శూద్రజాతీయ వాద "భూమిక"ను సిద్దం చేసిన కొత్త శివమూర్తి

 

శూద్రజాతీయ వాద "భూమిక"ను తన రచనల ద్వార ప్రతిపాదించిన  కొత్త శివమూర్తి


తొలుత విప్లవ సిద్దాంతాలకు ఆకర్షితులై సామాజిక గమనంలో అబ్బిన తర్క వితర్క ఙానంతో తనకు తాను   మూలవాసిగా దిద్దుకుని తన పరిశోధక రచనల ద్వార ఆర్యుల కట్టుకథల రహస్యాలను బట్ట బయలు చేసిన వ్యక్తి కొత్త శివమూర్తి
ఆయన  మనల్ని వీడి ఏడాది గడిచింది.  26-08-2022 ఆయన  భౌతికంగ దూరమయ్యాడు.బహుజన తాత్వికుడు కొత్త శివమూర్తి నిరంతర మూలవాసి విప్లవ స్వాప్నికుడు. స్వతంత్ర చింతనాపరుడు. ఈ దేశ మూలవాసుల(శూద్రుల) ఆత్మగౌరవ పతాకం. నికార్సయిన ప్రపంచస్థాయి మూలవాసి చరిత్రకారుడు. నిరాడంబరుడు, హేతువాది. బౌద్ధ కర్మయోగి, శుద్ధ ఆచరణవాది.

 

ఆయన జీవితకాల కృషికి మనం సరైన ప్రచారం కల్పించగలిగితే, ఈ దేశంలోనేకాదు, ప్రపంచ నలుమూలల్లో ఉన్న బుద్ధిజీవులకు కూడా ఆయన రచనలను చేరవేయగలిగితే, ఆయన రచనలు, ఆలోచనలు ప్రపంచ చరిత్రను పెను మార్పులకు గురిచేయడమే కాదు, అంతర్జాతీయ రాజకీయాలలో, ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో పెను మార్పులకు మూలం అవుతాయి. అంతటి లోతులు, గాఢత, విస్తృతి, విస్ఫోటనశక్తి శివమూర్తిగారి రచనల్లో ఉందని నా ప్రగాఢ విశ్వాసం.

 

శివమూర్తిగారు జీవించిన జీవన విధానం నిబద్ధత, నిజాయితీ, ఆచరణ, ఆదర్శాల మేళవింపు. కొత్త శివమూర్తిలాగా అలాంటి జీవితం గడిపి, ఆ జీవన విధానాన్ని తమ తుదిశ్వాస విడిచేంత వరకు కొనసాగించిన వారిలో నేను ఇప్పటికి వరకు చూసిన వారిలో, నాకు వ్యక్తిగతంగా తెలిసిన వారిలో మరో ఇద్దరు ఉన్నారు. వారిలో ఒకరు మారోజు వీరన్న, మరొకరు డాక్టర్ కె. బాలగోపాల్. వారి ముగ్గురిలో అనేక సారూప్యతలు ఉన్నాయి.

 

శివమూర్తిగారు నాకు 1994లో మొదటిసారి పరిచయం ఐనప్పుడు అతనిలో సమాజమార్పుకోసం ఏ తపన, నిబద్ధత, నిజాయితీ, పరిశ్రమ కనిపించాయో, ఆయన 26-08-201న రాజమండ్రి ప్రభుత్వ హాస్పిటల్లో చనిపోయే చివరి నిముషం వరకు అవే ఆయనలో ప్రస్ఫుటంగా కనిపించాయి.

 

పెట్టుబడిదారీ వస్తువినిమయ సంస్కృతికి దాసోహమై కుటుంబానికి తప్ప సమాజానికి సమయం కేటాయించడానికి తటపటాయించే సోకాల్డ్ బుద్దిజీవులున్న సందర్భం ఇది. కావలసిన జ్ఞాన సముపార్జనకు కనీస సదుపాయలు లేకున్నా తన కుటుంబ పోషణకు తనకు కనీస ఆర్థిక భద్రత లేకున్నా, తన బంధువులు ఆర్థికంగా, రాజకీయంగా బలమైన సామాజిక వర్గంగా ఉన్నా వారిపై ఏనాడు ఆధారపడకుండా, పీడిత సమాజంతో ఉంటూ ఆ సమాజం అందించే 'అనిశ్చిత భిక్ష' పైనే ఆధారపడుతూ 30 సంవత్సరాల కాలం సామాజిక లక్ష్యం కోసమే పని చేయగలగడం శివమూర్తి లాంటి స్థితప్రజ్ఞులకే సాధ్యం.

 

శివమూర్తిగారిది ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని జాగర్లమూడి గ్రామం. ఆయనది మధ్యతరగతి కమ్మకులానికి చెందిన రైతుకుటుంబం. చిన్నతనం నుండి స్వతంత్ర

భావాలు కలిగి ఉండటమేకాక, ధిక్కార ధోరణి కలవాడు. అదే ధోరణి, మొండితనం ఆయన జీవితం చివరి వరకు కనిపిస్తాయి.

 

ఆయన అకాడమిక్ చదువు ఏడవ తరగతి కూడ దాటలేదు. ఐనా నిరంతరం సాహిత్యాన్ని ఆస్వాదించేవాడు. ఆయనపై ప్రముఖ చరిత్రకారుడు రాహుల్ సాంకృత్యాయన్ సాహిత్య ప్రభావం అధికం. 1965 నుండి కమ్యూనిస్టు ఉద్యమంలో వరంగల్ జిల్లాలో క్రియాశీల కార్యకర్తగా పనిచేస్తూ, కమ్యూనిస్టు ఉద్యమ చీలికల సందర్భంలో కొండపల్లి సీతారమయ్య, కె.జి. సత్యమూర్తిగార్ల నాయకత్వంలో నక్సల్బరీ ఉద్యమంలో భాగస్వాములు అయ్యారు. నక్సలైట్ ఉద్యమంలో పూర్తిస్థాయి కార్యకర్తగా వెళ్లేముందు శివమూర్తి తన వాటాగా వచ్చిన ఆస్తులను అమ్మి వాటిని ఉద్యమ సంస్థకు ఇచ్చిన కమిట్మెంట్ ఆయనది.

 

రాజమండ్రి కుట్రకేసులో ఆయనకూడ ఒక ముద్దాయి. 1979 నాటికే శివమూర్తి కమ్యూనిస్టుపార్టీ కార్యక్రమం, వారి ఆచరణ, కమ్యూనిస్టుల సైద్ధాంతిక అవగాహనపై నమ్మకం సడలింది. ఈ దేశంలో ఉన్న వర్ణకుల వ్యవస్థ నిర్మూలనకు, వర్గ నిర్మూలనా పోరాటానికి ఈ దేశంలోని కమ్యూనిస్టుల సైద్ధాంతిక అవగాహన, వారి పనివిధానం ఏమాత్రం ఉపయోగపడదనే నిర్ణయానికి వచ్చారు. అంతేకాక వర్గపోరాటాలకు ఈ దేశంలోని బ్రాహ్మణీయ వర్ణకుల వ్యవస్థ తీవ్ర ఆటంకంగా మారుతుండటాన్ని ఆయన గమనించి ఈ దేశ సామాజిక వ్యవస్థను, చరిత్రను మరింత లోతుగా అధ్యయనం చేయడం ద్వారా మాత్రమే విప్లవ కార్యాచరణను సమగ్రం చేయవచ్చనే నిర్ణయానికి వచ్చి, పార్టీ అనుమతితో విప్లవోద్యమం నుండి 1980లో బయటకు వచ్చాడు. అనంతరం తన తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన మరికొంత ఆస్తితో, మిత్రుల సహకారంతో పశ్చిమ గోదావరి జిల్లా విజయరాయి వద్ద మూడు ఎకరాల పొలం కొనుగోలు చేసి కొబ్బరి తోట వేశారు. అనంతరం బంధువులు, మిత్రుల వత్తిడితో 1982లో తన 46వ ఏట పేదింటి అమ్మాయైన రాజేశ్వరిని వివాహం చేసుకున్నారు.

 

ఐతే తను విప్లవోద్యమం నుండి బయటకు వచ్చిన ఉద్దేశ్యం సాధారణ జీవితం గడుపుతూ ఆస్తులు పోగేసుకోవడం కాదు కాబట్టి, తన పరిశోధనకు తన వ్యవసాయం ఆటంకంగా మారకూడదని ఆ భూమిని తన మిత్రునికి ఉచితంగా కాస్తుకి ఇచ్చేసి తను మేధతో కాకుండా కేవలం తన శారీరక శ్రమతో చేసే చిన్నపాటి కూలీ పనులను ఎంచుకుని తన కుటుంబం నడవడానికి అవసరమైన చిన్నచిన్న ఖర్చులకు శారీరక శ్రమ చేస్తూ తన పరిశోధనకు మాత్రమే తన ఆలోచనలు పరిమితం చేసి అందుబాటులో ఉన్న సాహిత్యాన్ని విస్తృతంగా అధ్యయనం చేస్తూ తన పరిశోధన సాగించారు. ఆ పరిశోధనల్లో శివమూర్తిగారికి కీలకమైన ఆధారం రాహుల్ సాంకృత్యాయన్ రచనయైన 'మానవ విజయం' అనే గ్రంథంలో దొరికింది.

 

1992 వచ్చేసరికి ఈ దేశంలో మనువాదులు తమ ఫాసిస్టు కార్యాచరణను దేశవ్యాప్తంగా విస్తరించి బాబ్రీ మసీదును కూల్చారు. అప్పటికే దేశ రాజకీయాలను నిశితంగా గమనిస్తున్న శివమూర్తి తన అధ్యయనాన్ని మరింత వేగంగా, ఉధృతంగా సాగించాలని నిర్ణయించుకుని అప్పటికి 10 సంవత్సరాల వయస్సుగల తన కొబ్బరితోటను అమ్మేసి ఆ డబ్బు తన కుటుంబ నిర్వహణ కోసం తన భార్యకు ఇచ్చేసి 1992లో బాబ్రీ మసీదును కూల్చిన డిసెంబర్ 6 నుండి ఇంటికే పరిమితమై రాహూల్ సాంకృత్యాయన్ రచనయైన 'మానవ విజయం'లో దొరికిన ఆధారంతో యుగాల కాలాలను, బ్రాహ్మణమత సాహిత్యాన్ని డీకోడ్ చేయడం ప్రారంభించి 1993 ఏప్రిల్ నాటికి యుగాల కాలాన్ని డీకోడ్ చేసి హైదరాబాదులోని మేధావులతో తన అధ్యయనాన్ని పంచుకోవడానికి, దానిని వారి సహకారంతో మరింత అభివృద్ధి చేయాలనే సంకల్పంతో 1994 ఫిబ్రవరి నాటికి కుటుంబంతోసహా హైదరాబాదు చేరుకున్నారు.

 

1994లో నేను ఉస్మానియా యూనివర్శిటి పి.డి.ఎస్.యు. (విద్యార్థి సంఘం) బాధ్యుడుగా పనిచేస్తున్నాను. ఆ సమయంలో యూనివర్సిటీలో ఒక మీటింగుకు వక్తగా గద్దర్ అన్నను ను పిలవడానికి వెంకటాపురంలో ఆయన ఇంటికి నేను, మరి కొందరు సంస్థ కార్యకర్తలతో వెళ్లిన సందర్భంలో కొత్త శివమూర్తిగారు గద్దరన్న ఇంటిలో ఆయనకు తన పరిశోధనా విషయాలు వివరిస్తు కనిపించారు. మేము ఆసక్తిగా ఆయన వివరణను విన్నాము. అదే నేను శివమూర్తిగారిని మొదటగా చూడటం.

 

శివమూర్తిగారు గద్దర్ ఇంటినుండి వెళ్లిన అనంతరం మేము గద్దర్ గారితో మా పని ముగించుకుని వెంకటాపురం బస్టాండ్ వెళ్లేసరికి శివమూర్తిగారు ఇంకా అక్కడే బస్టాండ్లో బస్సు కోసం ఎదురుచూస్తున్నారు. నేను వెళ్లి ఆయనను పలకరించి ఆయన పరిశోధన విషయాలను మరొకసారి మాకు వివరించమని అడగడం, దాదాపు రెండు గంటల పాటు మాకు ఆయన చరిత్ర పరిశోధనకు సంబంధించన తన నూతన కోణాన్ని, దాని ఆధారంగా ఆయన వెలికి తీసిన మూలవాసుల చరిత్రను, చరిత్రలో ఆర్యజాతి కుట్రలను సంక్షిప్తంగా మాకు వివరించారు. అనంతరం ఆయన అడ్రస్ తీసుకొని మేము ఉస్మానియా కాంపస్ కు వెళ్ళిపోయాము. అలా శివమూర్తిగారు సరికొత్తకోణంలో చెప్పిన చారిత్రక విషయాలు నాలో చాలా ఆసక్తిని పెంచాయి.

 

అనంతరం శిమూర్తిగారు కామ్రేడ్ మారోజు వీరన్నను కూడ కలవడం, వీరన్న శివమూర్తిగారి పరిశోధనను విని ఆయనను అప్రిషియేట్ చేయడమే కాకుండా తనకు పూర్తి సహకారం అందించడం జరిగింది. అందులో భాగంగానే, శివమూర్తిగారికి వ్రాయడం సరిగా రానందున కామ్రేడ్ మారోజు వీరన్న నాకు శివమూర్తిగారు చరిత్రను చెబుతుంటే వ్రాసేపని అప్పగించారు. ఆరోజు నుండి నేను ప్రతిరోజు రాత్రి 9 గంటలకు శివమూర్తిగారి రూమ్ కి చేరుకుని రాత్రి 3 గంటల వరకు ఆయనతో చర్చిస్తూ ఆయన చెప్పే చరిత్రను వ్రాయడం జరిగేది. అలా దాదాపు శివమూర్తిగారి మేజర్ రచనలైన 'వేదభూమి కాదు ఇది నాగభూమి', 'అవతారాల గుట్టు', 'బ్రాహ్మణిజం జన్మ రహస్యం' రచనల స్క్రిప్ట్ దాదాపు పూర్తిచేయడం జరిగింది. ఆ వ్రాత ప్రతులను ఎప్పటికప్పుడు నేను వీరన్నకు చేరవేసేవాడిని. అలా నాకు శివమూర్తిగారితో ఏర్పడిన పరిచయం ఆయన చనిపోయే వరకు కొనసాగింది. నిజానికి శివమూర్తిగారి రచనలు కామ్రేడ్ మారోజు వీరన్నపై చాలా ప్రభావం చూపాయి. ఆయన శివమూర్తి రచనలను విస్తృతంగా కాడర్ లోకి తీసుకు వెళ్లారు. బహుశా వీరన్నను మనువాద రాజ్యం బలి తీసుకోక పోయినట్లైతే శివమూర్తి రచనలు విస్తృతంగా జన బాహుళ్యంలోకి వెళ్లేవి, ఫలితంగా బహుజనోద్యమం బలమైన మలుపు తీసుకుని ఉండేది. కానీ వీరన్న హత్య అనంతరం పార్టీ, కాడర్ కకావికలమైపోయింది. అప్పటికి శివమూర్తిగారి రచనలు వీరన్నద్వారా కాడర్లోకి వెళ్ళినప్పటికీ ప్రింట్ కాలేదు. వీరన్న మరణం శివమూర్తిగారి రచనల ప్రచురణకే కాదు, నిజానికి మూలవాసి బహుజన భావజాలానికి, ఉద్యమ పురోగమనానికి తీవ్ర ఆటంకం కలిగించింది.

 

వీరన్న సాహచర్యం మూలంగా, శివమూర్తిగారి రచనలు దళిత బహుజన కులాలకు, ఆ కుల సంఘాల శ్రేణులకు, వాటి నాయకులకు చేరాయి. అలా శివమూర్తిగారికి ఆ శ్రేణులతో అనుబంధం ఏర్పడింది. ఆ బంధం శివమూర్తిగారు చనిపోయే వరకు ఏదో మేరకు కొనసాగింది.

 

వీరన్న మరణానంతరం, ఆర్యులు నేటికీ అంతర్జాతీయ జాతిగా కొనసాగుతున్నారనే శివమూర్తిగారి అభిప్రాయంతో ఊసా (ఉ. సాంబశివరావు) విభేదించడం, ఆ విషయంలో శివమూర్తిగారి అవగాహన అశాస్త్రీయం అని ఊసా అభిప్రాయపడ్డారు. ఐనా శివమూర్తిగారు తన అభిప్రాయాలను ఏ మాత్రం మార్చుకోవడానికి ఇష్టపడకపోగా తన అభిప్రాయాలు చారిత్రక సత్యాలని ధృడంగా భావించారు.

 

వీరన్న మరణానంతరం, శివమూర్తిగారి రచనల ప్రచురణకు నాతోపాటు డాక్టర్ అంబటి సురేందర్రాజు, వలిగి ప్రభాకర్ ఎరుకల, కొంపెల్లి వెంకట్ గౌడ్, తోరాటి సత్యనారాయణ, వసంతరావు, ప్రొఫెసర్ ఏడుకొండలు, సాయిబాబు, డి.ఎమ్.ఆర్.శేఖర్, నాగమ్మ పూలే, అమరేందర్ ఇంకా నాకు తెలియని మరికొంతమంది శివమూర్తిగారి మిత్రుల సహకారంతో ఆయన రచనల ముద్రణా ప్రయత్నాలు మొదలయ్యాయి. మా చిన్న చిన్న సహాయాలతో ఒకదాని తరువాత మరొకటి 2002 నుండి 2012 వరకు 6 గ్రంథాలను ముద్రించడం జరిగింది.

 

అనంతరం శివమూర్తిగారికి హైదరాబాద్ లో ఆర్థిక ఇబ్బందులు పెరగడం మూలంగా ఆయన తన మిత్రులు తోరాటి సత్యనారాయణ సహకారంతో తూర్పు గోదావరి జిల్లా కడియానికి  తన కుటుంబంతో సహా షిఫ్టై అక్కడి నుంచే తన రచనా వ్యాసంగాన్ని కొనసాగించారు. మధ్య మధ్యలో హైదరాబాదు వస్తూ తన రచనలను డి.టి.పి. చేయించుకోవడం జరిగేది. ఆర్థిక వనరుల కొరత మూలంగా ఆ తరువాత శివమూర్తిగారు రాసిన ఇంకా ముద్రణ కానివి మరో 3 గ్రంథాలు అలానే ఉండిపోయాయి. ఆయన మిత్రులమైన మాలోని చాలామంది ఆర్థికంగా అంతంత మాత్రపు జీవితాలే కాబట్టి మేము మా ఆర్థిక సహకారం ఆయన కుటుంబం పోషణకు, రచనలకు చిన్నమోతాదుల్లో అందినా అది చివరికంటా సాగించాము. ఇప్పటికి ఏదో మేరకు అందిస్తున్నాము. శివమూర్తిగారిని ఆయన మిత్రులమైన మేము గొప్పగా పోషించకపోయినా, కనీస అవసరాలు తీరుస్తూ కాపాడుకోగలిగాము. ఆ ఇబ్బందుల మూలంగానే మొదటి ముద్రించిన ఐదు (5) గ్రంథాలను నేను, రంగారెడ్డి కోర్టులోని నా సహచర అడ్వకేట్స్ సహకారంతో ఒక స్పైరల్ బౌండ్ గా చేసి జిరాక్స్ చేయించి ఇప్పటికీ దాదాపు ఒక వేయి ప్రతులను రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సాహవంతులకు, జిజ్ఞాస ఉన్నవారికి ఉచితంగా పంపటం జరిగింది.

 

కొత్త శివమూర్తిగారి మొత్తం రచనలు:

 

1) వేద భూమి కాదు ఇది నాగ భూమి (ప్రచురణ: సెప్టెంబర్: 2002)

 

2) అవతారాల గుట్టు (ప్రచురణ: ఏప్రిల్, 2004)

 

3) బ్రాహ్మణిజం జన్మ రహస్యం (ప్రచురణ: అక్టోబర్, 2006)

 

4) అంకెల్లో దాగిన ఆర్యుల అంతర్జాతీయ చరిత్ర (ప్రచురణ: అక్టోబర్, 2011) 5)

 

5) ఆర్య చాణిక్యుడు, పుష్యమిత్ర శుంగుడు, ఆదిశంకరుడు సాక్షిగా బ్రాహ్మణ జాతి కుట్ర (ప్రచురణ: మే, 2012)

 

6) దేశ చరిత్రలో మూలవాసులు వలసవాదులు (ప్రచురణ: ఏప్రిల్, 2012)

 

7) భగవద్గీత, బైబిల్, ఖురాన్ల సాక్షిగా ఆర్యుల చరిత్ర (రచన: 2018)

 

8) మనువాద సమాధికి దోపిడి సమాధికి మార్గం బుద్ధం శరణం గచ్చామి (రచన: 2019)

 

9) ఆర్యుల అంతర్జాతీయ కుట్రకు రక్షణ కవచం దైవం, దైవం అసత్యం ఆర్య-బ్రాహ్మణ కుట్ర సత్యం (రచన: 2021)

 

కొత్త శివమూర్తి రచనలు సమాజంలోకి వచ్చి ఇప్పటికే 20 సంవత్సరాలు కావస్తోంది. ఐనా అలాంటి చారిత్రాత్మక ప్రాధాన్యతగల శివమూర్తి రచనలకు, శివమూర్తికి నిజానికి రావలసిన గుర్తింపుకాని, ఆదరణ కాని రాలేదు. అందుకు ప్రధాన కారణం, ఆయన చరిత్ర పరిశోధనకు ఎంచుకున్న సరికొత్త మార్గం కూడ ఓ ప్రధాన కారణం.

 

కొత్త శివమూర్తిగారు తన రచనల్లో బ్రాహ్మణీయ వర్ణకుల సామాజిక వ్యవస్థ పుట్టుకను, దాని పరిణామాన్ని దాని ఉద్దేశ్యాన్ని, అది ఎవరి సామాజిక ప్రయోజనాల కోసం ఏర్పాటు చేయబడింది, దాని నిరంతర పనివిధానం, ఈ దేశంలోని బ్రాహ్మణీయ సామాజిక వ్యవస్థలోని పై మూడు వర్ణాలకు అంతర్జాతీయ ఆర్యజాతికి, సెమిటిక్ జాతులకు ఉన్న సంబంధం, ఆ జాతులు అంతర్జాతీయంగా అనేక స్థానిక మూలవాసి జాతులను, వ్యవసాయ నాగరికతలను ఏవిధంగా నాశనం చేశాయో, ఆ జాతులు రూపొందించిన దైవ భావాలు, వారు రూపొందించిన యూదు, పార్శీ, క్రిష్టియన్, ఇస్లాం, హిందూ (వేద) మతాలకు ఎలా సారూప్యత కలదో, అవన్నీ ఒకే మూలం నుండి ఎలా ఆవిర్భవించి ఆర్య, సెమిటిక్ జాతియేతరులను ఎలా వంచనకు గురిచేసి వారిపై తమ ఆధిపత్యాన్ని సుస్థిరం చేసుకున్నాయో, క్రుసేడ్ యుద్ధాలు మొదలు, యూరప్ పారిశ్రామిక విప్లవం వెనక ఉన్న వారి విస్తరణవాద కుట్రలు, ఆధునిక సమాజంలో కూడా ఆర్య, సెమిటిక్ జాతులు పైకి ఒక జాతిగా కనిపించకుండానే ఎలా సమన్యయం అవుతూ అంతర్జాతీయ సమాజాన్ని తమ నియంత్రణలో ఎలా ఉంచుకుంటున్నాయో ఆయన తనదైన శైలిలో ఒళ్ళు గగుర్పొడిచే విధంగా వివరించగలిగారు. ఆర్య, సెమిటిక్ జాతులు తమ ఆధిపత్యాన్ని కొనసాగించడానికి, తమ చరిత్రను తాము మాత్రమే తెలుసుకునే విధంగా అంకెల్లో, ఇంగ్లీషు అక్షరాల విలువల్లో, తాము రూపొందించిన మతగ్రంధాల్లో ఎలా మార్మికంగా నిక్షిప్తం చేశారో శివమూర్తిగారు చాలా సోదాహరణంగా ఆయన రచనల్లో వివరిస్తారు. ప్రపంచ వాస్తవ చరిత్రను, వారు రహస్యంగా చరిత్ర మొత్తంగా సాగించిన అనేక కుట్రలను, వారి కపట నాటకాలను ఆర్య, సెమిటిక్ జాతులు తమ తమ మతగ్రంధాల్లో, పురాణ, ఇతిహాసాల్లో ఎలా తమకు మాత్రమే అర్థమయ్యే రీతిలో వ్రాసుకున్నారో, శివమూర్తిగారు డీకోడ్ చేసి వారి గుట్టు అత్యంత ప్రతిభావంతంగా బట్టబయలు చేశారు. అదే విధంగా ఈ దేశానికి వలస వచ్చిన 9 ఆర్యతెగలు ఎలా బ్రాహ్మణులుగా మారారో, అనంతరం వారు ఆహ్వానిస్తే వచ్చిన మిగతా ఆర్య, సెమిటిక్ తెగలు ఇక్కడ మిగతా రెండు అగ్రవర్ణాలుగా మారారో, వారి ఆధిపత్యం కోసం ఈ దేశ మూలవాసులను ఎలా శూద్రులుగా మార్చారో, ఆ క్రమంలో జరిగిన చారిత్రక కుట్రలు, కుతంత్రాలను, చారిత్రక పరిణామాలను, వారి ఎత్తులను, జిత్తులను బ్రాహ్మణులు తమ మత సాహిత్యమైన వేదాలు, రామాయణ, మహాభారత, అష్టాదశ పురాణాలలో ఎలా మర్మగర్భంగా దాచుకున్నారో శివమూర్తిగారు తన రచనల్లో వివరిస్తారు.

 

బాబాసాహెబ్ అంబేద్కర్ తన 'కులనిర్మూలన' గ్రంథంలో "కులవ్యవస్థను ఛేదించడానికి యుగాలు పట్టినా, లేక ఆ పని వెంటనే జరిగినా ఒక్క సంగతి మాత్రం మీరు మరిచి పోకూడదు. అదేమిటంటే, అలా ఛేదించడానికి మీరు ఉపయోగించే డైనమైటును వేదాలపైన, శాస్త్రాలపైన ప్రయోగించవలసి ఉంటుంది. హేతువాదానికి కాని, నైతిక శక్తికి కాని స్థానం లేకుండా చేస్తున్నవి అవే. వాటిని భేదిస్తేనే తప్ప కుల వ్యవస్థను ఛేదించలేరు. శృతుల యొక్క స్మృతుల యొక్క మతాన్ని మీరు నాశనం చెయ్యవలసి ఉంది. మరి దేనివల్లను మీ కృషి ఫలించదు. ఈ విషయంపై ఇదే నా నిశ్చితాభిప్రాయం ఇది", అని అంటారు. కులవ్యవస్థ చుట్టూ ఆర్య బ్రాహ్మణులు సృష్టించిన స్మృతులు, శృతులు, పురాణాలు, ఇతిహాసాలు వాటికి వారు ఆపాదించిన పవిత్రతపై జన సామాన్యానికి ఉన్న విశ్వాసాన్ని సడలించకుండా దానిని ధ్వంసం చేయడం అసాధ్యమంటారు బాబాసాహెబ్.

 

కొత్త శివమూర్తిగారు సరిగ్గా బాబాసాహెబ్ అంబేద్కర్ సూచించిన ఆ చారిత్రక కర్తవ్యాన్నే అత్యంత సాహసంతో, ప్రతిభావంతంగా నిర్వర్తించి బ్రాహ్మణిజం అసలు చరిత్రను, దాని కుట్రలను, స్మృతుల, పురాణాల మాటున మార్మికంగా పై మూడు వర్ణాలు దాచుకొన్న తమ ఆర్యజాతి చారిత్రక మూలాలను తన పరిశోధనాత్మక రచనల ద్వారా సమాజం ముందు బట్టబయలు చేశారు.

 

ఆయన రచనలు బ్రాహ్మణీయ త్రైవర్ణాల ఆర్యమూలాలను, స్మృతుల, శాస్త్రాల, పురాణ, ఇతిహాసాల అసలు గుట్టును రట్టు చేయడమే కాక పైమూడు వర్ణాల విదేశీ ఆర్యమూలాలను తేటతెల్లం చేయడమే కాదు, ఆపై మూడు వర్ణాలను ఈ దేశ మూలవాసులైన శూద్రసమాజం ముందు దోషులుగా నిలబెడుతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతేకాదు, కొత్త శివమూర్తిగారి రచనలు, భావజాలం భవిష్యత్తు శూద్రజాతీయోద్యమానికి కావలసిన ప్రాతిపదికలు తయారుచేసిందనవచ్చు.

 

శివమూర్తిగారు అనుసరించిన కోణం ఆర్య, సెమిటిక్ మతాలైన క్రిష్టియన్, పార్శీ, ఇస్లాం మరియు బ్రాహ్మణ (హిందూ) మతాల మతసాహిత్యం, ఆ సాహిత్యంలోని అంకెలు, అక్షరాలతో ఆ సాహిత్యంలోని పలు మార్మికతలను డీకోడ్ చేస్తూ వాటి ద్వారా ప్రపంచ చరిత్రను రాయడం. ఇది అత్యంత సాహసోపేతమైన నూతన ఆవిష్కరణ. తద్వారా ఆయన బ్రాహ్మణుల యుగాల కాలాలను అత్యంత అద్భుతంగా డీకోడ్ చేశారు. ఆర్య, సెమిటిక్ మత సాహిత్యంలోని అనేక సారూప్యతలను ఎత్తి చూపడమే కాకుండా అందుకు కారణాలను హేతుబద్ధంగా, గతితార్కికంగా వివరించగలిగారు. ఆయన అనుసరించిన చరిత్ర కోణం, విధానం చరిత్రకారులు పురావస్తు ఆధారాలతో చెప్పే చరిత్రకన్న మరింత లోతును, నిర్ధిష్టతను, గాఢతను, వాస్తవికతను కలిగి ఉంది.

 

ఐతే ఈ దేశంలో మేధోరంగంలో వేల సంవత్సరాలుగా అక్రమ గుత్తాధిపత్యం చెలాయిస్తున్న బ్రాహ్మణ మేధావులు శివమూర్తి రచనల లోతులు వారికి అర్ధమైనా తేలుకుట్టిన దొంగల్లా సైలంటుగా ఉంటూ నిశ్శబ్దంగా ఆ కృషిని సమాధి కడుతున్నారు. దానికి తోడన్నట్టుగా, బ్రాహ్మణ వర్గం నిర్దేశించిన పరిశోధనా చట్రాల ప్రభావంలో పడిఉన్న మిగతా మేధావులు, మార్క్సిస్టులతో సహా శివమూర్తిగారి ఆలోచనా స్వాతంత్ర్యాన్ని, సరికొత్త పరిశోధనా మార్గాన్ని అంగీకరించలేక, శివమూర్తి కృషిని నిరర్థకం చేస్తూ మనువాదులకు పరోక్షంగా సహకరిస్తున్నారని అనిపిస్తుంది.

 

అంతేకాక, శూద్ర సమాజం నుండి ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న విద్యావంతులు, అంబేద్కర్ వాదులు శివమూర్తి రచనల పట్ల సానుకూలంగా ఉన్నా కూడ ఆయన రచనల లోతుల్లోకి పోవడానికి అనేక కారణాల రీత్యా సాహసం చేయలేకపోతున్నారు. బామ్సెఫ్ లాంటి సంస్థలు కూడా అందుకు మినహాయింపు కాదు.

 

కొత్త శివమూర్తిగారు ఆయన తన తొలి రచన

"ఇది వేదభూమి కాదు ఇది నాగభూమి" ప్రచురణ సందర్భంగా ఆయన వ్రాసిన ముందుమాటలో చాలా స్పష్టంగా, నిజాయితీగా ఇలా ప్రకటించారు;

 

"నేను చరిత్రకారుడ్ని రచయితను, మేధావిని, మార్క్సిస్టు పండితుడ్ని కాను. నేనొక సామాన్యుడిని. చరిత్రకారులు, మేధావులు వాస్తవికకోణంలో ఇండియా సామాజిక చరిత్రను చెప్పే పని చేపట్టనందున, ఒక సామాన్యుడిగా నేను ఆ పని చేయడానికి సాహసించానే తప్ప, నిజానికి నాకు అంతటి స్థాయిలేదు. కానీ కొత్త కోణంలో ఆలోచించగల అనుభవం, శక్తి ఉన్నాయి.".

 

కొత్త శివమూర్తిగారి మొదటి రచనలు ప్రింటైన తరువాత నేను హైదరాబాదులో యూనివర్సిటీల్లో ఉన్న బుద్ధిజీవులతో, జర్నలిస్టులతో, కవులు, కళాకారులు, రచయితలతో నాకున్న పరిచయాల మేరకు వారిని సమీకరించి కొత్త శివమూర్తిగారి రచనలను వారికి కొత్త శివమూర్తిగారితోనే చేరవేసే సమావేశాలు కొన్ని నిర్వహించగలిగాను. కానీ శివమూర్తిగారు అకాడమీషియన్ కాకపోవడం మూలంగా ఆయన తన ప్రజెంటేషన్ ఆ కొలమానాల్లో చేయలేకపోవడం వలన, ఆయన పరిశోధనా కోణం కూడా నూతన ప్రమాణాలతో కూడి ఉండటంతో ఆ బుద్ధిజీవులెవరిని ఆయన ప్రభావితం చేయలేక పోయారు.

 

కొన్ని ప్రయత్నాల అనంతరం ఆ సమావేశాలు ఆపేసి, బహుజన కులసంఘాల, ప్రజా సంఘాల, వాటి నాయకుల, ఎదుగుతున్న బహుజన విద్యావంతుల సహకారంతో శివమూర్తిగారి రచనలపై రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా తెలంగాణలో అనేక అవగాహనా సదస్సులు నిర్వహించడం జరిగింది. అలా శివమూర్తిగారి రచనలు సమాజంలోకి వెళ్లగలిగాయి. ప్రజలు వాటి పట్ల ఆసక్తి కనబరిచారు. బహుశా ఆ బహుజన విద్యావంతులే ఆయన రచనలపై మరింత పరిశోధనకు భవిష్యత్తులో సిద్ధపడుతారు, సమాజ మార్పుకు ఆయన రచనలను ఆయుధాలుగా మలుస్తారనే ప్రగాఢ విశ్వాసం నాకుంది.

 

ఈ పని వ్యక్తిగత ఐడెంటిటీ, వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాలు, బ్రాహ్మణీయ పాలకవర్గాలతో అంటకాగుతూ తమ వ్యక్తిగత ఎదుగుదలకు ఆధిపత్య వర్ణాలతో అంతర్గతంగా సయోధ్య నెరపే సోకాల్డ్ మేధావులతో, అలాగే సాంప్రదాయక అకాడమిక్ ప్రమాణాలకు దాసోహమై, నూతన ఆవిష్కరణల పట్ల నిరర్థక భయం, అనవసరమైన ఆపోహలతో ఉంటూ ఆ ప్రయత్నాలను నిరుత్సాహ పరిచే సోకాల్డ్ ప్రగతిశీల యాంత్రిక మేధావులతో కూడా ఆ పని సాధ్యం కాదనిపిస్తుంది. ఐతే వర్తమాన సమాజంలో ప్రజల తరపున నూతన కోణంలో ఆలోచించే మేధోజీవుల స్రవంతి ఒకటి ఇప్పటికే ప్రారంభమై శక్తిపుంజుకుంటుంది.

 

కొత్త శివమూర్తిగారి రచనలు ఇప్పటికే చాలామంది బుద్ధిజీవులను ప్రభావితం చేశాయి. ఐతే చాలామంది శివమూర్తిగారి ఆలోచనలను తమ తదుపరి పరిశోధనలకు

ఉపయోగించు కుంటున్నప్పటికి, నిజాయితీగా శివమూర్తిగారి రిఫరెన్స్ ఇవ్వకుండా జాగ్రత్త పడే దగుల్భాజీ వైఖరిని గమనిస్తున్నాను. ఇది నిజాయితీలేని తనమేకాదు, మేధోచోర్యం కూడా అలాంటి అనైతిక వైఖరి సమాజానికి చెడుచేస్తుంది.

 

ఒక వ్యక్తికి ఐడెంటిటీని ఆ వ్యక్తి చేసే చర్యలను బట్టి సమాజం ఇస్తుంది. అంతేకాని ఎవరికి వారు తమ ఐడెంటిటీని తామే తన జీవితకాలంలోనే ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే ప్రయత్నం అత్యంత నీచమైనది. ఫూలే, బాబాసాహెబ్ అంబేధ్కర్, కాన్సీజీలు తమ ఐడెంటిటీ కోసం వారు ఒక్కక్షణం తమ జీవిత కాలాన్ని వృధా చేయలేదు, తమ సమయాన్ని సమాజం కోసమే వెచ్చించారు. అందుకు సమాజం వారిని తనతో సమానంగా ప్రవహింప చేసుకుంటూ వారికి అమరత్వాన్ని ప్రసాధించింది.

 

నిజానికి నాకు పుస్తక సమీక్షలు, వ్యాసాలు రాసిన అనుభవం లేదు. కాకపోతే శివమూర్తిగారితో గత 27 సంవత్సరాలుగా నాకు ఉన్న అనుబంధం రీత్యా ఆయన రచనలపై, ఆయన వ్యక్తిత్వంపై నా అభిప్రాయాలను వెలిబుచ్చే సాహసం చేశాను. ఇందులో చేసిన కొన్ని విమర్శలు నాక్కూడా సమానంగానే వర్తిస్తాయి. సమాజ హితంకై బహుజన మూలవాసి ఆలోచనాపరులు సమాజ విముక్తికోసం అన్నిరకాల ఆలోచనలను సమన్వయంతో, సంయమనంతో సమీక్ష చేద్దాము, నిజాయితీగా సమాజ పురోగమనానికి సంఘటిత మవుదాము. డూప్లికసీ ఆఫ్ వర్క్ను ను పక్కకుపెట్టి మనకున్న పరిమిత వనరులనే సమర్థవంతంగా వినియోగించే మార్గాలు వెతుక్కుందాము. అందులో భాగంగానే శివమూర్తిగారి రచనలను ప్రజల్లోకి తీసుకెళదాం, ఆయన రచనల్లోని పాజిటివ్ అంశాలను సమాజపరం చేయడం ద్వారా ఆయనకు మన నిజమైన నివాళులు అర్పిద్దాము. ఆయన అమరత్వాన్ని అమరం చేద్దాము.

 

- విశాఖ మాధవ క్రిష్ణారెడ్డి,

అడ్వకేట్ (9391016528).

(ప్రజాతంత్ర తెలుగు దినపత్రికలో ఈ వ్యాసం 27-ఆగస్ట్ 2022 లో ప్రచురితం అయింది.  స్థలా భావం వల్ల కొన్ని పేరాలు ఎడిట్ అయ్యాయి.  ఇందులో సమగ్రంగా ఉంది.

 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు