ఇది ఆపిల్ రైతు నోళ్లు గొట్టే కొత్తరకం టెర్రరిజం!


8000 ఆపిల్ ట్రక్కుల నిరవధిక నిలిపివేతలో దాగిన రాజ్య హింస! 
కాశ్మీర్ రైతుల కళ్ళు కార్చేకన్నీళ్లు తుడవలేక మన కళ్ళ నుండైనా కొన్ని కన్నీళ్లు కార్చి మేమూ మనుషులమే అనిపించుకుందాం 





కోతి వీపుపై పిల్లి ఎక్కితే,  గేదె పొదుగులో మేక పిల్ల పాలు త్రాగితే, జాలరి వలకు యాబై కేజీల చేప చిక్కితే, ఊరి అసామీ పెరట్లో మూరెడు పొడవు వంకాయ కాస్తే, వస్తాదు భీమయ్య వంద కేజీల బస్తా నెత్తికి ఎత్తుకుంటే మన మీడియా ఫ్రంట్ పేజీ బ్యానర్ ఐటమ్స్ తో భారీ పబ్లిసిటీ... అంబానీ షేర్ విలువ పెరిగితే, ఆదానీ ప్రపంచ కుబేరుడుగా మారితే, జీడీపీ లో బ్రిటన్ ని ఇండియా దాటిపోతే, మన మీడియా హుషారే హుషార్! 

 మోడీ ధరించే షూట్, రాహుల్ డ్రెస్... కావేవీ పబ్లిసిటీకి అనర్హం!  కానీ శ్రీనగర్ నుండి జమ్ము హైవే (NHW-44) పై రోజుల తరబడి 8000 ఆపిల్ ట్రక్కుల్ని ఆపిన విషాద దృశ్యం మాత్రం మీడియాకి కనబడదు. దానివల్ల 75 లక్షల మంది కాశ్మీర్ లోయప్రజలు కార్చే కన్నీళ్లు కనబడవు. శ్రీశ్రీ ఎప్పుడో మీడియా గూర్చి చెప్పిన మాటలు ఎంత పచ్చి నిజమో కదా!


  8000ఆపిల్ ట్రక్కులు... 56 లక్షల పండ్ల పెట్టెలు... 640 కోట్ల రూపాయల పంట.. ఏడాది పొడవునా  కష్టపడి చేతికి వచ్చే టైమ్ కి తమశ్రమఫలం బూడిద లో పోసిన పన్నీరుగా మారే వేళ.. ఆ లోయలోని లక్షలాది రైతుల బాధ ఎలా ఉంటుందో! 


   ఆదానీ సంపద మరింత పెరగాలి. ప్రపంచ  కుబేర చక్రవర్తుల నిచ్చెన మెట్ల వరసలో త్వరలోనే మరో మెట్టు ఎక్కాలి. అంబానీ సంపద ఇంకా పెరగాలి. వారి అప్రతిహత ప్రయాణ మార్గంలో BSNL, భీమా, బ్యాంకింగ్, రైల్వే,  బొగ్గు, రక్షణ రంగాలు ధ్వంసం!  వాళ్ళ కళ్ళు అందమైన కాశ్మీర్ లోయ పై కూడా! అందుకై 370 35A రద్దు! ఈ ఆగస్టు 5 కి మూడేళ్లు! 13 వేలమంది యువత నిర్బంధం! గవర్నర్ చీకటి పాలన! బయటి వాళ్ళు లోయ భూముల్ని కొనే స్వేచ్ఛ! ఐతేనేమి ఆపిల్, కుంకుమ, డ్రై ఫ్రూట్స్ తోటల సన్నకారు, చిన్న రైతుల్లో ఒక్కశాతం మంది కూడా తమ భూముల్ని అమ్మక పోవడం! నిద్ర పట్టని బడా కార్పోరేట్ సంస్థలు! ఇప్పుడు వారికి కునుకు పడుతోంది. హైవే రవాణా బంద్ వారికి పెను ఆనందమే మరి!,


 పెట్టుబడిదారీ వ్యవస్థ పై మార్క్స్ ది ఎంత అద్భుత  విశ్లేషణ! దానికి సరుకుల అమ్మకపు శక్తి వుండగానే, వాటిని ఖర్చు చేయాల్సిన  ప్రజల కొనుగోలుశక్తి దెబ్బ తింటుంది. పెట్టుబడిదార్ల  అమ్మకపు శక్తికీ, ప్రజల కొనుగోలు శక్తికీ మధ్య ఓ మౌలిక వైరుధ్యమది. అది పారిశ్రామిక రంగం మాట!  ఇప్పుటి కాశ్మీర్ లోయలో  వ్యవసాయ భూముల పరిస్థితి భిన్నమైనది. ఇదీ మార్క్స్ చెప్పిన మాటే!


  ఇప్పుడు పెట్టుబడి కోరేది లోయ భూమిని సరుకుగా మార్చాలనేది. దానికి కొనుగోలుదార్లు, అమ్మకపు దార్లు ఇద్దరూ ఉండాలి. అమ్మకందార్లు స్థానిక రైతులైతే, వాటిని  కొనే కొనుగోలుదార్లు బయటి కార్పోరేట్లు!

  

   విచిత్రస్థితి ఏమంటే; నేడు బియ్యం, పప్పు, ఉప్పు, నూనెలు, బట్టలు, ఎరువులు, విత్తనాలు, మందులు, పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ వంటి సకల సరుకుల్ని ఉత్పత్తి చేయించి మార్కెట్లో అమ్మే పెట్టుబడిదారీ వర్గానికి అమ్మకపు సామర్ధ్యం అధికంగా ఉంది. వాటిని ఉత్పత్తి చేసే శ్రామికవర్గం తో సహా ప్రజలకు వాటిని కొనుగోలు చేసే సామర్ధ్యం తగ్గుతుంది. లోయలో ఓ భిన్నమైనస్థితి ఏర్పడింది. 



   కొత్త సరుకుగా భూమి ముందుకొస్తోంది. రేపు అదో మార్కెట్ వ్యవస్థగా మారాలి. ఆ సరికొత్త మార్కెట్ వ్యవస్థలో తమ భూముల్ని అమ్మాల్సిన రైతులు అమ్మకందార్లుగా మారాలి. కానీ వారు అలా మారడం లేదు. కొనాల్సిన వర్గం డబ్బు సంచులతో సిద్ధంగా ఉంది. ఇప్పటికే మన విశాల భారతదేశ ప్రజల చెమట, నెత్తుర్లను కొల్లగొట్టి గడించిన భారీ డబ్బు మూటలతో బడా కార్పోరేట్లు సిద్ధంగా ఉన్నా తమ చెమట, నెత్తుర్లని నమ్ముకొని ఆరుగాలం కష్టపడే రైతులు సిద్ధంగా లేరు. ఇదే లోయలో నేటి రాజకీయ సంక్షోభం!


  మోడీ షా సర్కార్ అండతో 370, 35A రద్దు చేయిస్తే బడా కార్పోరేట్లకి ఒరిగిందేమిటి? అవి రద్దు చేసి మూడేళ్లు గడిచినా, అంబానీ, ఆదానీ ఆశలు నెరవేరడం లేదు. డబ్బు మూటలతో కొనడానికి సిద్ధంగా ఉంటే మాత్రం భూముల్ని అమ్మేవాళ్ళు లేకపోతే ఫలితం ఏమిటి? ఔను, మిగిలిన భారత్ లో భూముల స్వాధీనం కోసం తెలంగాణ, మలబారు, ఉన్నప్రా వాయలార్ భూపోరాటాల కంటే ముందే షేక్ అబ్దుల్లా నేతృత్వంలో సమరశీల భూ ఆక్రమనోద్యమాన్ని చేపట్టిన ఘన చరిత్ర కాశ్మీర్ రైతాంగానికి ఉంది.  వారి నేటి దృఢదీక్ష వెనక ఓ వీతోచిత వారసత్వం ఉంది. ఆ ఉక్కు దీక్షను దెబ్బతీసే అవసరం నేటి రాజ్యానికి ఏర్పడింది. ఫలితమే NHW-44 పై కుంటి సాకులతో పండ్ల రవాణా నిలిపివేత!  


 పండించిన పంట చేతికి రాకపోతే రైతుల్లో నిరాశ ఏర్పడుతుంది. రైతులుగా మనుగడ లేదనే భావం ఏర్పడుతుంది. వాటిని అమ్ముకొని కూలీలుగా మారడమే ఉత్తమమని వారి మనస్సుల్లో రేపు ఏర్పడాలి. అందుకే ఈ కొత్తరకం ఉగ్రవాదం!


  ఈ హైవే రవాణా బంద్ ఓ ఉగ్రవాదం రూపం ధరించింది. ఇదో కొత్త రకం రాజ్య ఉగ్రవాదం! ఇది లోయని నేడు కన్నీటి శోకంలో ముంచి వేస్తోంది. అక్కడ రైతులు, ట్రేడర్లు, డ్రైవర్లు సమిష్టిగా నిరసన ఆందోళనల్ని చేపట్టాయి. ఆది, సోమవారాల్లో 48 గంటల నిరసన బంద్ ని లోయలోని శ్రీనగర్, సోపోర్, పుల్వామా, బరాముల్లా, షోపియాన్ తదితర మొత్తం 8 పండ్ల మార్కెట్లు కూడా బంద్ పాటించాయి. ఐనా వారి మొరలు మీడియాకి పట్టలేదు. ప్చ్. ఇదీ నేటి దుస్థితి!


   లాఠీ,తూటా, జైలు, లాకప్పు, ఉరికంభం వంటివి రాజ్య హింసకు ప్రతీకలుగా చూస్తున్నాం. ఉపా, పోటా, టాడా, NIA ల్ని రాజ్య ఉగ్రవాదానికి గుర్తుగా భావిస్తున్నాము. స్టాన్ స్వామి మృతిలో, GN సాయిబాబా అండా సెల్ లో, వరవరరావు సుదీర్ఘ నిర్బంధంలో రాజ్య వర్గ స్వభావాన్ని మనం చూస్తున్నాం. కానీ చెట్ల మీద కాసిన పండ్లను రవాణా కానివ్వకుండా కూడా రాజ్య ఉగ్రవాదం విస్తరిస్తోన్న కొత్త నిజాన్ని కూడా నేడు చూస్తున్నాం. 


  మత ప్రాతిపదికన ఏర్పడ్డ పాకిస్థాన్ ఆటవిక మూకలు 1947 అక్టోబర్ లో లోయలో చొరబడితే ఆ సాయుధ మూకల్ని అశేష రక్తతర్పణలతో ఎదిరించి పోరాడిన నాటి లోయ రైతుల మనవళ్లు, ముని మనవళ్లు నేడు శోక సముద్రంలో మునిగి పోయారు. వాళ్ళ కన్నీళ్లని తుడవలేక పోవచ్చు. కానీ ఈ కుహనా ప్రజాతంత్ర, లౌకిక రాజ్యంలో వాళ్లకు జరిగే ఘోర అన్యాయాన్ని కనీసం ఖండిద్దాం. నేడు బడా కార్పోరేట్ మీడియా దాచిపెట్టే వార్తల్ని కనీసం మన సాటి ప్రజలకు షేర్ చేద్దాం. వాళ్ళ కన్నీళ్లను తుడవాలంటే NHW-44 హైవే పై భారత్ సర్కార్ చేపట్టిన రవాణా ఉగ్రవాద విధానం పై పోరాడాలి. ఆ స్థితి మనకు లేకపోతే, ఆచరణలో వారి కళ్ళ నుండి కారే కన్నీళ్లను తుడవలేము. ఆ పనిని చేయలేకపోతే కనీసం మన కళ్ళ నుండైనా కొద్ది కన్నీళ్లు కారుద్దాం. మనం అలాగైనా మనుషులమని అనిపించుకుందాం. ఆ తృప్తినైనా పొందుదాం. 


  ఇఫ్టూ ప్రసాద్ (పిపి)

 27-9-2022

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు