతున్నారు. మన విద్యార్థుల ద్వారా అభివృద్ది చెందిన దేశాలకు వారు చెల్లించే ఫీజుల ద్వారా మారకం బాగా చేకూరుతోంది.

అట్లాగే అక్కడ స్థిరపడి వారు ఇండియాకు పంపించేవి వేల కోట్లలో ఉంటాయని చెప్పవచ్చు. ఇంత పెద్ద మొత్తంలో విదేశీ మారక ద్రవ్యం లభిస్తున్నా ఎందుకు శ్రద్ద పెట్టడం లేదో అర్దం కాని విషయం. ప్రపంచంలోఅన్నిశదేశాలకన్నా ఎక్కువగా ఇండియాకే మారక ద్రవ్యం వీరి ద్వారా సమకూరుతోంది. వారికి ఇతర దేశాల ప్రభుత్వాలతో ఈవిషయంలో సంబంధాలు ఏర్పరచుకొని ఒకశాస్త్రీయ పద్ధతిలో ఇ లాంటి విద్యార్థులను అక్కడికి పంపించి వారు స్థిరపడడంలో, స్థిరపడని వారిని మళ్లీతిరిగి ఇక్కడికి తీసుకురావడంలో వారికి ఉద్యోగాలు కల్పించడంలో ప్రభుత్వాలు బాధ్యత వహించాలి.

ఇలాంటి విద్యార్థుల అవసరాలు తీర్చేందుకు దేశంలోవందల కొలది ఏజెన్సీలు ఉన్నాయి.  ప్రతిసంవత్సరం కోటి 70 లక్షల మంది విద్యార్థులు వీరిని సంప్రదిస్తున్నారు. అందులో 12 లక్షల మందికి వీసాలు వస్తున్నాయని అంచనా. మిగతా వారంతా వారి సమయాన్నిడబ్బులను వృధాచేసుకుంటున్నారు.

అసలు ఇంత ఉన్నత విద్య చదివి లక్షలు అప్పులు చేసి విదేశాలకు పోవడానికి కారణం ఇక్కడ వారికి ఉద్యోగాలు లేకపోవడం. అదికల్పించవలసిన బాధ్యత భారత ప్రభుత్వంపైన ఉంది. లక్షల కోట్లలో పెద్ద పెద్దకార్పొరేట్స్ కు  రాయితీలు ఇస్తున్నప్పటికీ తగినంతగా ఉద్యోగకల్పన లేదు. గత 45 సంవత్సరాలలోఎన్నడూ లేనంతగా నిరుద్యోగస్థాయి మన దేశంలో ఉంది.

ఇలాంటి విద్యార్థుల బలహీనత ఆసరాగా చేసుకుని విదేశాలుషఎన్నోలాభాలు దండుకుంటున్నాయి. పూర్వం ఈవలసవాద దేశాలు మన దేశం నుండి ముడి పదార్థాలు తీసుకువెళ్తే ఇప్పుడు మనం ఎంతో ఖర్చుపెట్టి తయారు చేసిన ఈరోజుల్లోముడిపదార్థాలకన్నాఅత్యంత విలువైన మానవవరులను కొల్లగొడుతున్నాయి. ఉదాహరణకి కెనడాలోవారి దేశస్తుల కన్నా విదేశీ విద్యార్థుల దగ్గర మూడంతలు ఎక్కువగా ఫీజులు వసూలు చేస్తున్నారు అన్నది వాస్తవం.

విదేశాలకు వెళ్లి ఎంతో కష్టపడి ఎన్నోప్రమాదాలు ఎదుర్కొని తల్లిదండ్రులకు డబ్బులు పంపడం వల్ల ఎన్నో కుటుంబాలు బాగుపడ్డాయి.  కానీ ఈవిద్యార్థులు అభివృద్ధి చెందిన దేశాలలో వారి కష్టార్జితంతో తల్లిదండ్రులకు పంపించిన డబ్బు అత్యంత స్వల్పం. సంపాదనలో వారు  బతికేందుకు అక్కడే వ్యయం చేసి కొంత మొత్తంలో మిగులును తల్లిదండ్రులకు పంపిస్తుంటారు. ఈ విదేశీ వ్యామోహంలో పడి ఎంతో మంది విద్యార్థులు వారి కుటుంబాలు చితికి పోతున్నాయనే విషయం కేంద్రం గ్రహించాలి.

ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. విదేశాలకు వెళ్లే విద్యార్థులు అత్యంత ధైర్యవంతులు, తెలివి కలవాళ్ళు. ఇలాంటి మేధో సంపత్తి కలిగిన వారిని ఉపయోగించు కొని మనదేశ సంపద పెంచుకునేందుకు కృషి చేయాలి.  ఊరికే మన జాతీయ స్తూల అభివృద్ధి రెండింతలు చేద్దాం మూడింతలు చేద్దాం అంటే మేధో సంపత్తి విదేశాలకు తరలి వెళితే  అది ఎలాసాధ్యం అనేది పెద్ద ప్రశ్న .ఏమైనా ఇది చాలా సీరియస్ సమస్య ఇక్కడే మన యువతకు ఉన్నత చదువులు ఉన్నత ఉపాది మార్గాలు సమకూర్చి వారి మేదో సంపత్తిని వినియోగించుకోవడం లేదా అక్కిడికి వెళ్తున్న వారికి దోహద పడే విదంగా ఓ విధానం రూపొందించి సహాయ పడడం అవసరం.

.

డాక్టర్ మండువ ప్రసాదరావు

హైదరాబాద్

 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు