ముందస్తు కెళితే కెసిఆర్ పరిస్థితి ఏమిటి ?

 కెసిఆర్ ముందస్తు ప్లాన్  - కెసిఆర్ అసెంబ్లి రద్దు చేస్తే ప్రజలు డిసైడ్ చేస్తారు


తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు సిఎం కెసిఆర్ ప్రిపేర్ అయ్యాడనే వార్తలు ఎవరికి ఆశ్చర్యం కలిగించక పోవచ్చు.  ఎందుకంటే ఆయన 2018లో ముందస్తుకు వెళ్లి అత్యధిక స్థానాలు గెలుచుకుని అధికారం నిలుపుకున్నారు. 

ఇదేతరహాలో ఇప్పుడు ఆరునెల్లముందుగానే ఎన్నికలకు వెళ్లవచ్చని కెసిఆర్ వ్యూహాలను బట్టి విశ్లేషణలు వస్తున్నాయి. 

తెలంగాణ కు మరో ఏడాది వరకు సమయం ఉండగా కెసిఆర్ ఎందుకు తొందరపడుతున్నాడనే విషయంలో అనేక కారణాలు ఉన్నాయి. లోక్ సభ ఎన్నికలతో అసెంబ్లి ఎన్నికలు జరిగితే అనుకున్న మేరకు సీట్లు గెలవలేమనే ఓ ప్రధాన కారణం. ఇదే అంచనాతో 2018 లో కెసిఆర్ ముందస్తుకు వెళ్లి  సక్సెస్ అయ్యారు. 2019 లో లోక్ సభ ఎన్నికల్లో పార్లమెంట్ సీట్లలో టిఆర్ఎస్ కు ఎదురు దెబ్బ తగిలింది.

తెలంగాణ లో ప్రస్తుతం టిఆర్ఎస్ పరిస్థితి 2018 కన్నా మెరుగ్గా ఏమి లేదు. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీతో నిత్య పోరుతో సతమతమవుతూ ఇంటిని కాపాడుకోవడమే టిఆర్ఎస్ కు పెద్ద గగనమైంది.

మరో వైపు  గతంలో ఇచ్చిన హామీలలో అనేకం నెరవేర్చ లేక పోయాడు. డబుల్ బెడ్ రూం నుండి మొదలు పెడితే రుణ మాఫి  వరకు హామీలు నెర వేర్చ లేదు. నిరుద్యోగుల భృతి ఉద్యోగ నియామకాల విషయంలో ఫెయుల్యూర్స్ ఉన్నాయి. సంక్షేమ పథకాలలో పెన్షన్లు తప్పితే ప్రజలకు పెద్దగా ఒరిగింది లేదనే విమర్శలు ఉన్నాయి.

గ్రామాలలో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా మారింది. ఇతర మౌలిక వసతుల విషయంలో  కూడ సర్కార్ పై అసహనం ఉంది.

ఏంచేయాలన్నా సర్కార్ వద్ద నిధులు లేవని సామాన్య జనానికి కూడ తెల్సి పోయింది. మిగులు బడ్జెట్ రాష్ట్రం అప్పులు ఊబిలో కూరుకు పోయి అప్పు పుట్టందే పూట గడవని పరిస్థితి నెలకొంది.

ఈ నేపద్యంలోనే ఎన్నడూ లేని విదంగా సర్కార్ ఉద్యోగులకు ఫస్ట్ తారీకు జీతాలు ఇవ్వడం గగనంగా మారింది. కాంట్రాక్టర్లకు చేసిన పనులకు బిల్లులు లభించక అసహనంతో సర్కార్ ను దుమ్మెత్తి పోస్తున్నారు. 

ఈ  పరిస్థితుల్లో మరో వైపు టిఆర్ఏస్ ను  తరుముతున్న బిజేపీతో  ఎట్లా ఏగడం అనేది సిఎం కెసిఆర్ కు రోజు రోజుకూ అంతుచిక్కని సమస్యగా మారింది.

సర్కార్ బొక్కసం ఖల్లాస్ అయ్యేందుకు తప్పును కేంద్రంపై నెట్టి బ్లేమ్ గేమ్ తో ఎన్నికల్లో నెగ్గాలనేది కెసిఆర్ వ్యూహంగా అందరికి అర్దం అయి పోయింది. 

ఏడాది ఆగేకన్నా ముందే ముందస్తుకు వెళితే పాత హామీలను నెరవేర్చే పనిలేకుండా కేంద్రాన్ని దుమ్మెత్తి పోస్తూ కొత్త హామీలు గుమ్మరించి ఎన్నికల్లో ప్రజలను మరో సారి మాయ చేసి అధికారం లోకి రావచ్చని కెసిఆర్ వ్యూహంగా కనిపిస్తోంది. ఆలస్యం జరిగితే ఇప్పటికే రాష్ట్రంలో కెసిఆర్ చుట్టూ ఉండే మిత్ర బృందంపై చక్ర భందం బిగించిన  కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎక్కడ తనను టార్గెట్ చేస్తాయోనన్న భయం కూడ కెసిఆర్ ను ఆయన కుటుంబ సబ్యులను వెంటాడుతోంది.

ఈ పరిస్థితుల్లో అన్ని  విధాలా ముందస్తుకు వెళ్లడమే తనకు లాభమని పార్టీకి క్షేమమని కెసిఆర్  తలస్తున్నారు. 

అన్నిటికన్నా ముఖ్యం తాను ఏర్పాటు చేసిన బిఆర్ఎస్ పార్టీని నిలబెట్టడం. ఒకే సారి ఎన్నికలు  జరిగితే  కెసిఆర్ ఎన్నికలు ఎదుర్కోవడం చాలా కష్టం. రాష్ట్రంలో  దేశంలో ఒకే సారి ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉంటింది. ఏకకాలంలో ఇది కెసిఆర్ కు ఆయన కొత్తగా ఏర్పాటు చేసిన పార్టీకి సాద్యం అయ్యే పని కాదు.  

ముందస్తుకు వెళితే రాష్ట్రంలో అధికారం నిలుపుకుని ఆ తర్వాత దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల్లో ప్రచార కార్యక్రమాలునిర్వహించవచ్చనేది కెసిఆర్ ఆలోచన.

ఎన్నికల్లో ప్రతిపక్షాల ఓట్ల చీలిక లాభించి మూడోసారి అధికారం నిలుపు కోవడం రాష్ట్రంలో  పెద్ద కష్టం  కాదని కెసిఆర్ భావిస్తున్నారు.

బిజెపి ఎమ్మెల్యేల కొనుగోళ్ళకు పాల్పడిందని బ్లేమ్ చేసిన విదంగానే రాష్ట్రానికి నిధులు రాకుండా అడ్డుపడి అభివృద్ధిని కుంటు పడేసిందని ఎలుగెత్తి చాటేందుకు కెసిఆర్ శీతాకాల అసెంబ్లి సమావేశాలకు సిద్దమయ్యారు. రాష్ట్రంలో  ఆర్థిక పరిస్థితులు దివాలా తీసేందుకు కెసిఆర్ ఒంటెద్దు పోకడలే కారణమన్న విమర్శల నుండి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కేంద్రం పై బ్లేమ్ నెట్టాలనే వ్యూహంలో కెసిఆర్ ఉన్నారు.

 కాళేశ్వరం ప్రాజెక్టు వంటి భారి ప్రాజెక్టు కారణంగా నిధులు దుర్విని యోగం చేశారనే అభియోగం ఆయనపై ఉంది.  

కెసిఆర్ చేసిన తప్పులు ఏమిటో ప్రజల ఎదుట పెట్టిన బిజెపి కెసిఆర్ ను అష్ట దిగ్భంధం చేసేందుకు సిద్దం అవుతోంది. 

కెసిఆర్ ముందు ముందస్తు  ఒక్కటే ఏకైక పరిష్కారంగా కనిపించినా ముందస్తే రివర్స్  అయినా  కావచ్చనే  విశ్లేషణలు ఉన్నాయి. కెసిఆర్ పట్ల  ప్రజల్లో  అసహనం బాగా పెరిగింది. పరిపాలన లేకుండా ప్రజా సంక్షేమం లేకుండా కేవలం అమలు కాని హామీలు వాగ్దానాలతో ప్రచారం కోసం పనికి వచ్చే తాయిలాల పథకాలతో  సర్కార్ ను  నెట్టుకొస్తున్న కెసిఆర్ తెలంగాణ కు చేసిందేమిటనే ప్రశ్నలు ఇప్పటికే సామాన్యుల నోట వినపడుతున్నాయి. 

కెసిఆర్ ముందస్తు డిసైడ్ చేస్తే ఎన్నికల్లో ఏంచేయాలో ప్రజలు డిసైడ్ చేయనున్నారు. సారు కారు లెక్క తేలుస్తారు.  నచ్చితే  అధికారంలో నిలుపుతారు లేదంటే ఇంటికి సాగనంపుతారు.


 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు