10లక్షల కుటుంబాలకు ఆయుష్మాన్‌ భారత్‌ పథకం

 తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
ఆహార భద్రత కార్డుకు ఆరోగ్య శ్రీ - ఆయుష్మాన్ భారత్ వైద్య సేవలు


కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా అమలు చేస్తున్న  ఆయుష్మాన్ భారత్ పథకం విషయంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. 

ప్రజలకు ఉచితంగా వైద్యం అందించే ప్రక్రియలో భాగంగా  ఆయుష్మాన్‌ భారత్‌ పథకం కింద అందించే ఉచిత చికిత్సలకు ఆహార భద్రత కార్డును కూడా చెల్లుబాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆరోగ్య శ్రీ కి కూడ ఆహార భద్రత కార్డు చెల్లుబాటు అవుతుంది. గతంలో తెల్ల రేషన్‌ కార్డులున్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కార్డులు ఇచ్చింది. అనంతర కాలంలో ప్రభుత్వం రేషన్‌ కోసం తెల్ల కార్డు స్థానంలో ఆహార భద్రత కార్డులు పంపిణీ చేసింది. వీటిని కేవలం రేషన్‌ కోసం మాత్రమే పరిమితం చేశారు. అయితే ఆరోగ్యశ్రీ - ఆయుష్మాన్‌ భారత్‌లో చికిత్సలు పొందాలంటే సంబంధిత కార్డులు, లేదా తెల్ల రేషన్‌ కార్డు అయినా ఉండాలనే నిబంధనలున్నాయి.


గతంలోనే ప్రభుత్వం పంపిణీ చేసిన ఆరోగ్యశ్రీ కార్డులుతో రాష్ట్రవ్యాప్తంగా 77 లక్షల కుటుంబాలు ఉచిత వైద్యసేవలు పొందే అవకాశం దక్కింది. అయితే ఆహార భద్రతా కార్డుదారులకు మాత్రం ఆ అవకాశం లభించడం లేదు. వీరంతా అత్యవసర చికిత్స అవసరమైన సమయంలో ముఖ్యమంత్రి కార్యాలయం చుట్టూ తిరిగి ఆమోదం పొందాల్సి వస్తోంది. దీనిపై ప్రజలను నుంచి తీవ్ర అభ్యంతరాలు వెల్లువెత్తడంతో ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించింది. దీర్ఘకాలంగా కొనసాగుతున్న ఈ సమస్యపై సానుకూలంగా నిర్ణయం తీసుకుంది.


దీనిపై మంత్రి హరీశ్‌రావు స్పందిస్తూ.. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ప్రభుత్వ రెండు విడతలుగా 10లక్షల కుటుంబాలకు ఆహార భద్రత కార్డులను పంపిణీ చేసిందని తెలిపారు. వీరికి ఆరోగ్యశ్రీ సేవలు లభించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న అంశం ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి వచ్చిందని, ఆయన సానుకూలంగా స్పందించి ఆహార భద్రత కార్డుదారులకు కూడా ఈ పథకం వర్తించేలా నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఇకపై ఆరోగ్యశ్రీ అనుబంధ ఆసుపత్రులన్నీ ఆహార భద్రతా కార్డు లబ్ధిదారులను కూడా ఉచిత చికిత్సలకు అనుమతించాల్చిందేనని స్పష్టం చేశారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు