నాస్తికత్వం నేటి అవసరం



"వేదాంతం ప్రకారం విశ్వానికి ఆవల ఎక్కడో ఏదో క్రమబద్ధీకరించే దైవ శక్తి లేకుండానే నాస్తికత్వం జీవన భావన ప్రతిపాధితమవుతుంది. మానవ జాతిని ఒక అవాస్తవ ప్రపంచంలో ఆత్మలతో, దివ్యవాణులతో, నీచమైన సంతృప్తిలో, నిస్సహాయమైన హీన స్థితుల్లో, అణచిపెట్టిన వ్యవస్థకు విరుద్ధంగా విమోచనననీ, వికాసాన్ని, సౌందర్యాన్ని, ప్రసాధింపగల ఒక సత్యమైన వాస్తవ ప్రపంచానికి సంబంధించినదే నాస్తిక జీవన భావం"

..ఎమ్మా గోల్డ్ మాన్ (1869-1940)


"ఎక్కడెక్కడ వివేకానికి విలువ లేదో, సమతకు చోటు లేదో అక్కడ నుండి మాత్రమే నాస్తికత్వం పుడుతుంది"

      ...పెరియార్ (1949)


" ఎక్కడ అనారోగ్యం, రోగాలు ప్రబలి ఉంటవో అక్కడే వైద్య నిపుణులు ఉండాలి. ఎక్కడ అజ్ఞానం, అసమానత్వం నెలకొని వుంటుందో అక్కడే  నాస్తికత్వం ఉండాలి. స్త్రీలు, నిరుపేద కులాలే కులమతాల పీడనకు గురి అవుతున్నారు. నాస్తికోద్యమం వారి విమోచన కోసమే".

 ..డాక్టర్ జయగోపాల్ (1994)


    ప్రపంచంలోని ఏ మానవుని ఆలోచనా భావ ప్రకటనలు దాదాపుగా ఒకే రీతిగా ఉంటాయి. ప్రకృతి పరిణామ క్రమములో ఒక దశలో మానవుడు అవతరించాడు. జంతుజాలంతో సహజీవనం చేసిన మానవులు కొన్ని లక్షల సంవత్సరాలకు గాని నేటి ఆకృతి ధరించలేదు. ప్రాధమికంగా మానవుడు ప్రకృతి భీభత్సాలకు భయపడి తన చుట్టూ అవతరించిన భయంకర ప్రకృతి శక్తులను తన ఊహా లోకంలో ఏవేవో అర్ధాలు కల్పించుకొని ఆచరించడం మొదలుపెట్టారు. ఉరుములు ఉరిమినా, మెరుపులు మెరిసినా భయంతో కంపించి చెట్టుకు, పుట్టకు, గుట్టకు మోకరిల్లడానికి అలవాటు పడ్డారు. కాలం మారిన కొద్దీ మానవుని అజ్ఞానం, భయం వల్ల కొన్ని ఆచారాలు, సాంప్రదాయాలు స్థిరపడ్డాయి. ప్రాకృత మానవుడి అజ్ఞానాన్ని ఆసరాగా తీసుకున్న దోపిడీ వర్గం దోపిడీకి శ్రీకారం చుట్టారు. దోపిడీ వర్గం గుంపులు అనాదిగా ప్రజలను దోచుకుంటూ వస్తున్నారు. 

   కాలం గడిచినా కొద్దీ దోపిడి సామాజిక విధానంగా రూపుదిద్దుకునే దశలో మతం చోటు చేసుకుంది. సామాన్య మానవుని బుర్రలో సహజంగా ఆవరించిన ఆచారాలకు, సాంప్రదాయాలకు తోడు దోపిడి వర్గం వారి దోపిడి సునాయాసంగా సాగడం కోసం రకరకాల ఆచారాలను, సాంప్రదాయాలను ప్రవేశ పెట్టింది. పూర్వ జన్మ, సర్గ నరకాలు, మోక్షం, ఖర్మ లాంటి సిద్ధాంతాలు ప్రవేశపెట్టి వారి దోపిడీని పెంచారు. భారతదేశంలో వైదిక కాలానికి ముందే ఈ స్థితి ఉంది. వైదిక కాలంలో కర్మకాండకు ప్రాధాన్యమిచ్చిన పురోహిత వర్గం రాజకీయ వ్యవస్థను కూడా తమ గుప్పెట్లో పెట్టుకొని నిరంకుశంగా సమాజాని పీడించింది. 

     ప్రకృతిని, మానవ జీవితాన్ని అర్ధం చేసుకునే ఆలోచనా రీతులు రెండు అనాధికాలం నుండే వస్తున్నాయి. అవే ఆస్తికత్వం, నాస్తికత్వం. ఉద్దేశ పూర్వకమైన ఆలోచనే ఈ విశ్వం ఇలా ఉండడానికి కారణం కాదని, ఈ విశ్వం తనలో గల నిరంతరం మారే గుణం చేత ఎవరూ, ఏ శక్తి శాసించని నిర్ణయాల చేత ప్రాకృత ధర్మం చేత, దానంతటదే కొనసాగిపోతుందని ఏ మానవేతర శక్తుల ప్రమేయంపైనా మానవ జీవితం ఆధారపడలేదని, మనిషి తనకు కావాల్సిన వాటిని తానే ఏర్పరచుకోగలడని నాస్తిక బౌతికవాదం మూల సూత్రం.

   వెలుతురు చూడడానికి ఇష్టపడని మతవాదులు, వారసత్వంగా సంక్రమించిన సాంప్రదాయ సంకెళ్ళ నుండి బయట పడడానికి భయపడేవారు, వేదాది మత గ్రంధాల భావాలను పరిరక్షించడానికి కంకణం కట్టుకున్నవారు అనాదిగా నాస్తిక, హేతువాదాలపై ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. అయినా శాస్త్రీయతను సంతరించుకున్న హేతువాద నాస్తిక భావాలు క్రమాభివృద్ధి చెందూతూనే ఉన్నాయి. అన్ని తత్వాలకు, సిద్ధాంతాలకు పునాది ప్రకృతి, మానవుడు, సమాజాలే. ప్రకృతిని, వ్యక్తిని, సమాజాన్ని అర్ధం చేసుకునే విధానంలోనూ, వాటి మధ్య ఉండే సంబంధాలను అర్ధం చేసుకునే రీతిలోనున్న తేడాల వల్లనే భిన్న సిద్ధాంతాలు, భిన్న తత్వాలను వచ్చినట్లు అర్ధమవుతుంది. భ్రమలు, బ్రాంతులు బావ వాదంలో బాగమైతే ఉన్నదాన్ని ఉన్నట్లుగా గుర్తించడం, ఒక వస్తువును అదే వస్తువుగా గుర్తించడం బౌతికవాద లక్షణం. లేని భగవంతున్ని ఉన్నట్లుగా భావించేవారు కొందరైతే విగ్రహాలను, చిత్రపటాలను, నాయకులను, మత ప్రవక్తలను దేవుళ్లుగా భావిస్తారు మరికొందరు. ప్రకృతినే దేవుడిగా ఆరాధిస్తారు కొందరు ఆధ్యాత్మికవాదులు. అందుకే వీరందరిని ఆస్తికులని, బావవాదులని అంటారు.

    వాస్తవానికి హేతువాద నాస్తికోద్యమం నిన్న మొన్నటిది కాదు ఆది మానవుడుగా జంతు జీవాలతో సహజీవనం చేసిన మానవుడు ప్రకృతిలో జరుగుతున్న మార్పులను గురుంచి ఆలోచన చేయడం, తర్కించడం నుండే ఈ నాస్తికత్వం మొదలైంది. ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది ఇలా తర్కించి ఎన్నో విషయాలను కనుగొనడం మొదలు పెట్టారు. అడవిలో ఆకులు, అలములు, జంతువులను వేటాడి పచ్చి మాసం తినే మానవులు నిప్పును కనుగొన్నారు. వ్యవసాయాన్ని కనుగొనడమే కాకుండా భూమి, సూర్యుడు, ఆకాశం ఇలా ఎన్నో విషయాలపై పరిశోధనలు చేసి నేడు మానవ సమాజం అనుభవిస్తున్న శాస్త్ర సాంకేతిక ఫలితాలు కూడా బావవాదస్థుల తర్కం నుండి వచ్చినవే. మతవాదుల ధర్మ గ్రంధాలలో బోధించిన విషయాలను వ్యతిరేకించి ప్రకృతి రహస్యాల గురుంచి వక్కాణించిన ప్రతి పరిశోధకుడిని, విజ్ఞానిని జైళ్లలో కుక్కి, మంటల్లో మాడ్చి చంపారు. సిలువ వేసి హింసిస్తూ ఆనందించారు. తమ సత్యాన్వేషణలో వెలివేతకు, అవమానాలకు గురై అమరులైన వారిలో అనగ్జోరాస్ హైపాటియా, సెక్కోలి బొక్కాసియా, గియార్డనో బ్రూనో, గెలిలియా, కోపర్ణికస్, రోజర్ బేకన్, ఆల్-ఫరాబి, ఇబన్ సినా, ఆల్-రజి లాంటి మహనీయలున్నారు.

   పాలనాపరమైన అన్ని రంగాల్లో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా వాడుకుంటున్న భారతదేశ పాలకులు మరోపక్క మతవాదులను ప్రోత్సహించి మతాల అభువృద్ధికి పెద్దపీట వేస్తున్నారు. పేద వర్గాలు చదువుకునే విద్యాలయాలు మూతపడుతున్నా పట్టించుకోని పాలకులు గుడులు, మసీదులు, చర్చీల అభివృద్ధికి మాత్రం శ్రద్ధ చూపుతున్నారు. మతాల పేరున, కులాల పేరున అణగారిన వర్గాలపై జరుగుతున్న దాడులను, పేద వర్గాలపై జరుగుతున్న దోపిడీని ప్రశ్నించే భారతదేశ నాస్తికులను పట్టపగలే కాల్చి చంపుతున్నా అడిగేవారు లేని స్థితిలో కూడ దేశ వ్యాప్తంగా వేల మంది నాస్తికులు అణగారిన వర్గాల పక్షాన నిలబడి పోరాటం చేస్తున్నారు. దేశంలో పెట్రేగి పోతున్న మతవాదులను కట్టడి చేయడం కోసం మూఢ నమ్మకాల నిర్మూలన చట్టం తీసుకురావాలని పోరాటం చేసిన నాస్తిక నాయకులు నరేంద్ర దాబోల్కర్, గౌరీ లంకేశ్ లాంటి వాళ్ళను పొట్టన పెట్టుకున్న ఘనత భారతదేశ మతోన్మాదులకు, వారికి అండగా నిలిచిన పాలకులకు దక్కుతుంది.

    భారతదేశంలో కూడా సమాజ పురోభివృద్ధికి, కుల నిర్మూలన కోసం, సామాజికన్యాయం కోసం, శాస్త్రీయ బావన పెంపు కోసం, మూఢ విశ్వాసాల నిర్మూలన కోసం ఎందరో ప్రముఖులు తమ జీవితాలను త్యాగం చేసిన చరిత్ర వుంది. కేరళకు చెందిన ఎ.కె. గోపాలన్, తమిళనాడుకు చెందిన జీవానందం, సింగారవేలర్ లాంటి దక్షిణభారత ఉద్యమ ప్రముఖులు సోషలిజం ఉద్యమం మొగ్గ తొడిగిన నాటి నుండే హేతువాద, నాస్తిక భావాల ప్రచారాన్ని అభినందిస్తూ వచ్చారు. 1933 లో జరిగిన అఖిల భారత నాస్తిక మహాసభలను తమిళ కమ్యూనిస్టు ప్రముఖుడైన సింగారవేలర్ ప్రారంభించారు. 19-20 శతాబ్దాల మధ్య  భారతదేశంలో పీడిత ప్రజల విముక్తి కోసం జరిగిన ఉద్యమాల్లో నాస్తిక హేతువాదం ప్రముఖ పాత్ర పోషించింది. ఈ కాలంలో కృషి చేసిన వారిలో నారాయణ గురు, పండిత అయోతిదాస్, అయ్యంకాలి, మహాత్మ జ్యోతిరావు పూలే, అంబేడ్కర్, పెరియార్ ఈ.వి రామసామి ప్రసిద్ధులు. వర్ణ, వర్గ, కుల నిర్మూలనోద్యమంలో నాస్తికత్వాన్ని ఆయుధంగా చేసుకుని ఉద్యమించిన ఆధునిక విప్లవాది పెరియార్ పోరాట ఫలితంగా తమిళనాడులో బహుజన రాజ్యం ఏర్పడింది. పెరియార్ ఉద్యమాన్ని పరిశీలిస్తే చాలా విషయాలు బోధపడుతాయి. మతవాదులు, దోపిడి వర్గాలు కలిసి దుష్ప్రచారం చేస్తున్నట్లు నాస్తికులంటే కేవలం దేవుళ్లను వ్యతిరేకించే వారే కాదని అమాయకపు ప్రజలను ఆసరా చేసుకుని పాలకుల దోపిడీని ప్రశ్నించడమే కాకుండా ఆ దిశగా ప్రజలను చైతన్యం చేయడం, సమాజహితం కోసం, సమాజంలోనున్న సకల జాడ్యాలను, మూఢ విశ్వాలను తొలగించి కుల, మత రహిత రాజ్య నిర్మాణం కోసం, సామాజిక న్యాయ సాధన కోసం, సమసమాజం కోసం నిత్యం పరితపించే నిస్వార్థ జీవులే నాస్తికులని అర్ధమవుతుంది.

    భారతదేశంలో వేల ఏండ్లుగా కుల వ్యవస్థను ఆసరాగా చేసుకుని జరుగుతున్న దోపిడీపై నాలుగు రకాల ఉద్యమాలు జరగాల్సిన అవసరాన్ని గుర్తించిన పెరియార్ ఆ దిశగా ఉద్యమించి విజయం సాధించాడు. వరుస క్రమంలో జరగాల్సిన సాంస్కృతిక విప్లవం, కుల నిర్మూలనోద్యమం, వర్గ నిర్మూలనోద్యమం, ప్రాంతీయ ఉద్యమాలు దేశ దోపిడిదారుల కుట్రల వల్ల తిరోగమనంలో జరుగుతున్నాయి. అనాదిగా ఎన్నో రుగ్మతలతో దోపిడీకి గురవుతున్న ప్రజలను మొదటగా సాంస్కృతిక విప్లవంలో విజయవంతం చేయాలి. అసమానతలకు ప్రధాన కారణమైన కుల నిర్మూలనోద్యమం రెండవదిగా జరిగి ఆర్ధిక అసమానతల నిర్మూలనకు వర్గ పోరాటం జరగాలి. చివరగా జరగాల్సిన ప్రాంతీయ అసమానతల ఉద్యమాన్ని పాలక దోపిడీ వర్గాలు ముందుకు తీసుకొచ్చి వారి దోపిడీ నిరాటంకంగా కొనసాగిస్తున్నారు. సాంస్కృతిక విప్లవం విజయవంతం ద్వారానే మిగతా విప్లవాలు విజయవంతం అవుతాయని పెరియార్ ఉద్యమంతో అర్ధం చేసుకోవాలి.

    పెరియార్ ఉద్యమానికి ప్రభావితమైన విశాఖపట్నంకు చెందిన డాక్టర్ జయగోపాల్ తన చిన్ననాటి నుండే మూఢ విశ్వాలపై వ్యతిరేక ఉద్యమం మొదలుపెట్టారు. తన శాస్త్రీయ విధానం, కింది కులాలతో స్నేహాన్ని భరించలేని తండ్రి ఒక దశలో జయగోపాల్ ను హత్య చేయడానికి కూడా ప్రయత్నం చేసాడు. తన ఆలోచనలు, భావాల కోసం పెళ్లికి ముందే ఇంటి నుండి బయటకు వచ్చి కులరహిత వివాహం చేసుకున్నాడు. నాస్తికత్వమే ఈ దేశ పీడిత వర్గాల విముక్తి మేలు చేస్తుందని భావించి 1972 ఫిబ్రవరి 13 న భారత నాస్తిక సమాజం స్థాపించి 50 ఏండ్లు అవుతుంది. గత 50 ఏండ్లుగా వేల మంది ఉద్యమకారులను తయారుచేసి లక్షల మందిని ప్రభావితం చేశారు. నాస్తిక సమాజంలో శిక్షణ పొందిన ఎంతో మంది ఇతర ప్రగతిశీల ఉద్యమాల్లోకి వెళ్లారు. ఒకరకంగా చెప్పాలంటే ఎన్నో ఉద్యమాలకు జయగోపాల్ బోధనలు ఊతమిచ్చాయి.   జయగోపాల్ అంకితభావాన్ని, ఉద్యమ క్రమశిక్షణను గుర్తించిన అంతర్జాతీయ నాస్తిక సమాజంలో సభ్యునిగా నియమించారు. నాస్తిక ఉద్యమాల్లో భాగంగా ఆయన విదేశాలకు కూడా వెళ్లి వచ్చారు. కుల వ్యవస్థ, సంస్కృతి, మతోన్మాదం, మానవ హక్కులు, అభ్యుదయం, కళలు, సాహిత్యం, పాసిస్టు విధానాలపై, స్త్రీ సమానత్వం, మత బానిసత్వం, సెక్యులరిజం, మూఢ విశ్వాశాలపై 50 కి పైగా పుస్తకాలు వ్రాసారు. జయహోపాల్ రచనలకు అమెరికన్ విశ్వవిద్యాలయం డాక్టరేట్ ఇచ్చి గౌరవించింది. మతోన్మాదం ఎన్ని మారణహోమాలు చేస్తుందో ఆయన 20 ఏండ్ల క్రితం వ్రాసిన గ్రంధం నేటికి ఇండియాలో ప్రచురణకు నోచుకోలేదు కానీ జర్మనీలో ఐదు ముద్రణలు, పోలాండ్ లో రెండు ముద్రణ జరుపుకుని అక్కడి ఉద్యమకారులు ప్రజలను చైతన్యం చేస్తున్నారు. ఆయన వ్రాసిన రచనల్లో మహాభారత యుద్ధం చారిత్రకమా? కాల్పనికమా? ఆత్మ-పునర్జన్మ భయాలు, బ్రాంతులు, మూఢనమ్మకాలు-శాస్త్రీయ పరిశీలన, క్రీస్తు చారిత్రక పురుషుడా? కుల నిర్మూలన-సాంస్కృతిక విప్లవం, చెలరేగుతున్న హిందూ ఫాసిజం, జ్యోతిష్యం సైన్సా, మూఢనమ్మకమా, విశ్వం అంటే ఏమిటి, క్రైస్తవం బానిసత్వం, ప్రాచీన యూరప్ దేశాల్లో బానిసత్వం, పెరియార్ వర్ణ, వర్గ నిర్మూలనోద్యమం లాంటి ఎన్నో చైతన్య, చరిత్ర గ్రంధాలను ప్రజలకు అందించారు. 

    డాక్టర్ జయగోపాల్ చేత ప్రారంభమైన భారత నాస్తిక సమాజం అనుబంధ విభాగాలను కూడా ఏర్పాటు చేసుకుని ముందుకు సాగుతోంది. ముఖ్యంగా సైంటిఫిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ద్వారా విద్యార్థి యువతలో మూఢనమ్మకాలపై అవగాహన కల్పించడమే కాకుండా కుల నిర్మూలనోద్యమంలో చురుకుగా పాల్గొంటున్నారు. కులాంతర వివాహాలు, ఆదర్శ వివాహాలు జరుపుతూ అభ్యుదయ భావాల సమాజ నిర్మాణం కోసం పాటుపడుతున్నారు. సమాన విద్యా సాధన పోరాటంలో కీలకపాత్ర వహించిన భా.నా.స అణగారిన ప్రజలకు విద్య అందుబాటులోకి రావాలని, ఆ విద్య శాస్త్రీయ దృక్పథంతో ఉండాలని, స్త్రీలపై గౌరవం, నైతిక విలువలు, సామాజిక స్పృహ, సమభావం పాఠశాల దశ నుండే కల్పించాలని గత 20 ఏండ్లుగా విద్యా సంస్థల్లో ప్రచారం చేస్తూ ఉద్యమిస్తూనే వుంది. 

   నాస్తికత్వమంటే దేవుడు లేడని ప్రచారం చేయడమే కాకుండా పీడిత ప్రజల విముక్తి కోసం నిస్వార్ధంగా  ఉద్యమాలు చేయడమని ప్రపంచ నాస్తిక ఉద్యమాలను అధ్యయనం చేస్తే అర్ధమవుతుంది. వాస్తవాలను ప్రజలకు అర్ధం చేయించడంకోసం, ప్రజల పక్షాన నిలబడి దోపిడి శక్తులను ఎదిరించిన చరిత్ర నాస్తిక, శాస్త్రవేత్తలకు వుంది. అవినీతి వ్యవస్థీకృతమైన నేటి వ్యవస్థలో కనపడని వ్యవస్థీకృత హింసపై ప్రజలను చైతన్యం చేయవలసిన అవసరముంది. ప్రజలను మానసిక బానిసత్వం నుండి బయటకు తీసుకురాకుండా ఎలాంటి హక్కులు సాధించలేమనే వాస్తవాన్ని ఉద్యమ శక్తులు గమనించాలి. అందుకోసం నాస్తిక భావాల అభివృద్ధికి, దోపిడి పీడినలు లేని సమసమాజ స్థాపనకు ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిన అవసరముంది. 


(భారత నాస్తిక సమాజం స్థాపించి 50 ఏండ్లు అయిన సందర్భంగా వరంగల్ లో సెప్టెంబర్ 30 నుండి అక్టోబర్ 2 వరకు జరుగుతున్న నాస్తిక మహాసభల సందర్భంగా)



     సాయిని నరేందర్

   సామాజిక విశ్లేషకులు

    9701916091

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు