కొరకాసుతో తలగోక్కున్న రేవంత్ రెడ్డి –ఇమేజి డామేజీ !



               వెలమలు - రెడ్లెప్పుడు అధికారంలో లేరని

మీ జనాభా ఎంత మీ  సీట్లెన్ని ?

 

తెలంగాణ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఏ జోష్ లో ఉండి మాట్లాడాడో కాని రెడ్ల అధికారం గురించి రెడ్లకు పగ్గాలిస్తేనే పార్టీలకు మనుగడ అంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఓ జాతీయ పార్టీకి రాష్ర్ట అద్యక్షుడి హోదాలో ఉండి ఇట్లా మాట్లాడవచ్చా? ఓ పార్టి అధ్యక్షుడే కాదు పార్లమెంట్ సభ్యుడు కూడ. పర్టికులర్ గా ఓ ఆదిపత్య కులం గురించి ప్రస్తావించి మరో అధిపత్య కులం అధికారంలోకి వస్తేనే అందరికి బతుకన్నట్లు  మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ ? అని ప్రశ్నిస్తున్నారు. రాజకీయాలలో నేతలు ఏం మాట్లాడినా చెల్లు బాటు అయ్యే రోజులు, మెప్పు పొందే రోజులు ఇంకా ఉన్నాయా ?

జనం ఊరుకునే రోజులు కావు ఇవి.. సబ్బండ వర్ణాల ప్రజాస్వామ్యంలో రెడ్లకే అధికారం దక్కాలనడం రెడ్లు మాత్రమే పాలకులుగా రాణించగలరని చెప్పడం తీవ్ర అభ్యంతరకరం.  ఆయన వ్యాఖ్యలు జనాభాలో అత్యధిక శాతం ఉన్న బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను ఇతర మైనార్టీలను అవమానించడం. రాహుల్ గాంధి పర్యటన అనంతరం  కాంగ్రేస్ పార్టీ పట్ల తెలంగాణ ప్రజలు కొంత సానుకూల ఆలోచనలు సాగిస్తున్న తరుణంలో రేవంత్ రెడ్డి ఇలా మాట్లాడటం కొరకాసుతో తలగోక్కున్నట్లు అయింది. రేవంత్ రెడ్డి ఫ్యూజులు ఎగిరి పోయేలా సోషల్ మీడియాలో అతని పై విరుచుకుపడ్డారు. కాంగ్రేస్ పార్టి నేత మధుయాష్కి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తు సుదీర్ఘమైన లేఖ రాసాడు. అయితే ఈ విషయంలో రేవంత్ రెడ్డి  పశ్చాత్తాపం చెందడం కాని వివరణ ఇచ్చు కోవడం కాని ఏది చేయలేదు.

గతంలో ఆయన తెలుగుదేశం పార్టీలో ఉండగా ఓటుకు నోటు కేసులో డబ్బుసంచులతో రాయబారానికి వెళ్లిన సందర్బంలో రాష్ర్టంలో వెలమలకు వ్యతిరేకంగా రెడ్లంతా ఒక్కటవుతున్నారని  వ్యాఖ్యానించారు.

నిజంగా రేవంత్ రెడ్డి అన్నట్లు  రాష్ర్టంలో రెడ్లకు వెలమలకు ఏ మాత్రం పొసగదు. ఈ రెండు అధిపత్య కులాలకు మద్య అధికారం కోసం పాత కాలం నుండి పాలిపగలు ఉన్నాయి.  నిజాం కాలం నుండి జమీన్ దారులుగా, జాగీర్దారులుగా వేలాది ఎకరాలకు భూస్వాములుగా తెలంగాణ ప్రాంతంలో వెలమలు, రెడ్లు ఆదిపత్యం చెలాయించారు. వీళ్లకు ప్రత్యేకంగా సంస్థానాలు కూడ ఉండేవి. నిజాం నవాబులకు గంపగుత్తగా పన్నులు చెల్లించి తిరిగి ప్రజల నుండి పన్నులు పీడించి  వసూలు చేసుకుని సంస్థానాలలో తమ దొర తనం వెలగబెట్టారు. మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో ఈ సంస్థానాలు  ఎక్కువగా ఉండేవి. అమరచింత, ఆత్మకూరు, కొల్లాపూర్, గద్వాల సంస్థానాలు మెదక్, కరీంనగర్, వరంగల్ జిల్లాలో కూడ సంస్థానాలు దేశ్ మఖ్ ల ఆధీనంలో ఉండేవి.

ఈ రెండు ఆధిపత్య కులాల పీడనకు వ్యతిరేకంగానే తెలంగాణ లో కమ్యునిస్టుల సాయుద పోరాటం జరిగింది.  పీడిత వర్గాల ప్రజలు కమ్యునిస్టుల నాయకత్వంలో రెడ్లు, వెలమలను గడీల నుండి తరిమేసిన చరిత్ర. వినునూరు దొరలను వీరంగ మాడిన  వీరనారి చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్యల అధ్వర్యంలో దొరల పాలనపై ప్రజలు తిరుగు బాటు చేసారు. తెలంగాణ లో వీరి స్పూర్తితో పీడత ప్రజలు తమ ధిక్కార సంస్కృతిని వారసత్వంగా చేసుకున్నారు. అందుకే సాయుధ పోరాట విరమణ జరిగినప్పటికి ఆతర్వాత వచ్చిన తీవ్రవాద వామపక్ష ఉద్యమాల ద్వారా దొరల పాలనపై అనేక తిరుగుబాట్లు జరిగాయి.

1990 దశకం దాకా చండ్రపుల్లా రెడ్డి, పీపుల్స్ వార్ (మావోయిస్టు) వంటి తీవ్ర వాద వామపక్ష ఉద్యమాలు ఉధృతంగా జరిగాయి. దొరలని పిలిపించుకున్న  వెలమలు, రెడ్లు చాలా వరకు బతుకు జీవుడా అంటూ పట్టణాలకు నగరాలకు వెళ్లి తల దాచుకున్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాలలో  దొరతనం వెలగబెట్టిన జమీన్ దారులను, జాగీర్ దారులందరిని  ప్రజలు చెప్పులు, చీపుర్లతో తరిమి కొట్టారు. ఆధిపత్యం చెలాయించకుండా ప్రజలతో కల్సిపోయిన వారు గ్రామాలలో ఉండి పోయారు.  ప్రజల ఛీత్కారానికి గురైన వారే తిరిగి నగ్జలైట్ల ప్రభావం తగ్గి తుది దశలో ప్రారంభమైన తెలంగాణ ఉద్యమంలో జై తెలంగాణ పేరుతో గ్రామాల బాట పట్టారు.

రెడ్లు, వెలమలందరిది ప్రజలను పీడించిన చరిత్రే నని విశ్లేషించడం సరైంది కాదు. పాలకులకు ఏజెంట్లుగా ప్రజలను వేధించి పీడించి పిప్పి చేసిన దొరల కుటుంబాలకే ఇది వర్తిస్తుంది.

రేవంత్ రెడ్డి అలాంటి దొరల గుర్తు చేసుకుని దొరల రాజ్యం రావాలని  మాట్లాడాడా అని  ఇతర కులాల వారు ప్రశ్నిస్తున్నారు. 

అసలు వెలమలు, రెడ్లు తెలంగాణలో ఉన్నదెంత ? అధికారం ఏ పార్టీ దైనప్పటికి రెడ్లు వెలమలే కదా పాలిస్తున్నదని ప్రశ్నిస్తున్నారు.   

2011 జనభా లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్ర విస్తీర్ణం 1,12,077 చ.కి. కాగా  జనాభా 3,50,03,674 లుగా గణాంకాలు చెబుతున్నాయి. 2021 నాటికి సుమారు 4 కోట్ల 30 లక్షల మేర ఉండచ్చని అంచనా.     

తెలంగాణలో అసలు వెలమ, రెడ్ల జనాభా  చాలా తక్కువ. ఇతర కులాలతో పోలిస్తే మైనార్టి వర్గం. తమ జనాభా 10 నుండి 15 శాతం అని రెడ్లు చెప్పుకుంటున్నారు. ఇది పూర్తిగా వాస్తవం కాదని వాదనలు ఉన్నాయి. వెలమలు నాలగు శాతం మించి ఉండరని ఓ అంచనా.

సమగ్ర కుటుంబ సర్వే లో కులాల వారీగా వెల్లడైన గణాంకాలు చూస్తే బిసీలు 51.08 శాతం, ఓసీలు 21,50 శాతం, ఎస్సీలు 17.50 శాతం, ఎస్టీలు 9,91 శాతం, మైనార్టీలు 14.46 శాతం ఉన్నారని అప్పట్లో  మీడియాలో ఈ గణాంకాల వివరాలు బాగా ప్రచారం  అయ్యాయి. ప్రభుత్వం ఈ గణాంకాలను  ఇప్పటి అధికారికంగా  వెల్లడించ లేదు.

21.50 శాతం ఉన్న ఓసీలలో వెలమలు, రెడ్లు ఎంత మంది ఉండవచ్చు. బ్రాహ్మణ, వైశ్య,క్షత్రియ, కమ్మ, కాపు కులాలు తీసివేస్తే వీరి జనాభా శాతం ఎంతవుతుందంటే ముస్లీం మైనార్టీలకన్నా చాలా తక్కువ.



కాని ఆనాటి ఉమ్మడి రాష్ర్టం లో కాని నేటి తెలంగాణ రాష్ర్టం లో కాని చట్ట సభల్లో ఈ రెండు కులాల వారి ఆదిపత్యం ఎక్కువే. 119 అసెంబ్లి స్థానాలున్న తెలంగాణ లో ప్రస్తుతం రెడ్డి కులానికి చెందిన ఎమ్మెల్యేలు 2014 లో 42 మంది ఉండగా 2018 లో 40 మంది ఉన్నారు. వెలమలు 10 మంది ఉన్నారు. అయితే ఈ 10 మందిలో సిఎం పదవితో పాటు మరో మూడు కీలకమైన మంత్రుల పదవులు వెలమ సామాజిక వర్గానికి చెందిన వారికే ఉన్నాయి.  జనాభాలో 51 శాతం మేర  ఉన్న బిసీలు 22 మంది, ఎస్సీలు 19 మంది ఎస్టీలు 12 మంది ఉన్నారు. అట్లాగే కమ్మలు 5, బ్రాహ్మణులు 2, వైశ్యులు ఒక్కరి చొప్పున ఉన్నారు.

జనాభా నిష్పత్తి మేరకు చూస్తే అధిపత్యంలో సమ తూకం ఉందా ? ఎవరు ఎక్కువ శాతంలో ఉన్నారు. ? వారి జనాభా ఎంత వారి సీట్లెన్ని. ?

ఇవన్ని పక్కన పెట్టి మేమంతా వెనకటి దొరలమని అధికారం  మాకే చెల్లు బాటు అవుతుందని చెప్పి  రెడ్లే ఏలాలని, లేదా వెలమలే ఏలాలని వారికి వారే తీర్మాణించుకుంటే   తెలంగాణ సమాజం తిరగబడుతుంది.

రేవంత్ రెడ్డి తన మనస్సులో ఉన్నది కక్కడం ద్వారా తెలంగాణలో బిసీ, ఎస్సి, ఎస్టి కులాలను అలర్ట్ చేసినట్లు అయింది. ఆయన తొందరపాటు అటు కాంగ్రేస్ పార్టీకి ఇటు రేవంత్ రెడ్డికి రెండు విధాలా నష్టం కలుగ చేశాయి.

కాంగ్రేస్ పార్టీని ఎవరో డామేజి చేయరు ఆ పార్టీ వారే చేతులారా  ఇలా డామెజ్ చేసుకుంటారంటే ఇదే మరి.

కూన మహేందర్

జర్నలిస్ట్

(ప్రజాతంత్ర 1-06-2022 ప్రచురితం)

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు