కాంగ్రేస్ క్యాడర్ లో జోష్ పెంచిన రాహుల్ గాంధి సభ

 

టిఆర్ఎస్ తో పొత్తు పేరెత్తితే  బహిష్కరిస్తామన్న రాహుల్ గాంధి

తెలంగాణ వల్ల కెసిఆర్ కుటుంబం ఒక్కటే బాగుపడింది

 వరంగల్ లో  జరిగిన రైతు సంఘర్షణ సభ కాంగ్రేస్ పార్టీలో జోష్ పెంచింది. రాహుల్ గాంధి పాల్గొన్న సభకు పార్టి కార్యకర్తలు తెలంగాణ వ్యాప్తంగా వివిద జిల్లాల నుండి భారి సంఖ్యలో హాజరయ్యారు. సభ జరిగిన హన్మకొండ ఆర్ట్స్ కళాశాల మైదానం జనంతో కిక్కిరిసి పోయింది. కాంగ్రేస్ నేత రాహుల్ గాంధి తన ప్రసంగంలో కీలక అంశాలను ప్రస్తావించారు. వచ్చే ఎన్నికలలో తెలంగాణ లో  కాంగ్రేస్ పార్టీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోదని టిఆర్ఎస్ పార్టీతో అసలు పొత్తంటూ  ఉండబోదని  స్పష్టం చేశారు. పార్టీలో ఎవరైన నేతలు పొత్తుల గురించి మాట్లాడిదే ఊరుకునేది లేదని పార్టి నుండి బహిష్కరిస్తామని హెచ్చరించారు. తెలంగాణ ప్రజలను కెసిఆర్ మోసం చేసాడని  లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నాడని అలాంటి వారితో పొత్తులు ఉండబోవని అన్నారు. రాష్ట్రంలో టిఆర్ఎస్ తోనే తమ పోరాటం ఉంటుందని అన్నారు. రైతులు, నిరుద్యోగులు, పేదల పక్షాన నిలిచి కాంగ్రేస్ పార్టీ పోరాడుతుందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కాంగ్రేస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని రాహుల్ గాంధి కోరారు. 

బిజెపి, కాంగ్రేస్ పార్టీలు వేరు వేరు కాదని రెండు పార్టీలు ఒక్కటేనని అన్నారు.  టీఆర్ఎస్, బీజేపీ మధ్య రహస్య ఒప్పందం వుందని రాహుల్ ఆరోపించారు.  తెలంగాణ లో అధికారం లోకి రావడం జరగదని బిజెపి ఢిల్లీ నుండి రిమోట్ కంట్రోల్ ద్వారా  టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని నడిపిస్తోందని అన్నారు. రైతులకు వ్యతిరేకంగా బిజెపి తెచ్చిన నల్లచట్టాలకు టిఆర్ఎస్ పార్టి మద్దతు ఇచ్చిన విషయాన్ని రాహుల్ గుర్తు చేశారు.

తెలంగాణ రాష్ట్రం ఏ ఒక్కరి వల్ల సాధ్యం కాలేదని అన్ని వర్గాల ప్రజలు పోరాడి సాధించుకున్నారని అన్నారు. కెసిఆర్ ముఖ్యమంత్రి లెక్క  వ్యవహరించడం లేదని రాజులాగా నియంతలా వ్యవహరిస్తున్నాడని దుయ్యబట్టారు. తెలంగాణ కోసం అనేక మంది త్యాగాలు చేశారని అన్ని వర్గాల వారు పోరాటం చేసారని పేర్కొన్నారు. కాంగ్రేస్ పార్టీకి నష్టం జరుగుతుందని ముందుగా తెల్సినా తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చేందుకు తెలంగాణ ఇచ్చిందని గుర్తు చేసారు. తెలంగాణ ప్రజలను మోసం చేసి కెసిఆర్ ఆయన కుటుంబం మాత్రమే బాగుపడిందని విమర్శించారు.

తన ప్రసంగంలో పార్టి నేతలకు కూడ రాహుల్ గాంధి హితోప దేశం చేశారు.  వచ్చే ఎన్నికల్లో  ప్రజల కోసం పనిచేసిన నేతలకే టికెట్లు ఇస్తామని  అన్నారు. రైతుల కోసం, గిరిజనుల కోసం పేద ప్రజల కోసం పోరాటం చేసిన వారికే టికెట్లు వస్తాయని తేల్చి చెప్పారు.

డిక్లరేషన్ లో అనేక హామీలు

రైతు సంఘర్షణ సభలో పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి పార్టి డిక్లరేషన్ విడుదల చేసారు. కాంగ్రేస్ పార్టి అధికారం లోకి వస్తే  ప్రజలకు శాపంగా మారిన ధరణి పోర్టల్ రద్దు చేస్తామని ప్రకటించారు. రైతులకు పంట పెట్టుబడుల కోసం ఏడాదికి 15 వేలు రైతుల కూలీలకు ఏడాదికి 12 వేల నగదు ప్రోత్సాహకాలు  ఇస్తామని కౌలు రైతులకు కూడ సహాయం అంద చేస్తామని డిక్లరేషన్ లో పేర్కొన్నారు. రైతులకు 2 లక్షల పరిమితి వరకు రుణ మాఫి చేస్తామని డిక్లరేషన్ లో హామి ఇచ్చారు. వరికి క్వింటాళుకు 2500, మక్క జొన్నలకు 2200  మద్దతు ధర ఇచ్చి  ప్రభుత్వమే నేరుగా చివరి గింజ వరకు పూర్తిగా కొనుగోలు చేస్తుందని హామి ఇచ్చారు.

అన్ని రకాల వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధరలు ప్రకటించారు. నూతన వ్యవసాయ విధానం తో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి పండగలా చేస్తామని రైతును రాజుని చేస్తామని డిక్లరేషన్ లో భరోసా ఇచ్చారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు