రాష్ట్రాలను బలహీనపరిచేందుకు కేంద్రం కుట్రలు-కెసిఆర్రాష్ట్రాలను ఆర్థికంగా బలహీనపరిచే కుట్రలకు కేంద్రం తెరలేపిందని కేసీఆర్ మండిపడ్డారు. కేంద్ర రాష్ట్రాలు జోడు గుర్రాల మాదిరిగా ప్రగతిరథాన్ని నడిపించాలని రాజ్యాంగవేత్తలు కోరుకున్నారన్నారు. అందుకే సమాఖ్య స్వరూపాన్ని ఏర్పాటు చేశారని చెప్పారు. ఢిల్లీ గద్దె మీద కూర్చొన్న ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం సమాఖ్య విలువలకు తూట్లు పొడుస్తున్నదని కేసీఆర్ ధ్వజమెత్తారు. కూచున్న కొమ్మను నరుక్కున్న చందంగా రాష్ట్రాలను ఆర్థికంగా బలహీనపరిచే కుట్రలకు కేంద్రం పాల్పడుతోందని విమర్శించారు.


దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 వసంతాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో తెలంగాణలో 76 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్‌ గోల్కొండ కోటలో మువ్వన్నెల పతాకాన్ని ఆవిష్కరించారు సీఎం కేసీఆర్. స్వాతంత్ర్య దినోత్సవం 75సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర, దేశ ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈసందర్భంగా ఆయన దేశాన్ని, దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో ఎన్నోత్యాగాలు చేసిన సమరయోధుల పోరాట పటిమను గుర్తు చేసుకున్నారు. వారి త్యాగాలను స్మరించుకున్నారు.
కేంద్రం పన్నుల రూపంలో వసూలు చేసే ఆదాయం మొత్తంలోంచి న్యాయబద్ధంగా 41శాతం వాటా రాష్ట్రాలకు చెల్లించాలన్నారు కేసీఆర్. కేంద్రం ఈ వాటాను కుదించాలనే దురుద్దేశంతో పన్నుల రూపంలో కాకుండా సెస్సుల విధింపు రూపంలో దొడ్డిదారిన ఆదాయం సమకూర్చుకుంటోందన్నారు. దీని ద్వారా రాష్ట్రాలకు 2022-23లో రావాల్సిన ఆదాయంలో 11.4 శాతం గండి కొడుతోందన్నారు. అంటే రాష్ట్రాలకు 41 శాతం వాటా రావాల్సిన చోట 29.6 శాతం మాత్రమే ఇచ్చి అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. ఇది చాలదన్నట్లు రాష్ట్రాల ఆర్ధిక స్వేచ్ఛను దెబ్బతీస్తూ నిరంకుశంగా రకరకాల ఆంక్షలు విధిస్తున్నదని తెలిపారు.


పసిపిల్లలు తాగే పాలు మొదలుకొని, శ్మశానవాటికల నిర్మాణం దాకా ప్రజల అవసరాలన్నిటి మీద కేంద్రం ఎడాపెడా పన్నులు విధిస్తూ పేద, మధ్యతరగతి ప్రజలపై విపరీతమైన భారం మోపుతోందని కేసీఆర్ మండిపడ్డారు. ప్రజా సంక్షేమం ప్రభుత్వాల ప్రధాన బాధ్యత, కేంద్రం ఆ బాధ్యతను సరిగా నిర్వర్తించకపోగా పేదలకు అందించే సంక్షేమ పథకాలకు 'ఉచితాలు' అనే పేరును తగిలించి అవమానించడం గర్హనీయమని కేసీఆర్ వ్యాఖ్యానించారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు