దేశ అత్యున్నత పీఠం పై తొలి ఆదివాసీ మహిళ ఆసీనులయ్యారు. నూతన రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారం సోమవారం అట్టహాసంగా జరిగింది. ఉదయం 10.15 గంటలకు పార్లమెంట్ సెంట్రల్ హాలులో భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్.వి. రమణ ఆమెతో ప్రమాణం చేయించారు. సంప్రదాయ సంతాలీ చీరలో ఆమె ప్రథమ పౌరురాలిగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ వేడుకలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, పలువురు కేంద్ర మంత్రులు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, ఎంపీలు, దౌత్య కార్యాలయాల అధిపతులు ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అంతకుముందు, ముర్ము రాష్ట్రపతి భవన్ కు వెళ్లారు. అక్కడ ప్రస్తుత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ దంపతులు ఆమెకు పుష్పగుచ్ఛం అందించి సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం రాష్ట్రపతి అంగరక్షక సేన ఆమెకు గౌరవవందనం సమర్పించింది. అక్కడి నుంచి సంప్రదాయబద్ధంగా నిర్వహించే ఊరేగింపుతో ముర్ము పార్లమెంట్ సెంట్రల్ హాలుకు చేరుకున్నారు. ఆమె వెంట రామ్ నాథ్ కోవింద్ కూడా ఉన్నారు. పార్లమెంట్ కు చేరుకోగానే ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సీజేఐ జస్టిస్ ఎన్.వి. రమణ ఆమెకు స్వాగతం పలికారు. అనంతరం సెంట్రల్ హాలులో సీజేఐ రాజ్యాంగంలోని ఆర్టికల్ 60 ప్రకారం ఆమెతో ప్రమాణం చేయించారు. అనంతరం రాష్ట్రపతి హోదాలో ముర్ము ప్రసంగించారు.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box