అందరి చూపుడు వేళ్లు పోలీసుల వైపే


 

పోలీస్ నజర్ తగ్గినా పవర్ తగ్గినా హైదరాబాద్  షహర్ ఆగమే

విశ్వనగరంలో  విచ్చల విడి వినోదానికి అడ్డుకట్టలు పడాలి

కీర్తి ప్రతిష్టలు తుడిచి పెట్టేందుకు ఓ చిన్న అపకీర్తి చాలు. దేశ రాజధాని ఢిల్లీలో సరిగ్గా 10 ఏళ్ల క్రితం జరిగిన నిర్భయ కేసు దేశ ప్రతిష్టను ఎంతగానో దిగజార్చింది. బస్సులో ఎక్కిన ఓ ఫిజియోథెరఫి విద్యార్థిణిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన అందరిని కలిచి వేసింది. ఈ ఘటనతో  దేశ రాజధాని ఢిల్లీ మహిళలకు సురక్షితం కాదనే అభియోగం మూటగట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పటికి ఢిల్లీలో మహిళలపై అచ్యాచార ఘటనలు దేశంలో కెల్లా అత్యధికంగా నమోదవుతున్నాయి. భావోద్వేగాలతో కూడుకున్న ఇలాంటి సంఘటనలు జరిగినపుడు భద్రతా చర్యల  విషయంలో పాలకుల చేతకాని తనాన్ని, వైఫల్యాలను ప్రజలు ఎత్తి చూపడమే కాదు నిల దీసి నిందల పాలు చేయడం కూడ జరుగుతుంది.  నిర్భయ కేసు విషయంలో ఆ నాడు అదే జరిగింది. పాలకులు కూడ చేత కాని వారనే అపవాదు మోయాల్సి వచ్చింది.  సరిగ్గా 10 ఏళ్ల తర్వాత తెలంగాణ రాష్ర్ట రాజధాని  హైదరాబాద్ నగరంలో నిర్భయ ఘటనను తలపించే విదంగా మరో ఘటన చోటు చేసుకుంది.  

ఓ పబ్బుకు వచ్చిన  మైనర్ బాలికను బయటికి తీసుకు వెళ్లి  కారులోనే సామూహికంగా అత్యాచారం జరిపిన ఘటన పై  హైదరాబాద్ నగరం మహిళలకు ఎంత వరకు సురక్షితం అనే ప్రశ్నలు తలెత్తాయి. అచ్యాచార నిందితులు అంతా మైనర్లు కావడమే కాక సంపన్న కుటుంబాలకు చెందిన పాలక పక్షం వారు కావడం వల్ల విమర్శలు, ఆరోపణలు , అనుమానాలు అనేకం.  ఈ సంఘటన అందరిని ఆందోళన పరిచింది. ఈ కేసు విషయంలో పోలీసులు నిందితులను తెరమరుగు చేసే ప్రయత్నాలు చేశారనే ఆరోపణలు ఎదుర్కున్నారు. బిజెపి ఎమ్మెల్యే రఘనందనరావు జోక్యం చేసుకోకుంటే ఈ కేసు సాధారణ అత్యాచారయత్నం కేసుగానే పోలీసు రికార్డుల్లో మిగిలి పోయి అసలు సత్యం సమాధి అయ్యేది. అత్యాచార ఘటనకు తగిన ఆడియో, విజువల్స్ ను  ఎమ్మెల్యే రఘునందన రావు ఎట్లా సేకరించారో ఆయన చేతికి ఎట్లా చిక్కాయో కాని వాటిని బయట పెట్టడంతో  అందరి చూపుడు వేళ్లు పోలీసుల వైపు మళ్లాయి.  నిందితులు అందరూ పాలక వర్గాలకు చెందిన పలుకు బడి కలిగిన కుటుంబాలకు చెందిన వారు కావడం వల్ల పోలీసులు ముందుగా తమ సహజ ధోరణిలో వారిని కాపాడే ప్రయత్నం చేసారని విమర్శలు వచ్చాయి. కాని  ఆడియో విజువల్స్ బయటికి రావడంతో పోలీసులకు నిందితులను కాపాడేందుకు ఏ దారి మిగల లేదు.

  మైక్రో సాఫ్ట్, గూగుల్, ఫేస్ బుక్ వంటి ప్రపంచ శ్రేణి సంస్థలకు కేంద్రంగా మారి విశ్వ నగరం వైపు అడుగులు వేస్తున్న హైదరాబాద్ నగరంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం అందరిని భాదించే అంశమే. కోటికిపైగా జనాభా కలిగిన  నగరంలో జరుగుతున్న నేరాలను కట్డడి చేసేందుకు పోలీసులు చిత్త శుద్దితో చేస్తున్న ప్రయత్నాలను అనుమానించాల్సిన అవసరం లేదు.  కాని ఇలాంటి సంఘటనల విషయంలో పోలీసుల ప్రభు భక్తి, పాక్షిక వైఖరి పలు విమర్శలకు తావిస్తోంది.

క్రైం రేట్ విషయంలో తెలంగాణ రాష్ర్టంతో పాటు  హైదరాబాద్ నగరం దేశంలో ఇతర ప్రాంతాలతో పోలిస్తే చాలాబెట్టర్ గానే ఉంది.  నేరాల రేషియోలో ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం మొదటి స్థానంలో ఉండగా  అత్యదిక క్రైం రేట్ కలిగిన నగరాల్లో దేశ రాజధాని ఢిల్లీ  మొదటి స్థానంలో ఉంది.

దేశంలో నమోదవుతున్న ప్రతి నాలుగు నేరాలలో మహిళలపై ఓ అత్యాచార కేసు నమోదు అవుతున్నదని నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో గణాంకాలు తెలియ చేస్తున్నాయి. రోజుకు ఐదుగురు మహిళల చొప్పున ఈ దేశంలో అత్యాచారాలకు గురవుతున్నారు.

దేశ వ్యాప్తంగా మహిళలపై అత్యాచార ఘటనలు 2019 నుండి 2021 వరకు పరిశీలిస్తే 12 శాతం నుండి నుండి 22 శాతం వరకు పెరిగాయి.

హైదరాబాద్ నగరంలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమీషనరేట్ పరిధిలో  మహిళలపై అత్యాచార ఘటనలు పెరిగినట్లు గణాంకాలు రుజువు చేస్తున్నాయి. హైదరాబాద్ కమీషనరేట్ పరిదిలో  2020 లో 265 అత్యాచార ఘటనలు నమోదు కాగా 2021 లో 328 కేసులు నమోదు అయ్యాయి. సైబరాబాద్ కమీషనరేట్ పరిదిలో 2020 లో 310 కేసులు నమోదు కాగా 2021 లో 356 కేసులు అట్లాగే రాచకొండ కమీషనరేట్ పరిధిలో 2020 లో 329 నమోదు కాగా 2021 లో 377 కేసులు నమోదయ్యాయి. ఇవన్ని గత ఏడాది ముగింపులో స్వయంగ ఆయా  పోలీస్ కమీషనర్లు వెల్లడించిన గణాంకాలు.

దేశంలో ఇతర ప్రాంతాల క్రైం రేట్ తో హైదరాబాద్ ను తూకం వేసుకుని  బెట్టర్ గా ఉన్నామని పోలీసు అధికారులు భావించవచ్చు కాని క్రైం రేట్ ముఖ్యం కానే కాదు.  ఒక్క సంఘటన చాలు మొత్తం  నగర ప్రతిష్టను దిగజార్చేందుకు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రమీజాబీ కేసు తెల్సిన వారికి ఇది అర్దం అవుతుంది. 

డాక్టర్ మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో  1978  మార్చి 31 న రమీజాబీ అనే మహిళను సిటి పోలీస్ స్టేషన్లో పోలీసులు మాన భంగం చేసారన్న ఆరోపణలపై రాష్ట్రం అట్టుడికి పోయింది. నల్లకుంట పోలీస్ స్టేషన్ లో ఆమెను నలుగురు కానిస్టేబుల్స్ రేప్ చేసి భర్తను పోలీసులు కొట్టి చంపారనే వార్తతో రాష్ట్రంతో పాటు దేశంలో కూడ శాంతి భద్రతల సమస్యకు కారణ మైంది. ఇది చివరకు చెన్నారెడ్డి ముఖ్యమంత్రి పదవికే ఎసరు తెచ్చినంత పనిచేసింది. అయితే ఆయన పదవికి గండం రాకుండా మేనేజ్ చేసుకున్నా మాయని మచ్చలా మిగిలి పోయింది. తెలంగాణ ఉద్యమాన్ని నడిపి గడ గడలాడించిన చెన్నారెడ్డి రమీజాబీ కేసు కారణంగా జరిగిన గొడవలతో  గడ గడలాడ్సి వచ్చింది. 

అప్రతిష్ట పాలు అయ్యేందుకు ఓ సంఘటన ఓ క్షణం చాలు.  పబ్  అచ్యాచార ఘటన అలాంటిదే నని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఇలాంటి కేసులు పునరావృతం అయితే హైదరాబాద్ మసక బారుతుంది. ప్రతిష్ట దిగజారుతుంది. పెట్టుబడులను ఆకర్షిస్తున్న నగరం ఇబ్బందుల్లో పడుతుంది. నగరం సురక్షితం కాదని ఎవరూ పెట్టుబడులకు కూడ ముందుకు రారు. పబ్ కేసు విషయంలో అన్ని చూపుడు వేళ్లు పోలీసుల వైపు ఎక్కు పెట్టి ఉన్నాయంటే పోలీసు అధికారులు ఈ కేసును ఎంతగా పక్కదారి పట్టించేందుకు శత విధాలా ప్రయత్నం చేశారో అర్దం చేసుకోవచ్చు.

పారిశ్రామిక రంగంలో దూసుకు పోతున్న  హైదరాబాద్ ఈ రోజు దేశ విదేశాల వారికి కార్యక్షేత్రంగా ప్రముఖ పర్యాటక రంగం విడిది కేంద్రంగా మారుతోంది. ప్రగతికి తగ్గట్టుగా  వినోదం కలిగించే పబ్ కల్చర్ పెరిగి పోయింది. ఆలిసి పోయిన సంపన్నులకు ఇవి అవసరమని భావిస్తున్నారు. మధ్యతరగతి జనం కూడ ఇందులో చేరిపోయారు. నగరంలో విశృంఖల వినోదం కోసం జనం ఎగ బడుతున్నారు. ప్రమాద కరమైన డ్రగ్ కల్చర్ తో పాటు పబ్ కల్చర్, రేవ్ పార్టీలు, డీజేలు ఈ రోజు మహానగరం వినోదంలో భాగంగా మారాయి.

వీటి నియంత్రణలో పోలీసుల వైఫల్యాలు కొట్టొచ్చినట్లు పలు సందర్భాలలో బహిర్గతం అయ్యాయి.

హైదరాబాద్ నగరం పరిసరాల్లో మూడేళ్ల క్రితం జరిగిన దిశ సంఘటన అనంతరం ఇలాంటి నేరాలు పునరావృతం కావద్దని పోలీసులు నిందితులను ఎన్ కౌంటర్ చేసి హీరోలు అనిపించుకున్నారు. నగరం లోని సింగరేణి కాలనీలో స్లమ్ ఏరియాలో ఓ పసిపాపను చిదిమేసిన నిందితుడు రైలు కింద పడి అత్మహత్యకు పాల్పడ్డాడు. నిందితుడి ఆత్మహత్య విషయంలో పోలీసుల పై అనుమానాలు వ్యక్తం అయ్యాయి. దిశ ఎన్ కౌంటర్ భూటకమని సిర్పూర్ కర్ కమీషన్ తప్పు పట్టింది. నేరాలు జరిగినపుడు ఉత్పన్నం అయ్యే ప్రజల భావోద్వేగ పరిస్థితులను ఆసరాగా చేసుకుని పోలీసులు ఇలాంటి చట్ట విరుద్దమైన చర్యలకు పూనుకుంటే రాజ్యాంగ వ్యవస్థలు అపహాస్యం పాలవుతాయనే వాదనలు ఉన్నాయి.

చట్టం పరిధిలో దర్యాప్తు సంస్థలు నేరాన్ని రుజువు చేసి శిక్షలు పడేలా చేసే ప్రధాన కర్తవ్యం విస్మరించి ఈంట్ గా జవాబ్ పత్తర్ సే అంటే భవిష్యత్ లో పరిస్థితులు చాలా ప్రమాదంలో పడతాయనే ఆందోళన పౌరసమాజంలో ఉంది.

 ప్రజల రక్షణ మరిచి పాలకులకు 24 గంటల సేవ చేసి తరిస్తు నేర ప్రపంచాన్ని చట్టం పరిధిలో చక్కబెట్టే తీరిక పోలీసులకు లేకుండా పోయిందని విమర్శలు వచ్చాయి.  ఈ రాష్ట్రం లో హోం మంత్రి మహమూద్ అలి ఓ డమ్మి అన్న విమర్శలు ఉన్నాయి. ఆయన డమ్మి గనుకనే హోం మంత్రి పదవి ఇచ్చారు. పోలీసులు నవ్వుల పాలు కాకూడదంటే నేరాల నియంత్రణకు పటిష్టమైన కార్యాచరణ అవసరం. హైదరాబాద్ సురక్షితం అయ్యేందుకు కీర్తి ప్రతిష్టలు నిలిచేందుకు పాలకుల కన్నా పోలీసుల పైనే గురుతర భాద్యతలు ఎక్కువగా ఉన్నాయి. పాలకులు ఐ దేళ్ళ కోమారుమారవచ్చు. కాని నగరంలో పోలీస్ వ్యవస్థ శాశ్వతం. అందుకే పోలీసుల నజర్ తగ్గినా పవర్ తగ్గినా ప్రపంచ పెట్టుబడుల నగరంగా పేరున్న హైదరాబాద్  ప్రతిష్ట మంట గలుస్తుంది. నగరంపై రేయింపగలూ వేయి కండ్ల నిఘా అవసరం. 

కూన మహేందర్

జర్నలిస్ట్

 (ప్రజాతంత్ర ప్రచురితం 07-06-2022)

 

 

 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు