వరవరరావుకు రెగ్యులర్ బెయిలు మంజూరు
విప్లవ రచయితల సంఘం నేత పి వరవరరావుకు సుప్రీంకోర్టు బుధవారం రెగ్యులర్ బెయిలు మంజూరు చేసింది. భీమా కొరెగావ్ కేసులో బోంబే హైకోర్టు 2021 ఫిబ్రవరి 22న ఇచ్చిన ఆరు నెలల బెయిలును పర్మనెంట్ బెయిలుగా మార్చింది. అయితే ఈ కేసు విచారణ జరుగుతున్న ట్రయల్ కోర్టు అధికార పరిధిలోని ప్రాంతం అయిన ముంబై నుంచి వెలుపలికి వెళ్ళకూడదని షరతు విధించింది. ఈ స్వేచ్ఛను దుర్వినియోగం చేయరాదని కూడా తెలిపింది.
కేసు దర్యాప్తును ఏ విధంగానూ ప్రభావితం చేయరాదని, సాక్షులతో సంప్రదింపులు జరపకూడదని కూడా వివరించింది. ఆయన వయసు 82 సంవత్సరాలు కావడం, అంతేకాకుండా అనారోగ్య పరిస్థితులు ఉండటం వల్ల వైద్యపరమైన కారణాల మేరకు ఈ బెయిలును మంజూరు చేస్తున్నట్లు అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. చికిత్సకు సంబంధించిన వివరాలను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు తెలియజేయాలని వరవరరావును ఆదేశించింది.
అంతకుముందు ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో సుదీర్ఘంగా విచారణ జరిగింది.
అనారోగ్య కారణాల దృష్ట్యా తనకు పర్మినెంట్ మెడికల్ బెయిల్ మంజూరు చేయాలని ఆయన కోరారు.
జస్టిస్ యుయు లలిత్, జస్టిస్ రవీంద్ర భట్, జస్టిస్ సుధాంశు దులియా తో కూడిన ధర్మాసనం ముందు విచారణ జరిపి, ఆయన బెయిలును పర్మనెంట్ బెయిలుగా మార్చింది. అవసరమైతే విచారణకు సహకరించాలని షరతు విధించింది.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box