ఇది రాచరిక పోకడల భావ దారిద్య్రం

‘కాకతీయ వైభవ సప్తాహం’ అని పేరు పెట్టారుగానీ, దానికి ‘కమల్‌చంద్ర భంజ్‌దేవ్‌ సంబురం’ అని పేరుపెడితే బాగుండేది.   బీజేపీతో కనీ కనిపించని ‘యుద్ధం’ చేస్తున్న గులాబీరేకులకు, కమల్‌చంద్ర భంజ్‌దేవ్‌లో కాషాయం కనిపించకపోవడం గొప్ప విషయమే. 
కమల్‌చంద్ర భంజ్‌దేవ్‌... మలి కాకతీయుల వారసుడని, ఆయన పూర్వీకులు ఓరుగల్లు కాకతీయులని కొందరు చరిత్రకారులు, ఔత్సాహిక పరిశోధకులు చాన్నాళ్లుగా సూత్రీకరణలు చేస్తున్నారు. పలు ఆధారాలను చూపుతున్నారు. ఈ విషయంలో అనేక భిన్నాభిప్రాయాలూ.. వాదనలూ.. ఉన్నప్పటికీ, ఇప్పటివరకు జరిగిన ‘పరిశోధనలు’ ఆయనను వారసుడిగానే ధృవపరుస్తున్నాయి. ఓకే, నిజంగానే కమల్‌చంద్ర ఒకనాటి కాకతీయుల అవశేషమని ఒప్పుకుందాం. 


భారతదేశంలో రాజ్యాలను, సంస్థానాలను ఏలిన అనేక రాజవంశాల వలెనె, కమల్‌చంద్ర కూడా తమ వంశానికి ఒక ప్రతినిధి.  రాచరికాన్ని ప్రదర్శించే ఆయన వేషధారణ, ఆహార్యం, ప్రవర్తన ఆయన వ్యక్తిగతం. ఆయన నివసించే సౌధం, వారి సంప్రదాయాలు, పండుగలు, వేడుకలు వారికే పరిమితం. గత ప్రాభవం, వారసత్వం, సంపద వల్ల కమల్‌చంద్రకు అనేక ప్రత్యేకతలు, హంగులు, ఆర్భాటాలు ఉండటం సహజం.  పైగా ఇప్పుడాయన ఒక రాజకీయపార్టీకి నేత. బీజేపీలో సభ్యుడు. 


మలి కాకతీయులకు వరంగల్‌తో ఎలాంటి సంబంధం లేదని, ఇక్కడా వారి పాలన ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ సాగలేదని చరిత్రకారులు చెబుతున్నారు.  మలి కాకతీయులుగా 600 ఏళ్లు పాలన సాగించిన దేవ్‌లు, భంజ్‌దేవ్‌లు తమ హయాంలో ఏనాడూ తిరిగి వరంగల్‌తో సంబంధాలు నెరిపే ప్రయత్నాలు చేయలేదు. ఇక్కడ ఒక్కసారి కూడా కాలుమోపలేదు. తమ మూలాలను వెతికే ప్రయత్నాలు చేయలేదు. తమ పూర్వీకుల శిథిల వైభవ ఆనవాళ్లను చూసేందుకూ  ఆస‌క్తి కనబరచలేదు. ఇక్కడి చరిత్ర పరిరక్షణకు ఇసుమంతైనా కృషిచేయలేదు. చరిత్ర పరిశోధకులు, చరిత్ర ప్రేమికులు తమలో సహజంగా ఉండే ఎమోషన్‌తో బస్తర్‌ భంజ్‌దేవ్‌ల వద్దకు పరుగెత్తిన వారే గానీ, భంజ్‌దేవ్‌లు మాత్రం తమ చూపును ఓరుగల్లు వైపు సారించలేకపోయారు. వ‌రంగ‌ల్‌ను వారు ఎప్పుడో  dis own చేసుకున్న‌ట్టు క‌నిపిస్తుంది.


ఇంకా లోతుగా చూస్తే అస‌లు క‌మ‌ల్‌చంద్ర భంజ్ దేవ్‌ను కాక‌తీయుల వార‌సుడిగా గుర్తించ‌డం స‌మంజ‌సం కాదేమోన‌ని పిస్తుంది.  అన్న‌మ‌దేవుడి వార‌సత్వ ప‌రంప‌ర‌లోని రాజు అయిన‌ రాజా రుద్ర ప్ర‌తాప్‌దేవ్‌కు పుత్రులు లేరు. ఆయ‌న‌కు రాణి ప్ర‌ఫుల్ల‌కుమారి మాత్ర‌మే సంతానం. ఆమెను మ‌యూర్‌బంజ్ ప్రాంతానికి చెందిన ప్ర‌ఫుల్ల భంజ్‌దేవ్‌కు ఇచ్చి వివాహం చేస్తారు. వారి వార‌స‌త్వ ప‌రంప‌ర‌లోని మ‌రో వ్య‌క్తే ఇప్ప‌టి క‌మ‌ల్‌చంద్ర భంజ్‌దేవ్‌. ఈ లెక్క‌న చూసుకుంటే క‌మ‌ల్‌చంద్ర...  భంజ్‌దేవ్ ల‌     వంశీయుడే  అవుతాడు. కానీ ఆయ‌న‌ను కాకతీయుల వార‌సుడిగా ఊద‌ర‌గొడుతున్నారు. ఈ మార్పు రుద్ర‌మ‌దేవి-చాళుక్య వీర‌భ‌ద్ర దంప‌తుల‌ కుమారుడైన ప్ర‌తాప‌రుద్రుడి నుంచే మొద‌లైంద‌ని గ‌మ‌నించాలి.


ఇట్లాంటి నేపథ్యంలో మలి కాకతీయుల వారసుడి పేరుతో కమల్‌చంద్ర భంజ్‌దేవ్‌... ఇప్పుడు తెలంగాణ సర్కారుకు రాజలాంఛనాల అతిథి అయిపోయారు. వరంగల్‌లో సకల అధికార యంత్రాంగం  గురువారం (07–07–2022) ఆయన ముందు మోకరిల్లబోతోంది. అధికారికంగా నీరాజనాలు పలకబోతోంది. గుర్రపు బగ్గీతో పాటు దాని ముందు గుర్రాలు, సైనికులను ఏర్పాటుచేసి కమల్‌చంద్రను ఓరుగల్లు కోట పురవీధుల్లో ఊరేగించనున్నారు.   'గులాబీ' నేత‌లు, ప్ర‌జా ప్ర‌తినిధులు ఆయ‌న‌కు జయ‌జ‌య‌ధ్వానాలు  ప‌ల‌క‌నున్నారు.  ఈ కృతక తంతు వరంగల్‌ వాసులకు వింతగా, వినోదంగా కనిపిస్తోంది. 


ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని బస్తర్‌ కేంద్రంగా  దండకారణ్య ప్రాంతాలను కమల్‌చంద్ర పూర్వీకులు దాదాపు 600 ఏళ్లు పరిపాలించారు. ఈ 600 ఏళ్లలో అనేక రాజకుటుంబాల్లో జరిగినట్టుగానే కుట్రలు, కుతంత్రాలు, వెన్నుపోట్లు అంతర్గతంగా చోటుచేసుకున్నాయి. యుద్ధాల్లో జయాపజయాలు ఎదురయ్యాయి. స్వాతంత్ర్యానంతరం వీరి రాజ్యం ఇండియన్‌ యూనియన్‌లో విలీనమైంది.  ఆ తర్వాత ప్రవీర్‌చంద్ర భంజ్‌దేవ్‌ రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించారు. కాంగ్రెస్‌ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆదివాసుల దేవుడుగా పేరుపొందారు. అయితే 1966లో పోలీసు కాల్పుల్లో ఆయన మరణించారు. ఆ తర్వాత చాలాకాలం వరకు ఆయన వారసులు రాజకీయాల్లో లేరు. మళ్లీ కమల్‌చంద్ర భంజ్‌దేవ్‌ రాజకీయాల్లోకి వచ్చారు. బీజేపీ రమణ్ సింగ్ సర్కారులో minister హోదాకు సమానమైన state youth commission chairperson గా కూడా  పని చేశారు.   ఇప్పటికీ బీజేపీ నేతగా కొనసాగుతున్నారు.  చత్తీస్‌గడ్‌లో ఉన్న వందలాదమంది రాజకీయ నేతల్లో ఆయన ఒకరు. 


కమల్‌చంద్ర వ్యక్తిగతంగా హంగూ ఆర్భాటాలు, పటాటోపాలతో వస్తే ఎవరికీ అభ్యంతరం ఉండకపోవచ్చు. కానీ ఆయన ప్రజాస్వామిక సర్కారుకు రాజ లాంఛనాల అతిథిగా వస్తున్నారు. రాచరికాలను కూల్చి ప్రజాస్వామ్య ప్రభుత్వాలు నిలబడి పాలన సాగిస్తున్న తరుణంలో... మళ్లీ పాత వాసనల రాచరికాలకు జై కొట్టే వేడుక‌, దాని కార్యాచ‌ర‌ణ తీరు  జుగుప్స కలిగిస్తున్నది. అలవికాని మోహంతో  వ్యక్తి పూజకు ఎగబడటంలోని ఆంతర్యం అనేక అనుమానాలను కలిగిస్తున్నది. 


స్వయం పాలిత తెలంగాణలో ప్రభువుల అధికారిక నివాసాలే పాలన కేంద్రాలుగా మారి రాచరికాన్ని తలపిస్తున్నాయని తరుచూ ఒక విమర్శ వినిపిస్తుంటుంది. బహుశా ఆ రాచరిక భావ దారిద్య్రంలోంచి పుట్టుకొచ్చిందే ఈ కమల్‌చంద్ర భంజ్‌దేవ్‌ పర్యటన ఘట్టం కాబోలు.  


07–07–2022 నుంచి 13–07–2022 వరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న వేడుకలకు ‘కాకతీయ వైభవ సప్తాహం’ అని పేరు పెట్టారుగానీ, దానికి ‘కమల్‌చంద్ర భంజ్‌దేవ్‌ సంబురం’ అని పేరుపెడితే బాగుండేది.   బీజేపీతో కనీ కనిపించని ‘యుద్ధం’ చేస్తున్న గులాబీరేకులకు, కమల్‌చంద్ర భంజ్‌దేవ్‌లో కాషాయం కనిపించకపోవడం గొప్ప విషయమే. 


Shankar Shenkesi
Senior Journalist 
 Warangal
79898 76088

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు