ఈడికొచ్చి తిడ్తరు- ఆడ ఢిల్లీలో ఆవార్డులు ఇస్తరు

 

కేంద్ర మంత్రుల పై సిఎం కెసిఆర్ విసుర్లుతెలంగాణ రాష్ర్టం విషయంలో  కేంద్రమంత్రుల వ్యవహార శైలిని సిఎం కెసిఆర్ తప్పుపట్టారు.  "కేంద్ర మంత్రులు ఇక్కడికి వచ్చి  విమర్శలు చేస్తారు.. ఢిల్లీకి వెళ్లి  ఆవార్డులు ఇస్తారు" అంటూ విసుర్లు విసిరారు. తెలంగాణ అన్ని రంగాల్లో అద్భుత ప్రగతి కనబరిచిందని అన్నారు. కేంద్ర మంత్రులు కావాలనే రాజకీయ విమర్శలు చేస్తున్నారని సిఎం కెసిఆర్ మండిపడ్డారు.

శనివారం వరంగల్ నగరం సమీపం లో  దామెర క్రాస్ రోడ్డు వద్ద నిర్మించినప్రతిమ రిలీఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ కాలేజీ ఆసుపత్రి, క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌ను కెసిఆర్ ప్రారంభించారు. 

దేశంలో ఏ రాష్ర్టం సాధించని అభివృద్ధి తెలంగాణ రాష్ట్రం సాధించిందని అన్నారు. తెలంగాణ జీఎస్‌డీపీ దేశంలో అన్ని రాష్ట్రాల కన్నా  ఎక్కువ‌గా  ఉందన్నారు. రాష్ట్రానికి కేంద్రం ఒక్క మెడికల్ కాలేజ్ కూడా ఇవ్వలేదని విమర్శించారు. మనమే 12 కొత్త మెడికల్ కాలేజ్‌లు తెచ్చుకున్నామని అన్నారు. మన విద్యార్థులు వైద్య విద్య కోసం రష్యా, చైనా, ఉక్రెయిన్ వెళ్లాల్సిన అవసరం లేదని అన్నారు. రాష్ట్రంలోనే వైద్య, విద్య చదివేందుకు సరిపడా సీట్లు ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలో మెడికల్ కాలేజ్‌ల సంఖ్య 17కు చేరిందని ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 6,500కి పెరిగిందని రాష్ట్రంలో 33 జిల్లాల్లో మెడికల్ కాలేజ్ లు ఏర్పాటు చేస్తామని  అన్నారు.  భారత్ గొప్ప సహనశీల దేశం అని పేర్కొన్నారు. దేశంలో విద్వేషాలకు తావులేదని అన్నారు. విద్వేష రాజకీయాలకు యువత గ్రహించి జాగ్రత్తగా ఉండాలని పిలుపునిచ్చారు. దేశంలో కొద్ది మంది దుర్మార్గులు.. వాళ్ల స్వార్థ‌, నీచ ప్ర‌యోజ‌నాల కోసం విష‌బీజాలు నాటే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారని విమర్శించారు. అది ఏ ర‌కంగా కూడా స‌మ‌ర్థ‌నీయం కాదని అన్నారు. పురోగతి అనుకున్నట్టుగా సాగాలంటే చైతన్యంగా ఉండాలని అన్నారు. కొన్ని సందర్భాల్లో చిన్న అజాగ్రత్త వల్ల తీవ్రంగా నష్టపోతామని హెచ్చరించారు.. 1956లో చిన్న ఏమరుపాటు వల్ల 60 ఏళ్లు నష్టపోయామని అన్నారు. ఎన్నో ప్రాణత్యాగాల తర్వాత మళ్లీ తెలంగాణ సాధించుకున్నామని చెప్పారు. 

నాకు వయస్సు పైబడింది..భవిష్యత్ మీదే

నా వ‌య‌సు అయిపోతుంది. 68 ఏండ్లు కంప్లీట్ కావొస్తుంది. భ‌విష్య‌త్ మీది.. ఈ భార‌త‌దేశం మీది. విద్యార్థులుగా, యువ‌కులుగా ఈ దేశాన్ని గొప్ప దేశంగా తీర్చిదిద్దుకునే క‌ర్తవ్యం మీ మీద ఉంట‌ది. మెడిక‌ల్ విద్య‌తో పాటు సామాజిక విద్య‌ను కూడా పెంపొందించుకోవాలి. ప‌రిస్థితుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు గ‌మ‌నిస్తూ ముందుకు పోవాలి అంటూ కేసీఆర్ తన ప్రసంగంలో భావోద్వేగత వ్యక్త పరిచారు. 


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు