జాతి ఐక్యత కోసమే రాహుల్ జోడో యాత్ర


   


ప్రజల చేత, ప్రజల కోసం, ప్రజలే ఎన్నుకుని ప్రజల నియంత్రణలో కొనసాగే ప్రజాస్వామ్య దేశంలో స్వేచ్ఛ, సమానత్వం, సౌబ్రాతృత్వం ప్రామాణికంగా పాలన కొనసాగాలి. సహజ హక్కులను, పౌర స్వేచ్చల రక్షణను కాపాడుతూ భావ ప్రకటనా స్వేచ్ఛ, వ్యక్తిగత పౌర హక్కులు, మానవ హక్కుల పరిరక్షణ ప్రజాస్వామ్యంలో ఉండాలి. భారతదేశాన్ని ప్రజాస్వామ్యంతో పాటు లౌకిక, సామ్యవాద రాజ్యంగా కూడా నిర్వచించుకున్నాము. ప్రభుత్వాన్ని, మతాన్ని వేరుగా ఉంచి మత ప్రసక్తి లేని రాజ్యాన్ని లౌకిక రాజ్యం అంటారు. సాంఘీక, ఆర్ధిక, రాజకీయ రంగాల్లో ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు, పనిచేసే హక్కును కల్పించడం స్వామ్యవాదం అంటారు. భిన్న మతాలు, భిన్న కులాలు, భిన్న జాతులు, భిన్న తెగలు, భిన్నమైన ప్రాంతాలతో ఎన్నో అసమాతలతో కూడిన భారతీయ సమాజాన్ని ఐక్యతతో, సమానత్వంతో అభివృద్ధి దిశగా తీసుకెళ్లడం ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం బాధ్యత. కాని గత ఎనిమిదేండ్లుగా బిజెపి పాలనలో అనేక విపత్తులను ఎదురుకొని మునుపెన్నడూ  లేనంతగా భారత సమాజం అశాంతికి లోనై ఉన్నది. లౌకిక విలువలను కాపాడాల్సిన ప్రభుత్వం మత రాజ్య స్థాపనకు అడుగులు వేస్తున్నది. అందుకోసం హిందూ, ముస్లిం మతాల ప్రాతిపదికన ఓట్లను సమీకరించే దృష్టితో అధికారంలోకి రాకముందు నుండే దేశంలో అనేకమైన మత ఘర్షణలకు పాల్పడింది. అధికారంలోకి వచ్చిన తర్వాత మైనార్టీ ప్రజలపై దాడులు చేయడమే కాకుండా దళితులపై కూడా నానాటికి అత్యాచారాలు పెంచుతున్నారు. ముఖ్యంగా యువతను లక్ష్యంగా చేసుకొని విద్యా సంస్థల్లో దాడులకు పాల్పడి భవిషత్ తరాలను అసాంఘిక శక్తులుగా మార్చ చూస్తుంది. విద్య, ఉద్యోగం, ఉపాధి, వైజ్ఞానిక రంగాల వైపు నుండి యువత దృష్టిని మళ్లించి మతపరమైన విధ్వంసాలకు వారిని ఉపయోగిస్తుంది. హిందూత్వం, జాతీయత అనే రెండు నినాదాల మాటున యువతను మౌఢ్యంతో కప్పివేయ చూస్తుంది. 

   బిజెపి అసమర్ధ, స్వార్ధ పాలన వల్ల నోట్ల రద్దు, కరోన విపత్తు సమయంలో యావత్ భారత సమాజం ఆర్ధికంగా క్షీణించింది. ఈ ఆర్ధిక హీనత్వం నుండి ప్రజలను గట్టెక్కించాల్సిన బాధ్యత మరిచిన బిజెపి ప్రభుత్వం సంపన్నులను మరింతగా సంపన్నులను చేసే ఆర్ధిక కేటాయింపులకు పాల్పడి జాతి ఆర్ధిక విపత్తుకు కారణమైంది. సంపన్నులకు ఆర్ధిక ప్రోత్సాహకాలతో పాటు మినహాయింపులను కల్పించి  బాంకింగ్ రంగాన్ని కుప్ప కూల్చింది.  కార్పోరేట్ వ్యవస్థను బలోపేతం చేసి గుప్పెడు మంది సంపన్నులను ఎదగడానికి తోడ్పడింది. జాతి సంపదను ఆ గుప్పెడు మందికి దోచి పెట్టిన దుర్మార్గము కారణంగా నేడు భారత ఆర్థిక వ్యవస్థ ఒక ప్రమాధకరమైన సంక్షోభాన్ని ఎదుర్కోబోతుంది. బిజెపి పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చడం కోసం, సమస్యల పట్ల ప్రజల దృష్టిని మల్లింపజేయడం కోసం తెగల మధ్య, జాతుల మధ్య వైషమ్యాలకు, కులాల మధ్య, మతాల మధ్య వైషమ్యాలకు, ప్రాంతాల మధ్య చిచ్చుకు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వైరుధ్యాలకు పాల్పడుతుంది. జాతి సమైక్యతకు కృషి చేయాల్సిన పాలకవర్గం అందుకు భిన్నంగా జాతి విచ్చిన్నకర రాజకీయ కార్యకలాపాలకు పాల్పడుతూ అంతర్గత భద్రతకు ముప్పు వాటిల్ల చూస్తున్న ప్రమాదకర రాజకీయాల సందర్భంలో దేశ సమైక్యత, జాతి సమగ్రత కోసం రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కొనసాగించడం చారిత్రకమైన సందర్భం. 

     ప్రభుత్వరంగ సంస్థల మూసివేతతో పెరిగిన నిరుద్యోగం వల్ల తమ భవిషత్ ఆసరా కోసం రాహుల్ యాత్రలో యువత, విద్యార్థులు, మహిళలు ఎక్కువ సంఖ్యలో పాల్గొంటున్నారు. ప్రైవేటీకరణ రద్దుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటానని చెపుతున్న నినాదాలు జనాకర్షక నినాదాలుగా ఉండరాదు. అవి ఆచరణాత్మక విధానంగా ఉంటేనే ప్రజలు ఆశించిన దానికి సార్ధకత చేకూర్చిన పార్టీగా నిలిచిపోతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అన్ని విషయాలు అమలు చేస్తామనడం కాకుండా అధికారం వచ్చేవరకు సమస్యలపై ప్రజలతో మమేకమై పోరాడాల్సిన అవసరముంది. ప్రజా వ్యతిరేకమైన ప్రభుత్వ విధానాలపై ఉద్యమించడం ప్రజాస్వామిక లక్షణం.  అలాంటి కార్యక్రమాలకు ఇంతకాలం కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉండడం వల్లనే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ప్రజల విశ్వాసానికి దూరమైంది.

    సుస్థిర పాలన, ఉద్యోగాల కల్పన, స్వదేశీ, నల్లధనం వాపస్, అవినీతి లేని పాలన, బి.సి కార్డ్ నినాదాలతో అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కి, లౌకిక, సామ్యవాద పాలనను అపహాస్యం చేయడం వల్ల ప్రజా వ్యతిరేకతను మూట కట్టుకుంది. ఈ తరుణంలో జరుగుతున్న రాహుల్ జోడో యాత్రపై బిజెపి వ్యూహాత్మక మౌనం పాటిస్తుంది. కాంగ్రెస్ మైలేజీ పెరుగుతుందని, బిజెపి లొసుగులు, కుట్రలు బయట పడతాయని మౌనం వహిస్తుంది. కానీ జోడో యాత్ర వల్ల బిజెపి కుట్రలు ప్రజల్లో విస్తృత ప్రచారం జరుగుతున్న విషయాన్ని బిజెపి గమనించినట్లు లేదు. వ్యూహాత్మక రాజకీయాలకు పెట్టింది పేరైన బిజెపి రాహుల్ యాత్ర వల్ల కాంగ్రెస్ కు పెరిగిన ప్రజాధరణను తగ్గించే ప్రయత్నానికి పూనుకుంటుందనడంలో సందేహం లేదు.


రాహుల్ గాంధీ జోడో యాత్రను ఎలా అర్థం చేసుకోవాలి


    వంద సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుని ఎన్నిక జరుగుతున్నప్పటికి కూడా ఆ ఎన్నికను ప్రజాస్వామిక విలువలకు వదిలి ప్రజల కోసం రాహుల్ తన యాత్రను కొనసాగిస్తున్నారు. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటూ దాని పునాదుల మీద పార్టీని పునఃనిర్మాణం చేయాలనే కాంక్షతో రాహుల్ కుటుంబం దేశ ప్రజల కోసం పనిచేస్తుంది. బిజెపి ప్రభుత్వం మతతత్వ విజృంభనను విస్తృతపరుస్తూ రాజకీయాలు చేస్తున్న క్రమంలో దాని స్వభావాన్ని తగ్గించడం కోసం ఖచ్చితంగా తాను పని చేయాలని నిశ్చయించుకున్న రాహుల్ రాజకీయ ప్రయోజనాల కన్నా జాతి ప్రయోజనాలే ముఖ్యమని యాత్ర మొదలు పెట్టారు. ప్రజలను రాజకీయంగా శక్తియుక్తులుగా తయారు చేయడానికి జోడో యాత్ర ఎంతో ఉపయోగపడుతుంది. బిజెపి దాని అనుబంధ విభాగాలు దేశంలో అంతర్గత భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని గత కొంతకాలంగా ప్రచారం చేస్తున్నాయి. దేశం పరాయి చేతులకు పోతుందనే తప్పుడు ప్రచారాన్ని అడ్డుకొని పాలకవర్గం తీసుకొచ్చే ప్రమాదాన్ని నివారించి జాతీయ సమైక్యతను నెలకొల్పాల్సిన  అవసరముంది. అలాంటి చారిత్రక రాజకీయ సందర్భంలో ప్రజలను కాపాడుకోవడానికి చేస్తున్న జోడో యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. 

    రాహుల్ జోడో యాత్రలో అడుగడుగునా ప్రజలు వారి సమస్యలను విన్నవించుకుంటున్నారు. ప్రజా సమస్యలను అవగాహన చేసుకుంటున్న రాహుల్ జాతీయ, ప్రాంతీయ పార్టీలపై, వారి పాలనా విధానాలపై గతం కన్నా మెరుగ్గా మాట్లాడుతున్నాడు. ప్రజా సమస్యలను పరిష్కారం చేయలేని పాలకులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, అలాంటి తప్పడు రాజకీయాల పట్ల ప్రజలు చైతన్యంతో మెలగాలని పిలుపునిస్తున్నాడు. మత రాజకీయాలను అడ్డుపెట్టుకొని వరుసగా రెండు సార్లు అధికారంలోకి వచ్చిన బిజెపి ఎన్నికల సమయంలో చెప్పిన వాగ్ధానాలను వేటిని నెరవేర్చలేదని, ప్రైవేటీకరణతో యువత ఉద్యోగ అభద్రతకు కారణమైందని, ద్రవ్యోల్బణం పెరిగి సామాన్యులు దేశంలో బ్రతికే పరిస్థితి లేదని, ఉద్యోగాలు లేక  జ్ఞానవంతులైన యువత దేశం విడిచి వెళుతున్నారని, విద్య, వైద్యం, ఉపాధి, వ్యవసాయం లాంటి మౌలిక రంగాలను ప్రైవేట్ పరం చేయడం వల్ల ప్రజలు మరింత నష్టపోతున్నారని ప్రజలకు బోధిస్తూ రాహుల్ ప్రచారం కొనసాగుతుంది. 

    గత 75 ఏండ్లుగా సమైక్య ప్రజాస్వామ్య రాజకీయ విధానంలో కొనసాగుతున్న దేశాన్ని నిలువెల్లా చీల్చే కుట్రలో భాగంగా రాష్ట్రాల రాజ్యాంగ హక్కులను, ప్రజల ప్రజాస్వామిక హక్కులను హరించివేసి ఏకీకృత ఆధిపత్య రాజకీయ విధానాన్ని నిర్మాణం జరపాలనే ఉచ్చుకతతో కుటిల రాజకీయాలు చేస్తున్న బిజెపిని నిలువరించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. పార్టీలతో సంబంధం లేకుండా రాష్ట్రాలు, స్థానిక తెగలు, సమాజాలు బిజెపి కేంద్రీకృత విధానాలను వ్యతిరేకించాలి. అలా వ్యతిరేకించకుండా ఉంటే రానున్న రోజుల్లో మరింత చీకటి రోజులు దాపురిస్తాయని మేధావి వర్గం భాయాందోళనలు వ్యక్తం చేస్తుంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కొనసాగుతున్న రాహుల్ జోడో యాత్రను రాజకీయంగా కాకుండా జాతి సమైక్యత కోసం, జాతి భవిషత్ కోసం జరిగేదిగా అర్ధం చేసుకోవాలి. కాంగ్రెస్ పై, దాని విధానాలపై, దాని సిద్ధాంతాలపై వ్యతిరేకత ఉండవచ్చును, దాన్ని విభేదించేవారు ఉండవచ్చును కానీ దేశం విపత్కర పరిస్తితిలో ఉన్న సందర్బరంలో కాంగ్రెస్ బిజెపి కన్నా ప్రమాదకారి కాదని ఈ సమాజం విశ్వసిస్తుంది. కాంగ్రెస్ కు ప్రత్యేకమైన మతతత్వం లేనందునే ప్రజలు రాహుల్ యాత్రకు తరలి వస్తున్నారు. ఓట్ల కోసం, రాజ్యం కోసం మత దృక్పథం ప్రాతిపదికన సమాజాన్ని రెండుగా చీల్చాలని బిజెపి చేస్తున్న కుట్ర వల్లనే దేశ అంతర్గత భద్రతకు ప్రమాదమని ప్రజలు అర్ధం చేసుకోవాలి. రానున్న కాలంలో ప్రజలు ఎంతటి హింసను అనుభవించాల్సి ఉన్నదో బిజెపి పార్టీ దాని కార్యకలాపాలతో చెప్పకనే చెపుతుంది. ప్రభుత్వమే ఇలాంటి దుర్మార్గానికి తెగబడినప్పుడు ప్రజలు విజ్ఞులు, విద్యావంతులు, మేధావులు, బుద్ధిజీవులు ఆలోచన చేయాలి.


     జోడో యాత్రకు ప్రతిపక్షాలు మద్దతుగా నిలవాలి


     దేశానికి పొంచియున్న ప్రమాదాన్ని పౌర సమాజం పసిగట్టినందునే రాహుల్ యాత్రకు అనివార్యమైన, అనూహ్యమైన స్పందన లభిస్తోంది. అర్ధం చేసుకోవాల్సింది రాజకీయ పార్టీలు, ప్రగతిశీల వామపక్ష శక్తులు. రాష్ట్రాలు, ప్రాంతాలు అనే బేధం లేకుండా ప్రతిపక్షాలు, వామపక్ష ప్రగతిశీల శక్తులు, ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ కు అండగా నిలవాలి. వంద ఏండ్ల చరిత్ర కలిగి చట్టసభల్లో శాసనాల నిర్ణయాదికారంలో కీలకపాత్ర పోషించిన వామపక్ష పార్టీలు మతతత్వ రాజకీయాల వల్ల నేటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొనే సామర్థ్యం కోల్పోయారు. దేశంలోని ప్రాంతీయ పార్టీలన్ని కలిసి ఒక జాతీయ విధానాన్ని ఏర్పరచుకుని సమైక్యంగా ముందుకు సాగే అవకాశం లేదు. పొంచి ఉన్న ప్రమాదాన్ని నివారించగలిగే రాజకీయ సామర్థ్యం, వ్యూహాలు, నాయకత్వ పటిష్టత ప్రాంతీయ పార్టీలకు లేనప్పుడు దేశ ప్రజల క్షేమం కోసం ఆ పార్టీలు చేయలేని పనులను, ఎదుర్కోలేని విపత్తును ఎదురుకోగలిగే శక్తులతో కలిసి నడవడవడమే తక్షణ కర్తవ్యం. దేశంలో ఇప్పుడున్న ప్రమాదాన్ని నిలువరించి జాతీయ సమైక్యతను కాపాడి రాజ్యాంగ సమాఖ్యను, రాజ్యాంగ స్ఫూర్తిని ముందుకు తీసుకుపోలేని ప్రాంతీయ పార్టీలు రెండు జాతీయ పార్టీల మధ్య భలాభలాలను లెక్క వేయకుండా వారి విధానాలపై ఆలోచన చేయాలి. ఆ దిశగా కాంగ్రెస్ తో జత కట్టాల్సిన అవసరముంది. రాజ్యాంగ నియమాలను, సమైక్య విలువలను కాపాడుకుని, ఎన్నికల కొనుగోలు లేని సమాజ నిర్మాణం కోసం కొన్ని షరతులతో ప్రాంతీయ పార్టీలు, వామపక్ష, బహుజన శక్తులు కాంగ్రెస్ తో జత కట్టాలి. దేశానికి ప్రమాదం పొంచియున్న సందర్భంలో కాంగ్రెస్ ను కాపాడుకోవడమంటేనే జాతి సమైక్యతను కాపాడుకోవడంగా చూడాలి. ఏ పార్టీకి ఏ భావన ఉన్నా ఏ సిద్ధాంతం ఉన్నా ప్రజా స్పందనకు అనుగుణంగా మనగలకపోతే ఆ పార్టీలు కనుమరువవుతాయనే చార్రిత్రక సత్యాన్ని అవి గుర్తుచేసుకోవాలి. ఈ విషయం సుదీర్ఘ చరిత్ర కలిగిన పార్టీలకు చెప్పవలసిన అవసరం లేదు. దేశానికి పొంచియున్న ప్రమాదాన్ని నిలువరించడానికి జోడో యాత్ర చేపట్టిన కాంగ్రెస్ పార్టీ నాయకత్వం గతంలో లాగా కాకుండా వారి విధానాలను సవరించుకుని ప్రజా స్పందనను అర్ధం చేసుకోవడంతో పాటు ప్రతిపక్షాలను, ప్రాంతీయ పార్టీలను, వామపక్ష ప్రగతిశీల శక్తులను, ప్రజా సంఘాలను, తెగలను కలుపుకుని ముందుకు సాగాలి. 

   పౌర సమాజం, మేధావి వర్గం ప్రస్తుత దేశ సమస్యను ఉద్యోగాలకు సంబంధించినదిగానో, ఆర్థికం, ఉపాధి కోసమో, స్థానిక రాజకీయాలు, సమస్యగానో, విశ్వాసాలకు సంబంధించినదిగానో చూడరాదు. అత్యంత దుర్మార్గమైన భౌతిక హింసను ఎదుర్కోవలసిన స్థితి దాపురించి ఉన్నదని, దేశంలో కనీవినీ ఎరుగని అమానవీయ సంఘటనలను అనుభవించే ప్రమాదానికి వ్యతిరేకంగా ప్రజలు నిలబడాలి. ప్రజలు, మేధావులు, వామపక్ష, ప్రగతిశీల, ప్రాంతీయ పార్టీల ఐక్యతకు తోడుగా మీడియా శక్తులు కూడ బాధ్యతగా  జోడో యాత్రకు అండగా నిలిచి దేశ సమైక్యత కోసం జరిగే యాత్రను విజయవంతం చేయాల్సిన అవసరముంది.


   


  సాయిని నరేందర్

సామాజిక, రాజకీయ విశ్లేషకులు

      9701916091

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు