మహిళా జర్నలిస్టులకు పురస్కారాలు

 తెలుగు జర్నలిజం చరిత్రలో మైలురాయిలా మిగిలిన మహిళా జర్నలిస్టుల సన్మానం 


   

రికార్డ్ స్థాయిలో పురస్కారాలు అందుకున్న 80 మంది మహిళా జర్నలిస్టులు        

         ప్రతీ ఒక్కరూ తాము పని చేసేపనికి లేదా వృత్తిలో గుర్తింపు రావాలని కోరుకుంటారు. ఇది సహజం. అయితే, ఈ గుర్తింపులభించని వృత్తుల్లో జర్నలిజం ఒకటని చెప్పవచ్చు. జర్నలిస్టులకు ప్రజల్లో మంచి గుర్తింపు ఉన్నా సంస్థాపరంగా అంతంతగానే ఉంటుంది. ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ లోని వివిధ వార్తా పత్రికలు, మీడియా చానళ్లు, ఫ్రీలాన్సర్లు, అప్ కంట్రీ పేపర్లు ఛానెళ్లలో పనిచేసే మహిళా జర్నలిస్టులను సన్మానించి వారి సేవలకు గుర్తింపుగా ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకంతో ఒక అభినందన పత్రాన్ని, మెమెంటో, చిన్న గిఫ్ట్ అందించాలని సమాచార, పౌర సంబంధాల శాఖ కమీషనర్ నిర్ణయించారు. 

         దీనితో, నగరంలోని అన్ని పత్రికలు, చానళ్లకు, ఫ్రీలాన్సర్లకు ఫోన్ చేస్తే మొత్తం 85 మంది పేర్లు వచ్చాయి. నేడు, 7 .3 .2022 తేదీన బంజారాహిల్స్ తాజ్ కృష్ణ లో ఈ సన్మాన కార్యక్రమం సమాచార పౌర సంబంధాల శాఖ ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర మంత్రులు కేటీ రామారావు, సబితా ఇంద్రా రెడ్డి, సత్యవతీ రాథోడ్ లు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.  సమాచార శాఖ ఆహ్వానించిన మహిళా జర్నలిస్టులందరూ అనూహ్య రీతిలో ఈ సన్మాన కార్యక్రమానికి హాజరు కావడంతో ఊహించిన దానికన్నా ఎక్కువగానే ఈ కార్యక్రమం విజయ వంతమైంది. కొంతమంది అయితే, తమ కుటుంబ సభ్యులు, మిత్రులు, బంధువులు, పిల్లలతో సహా హాజరయ్యారు. కార్యక్రమం ముగియగానే, మంత్రులతో సెల్ఫీలు దిగడంలో పోటీ పడ్డారు. అసలు, తెలుగు జర్నలిజం రంగంలో ఇంత పెద్ద స్థాయిలో మహిళా జర్నలిస్టులు హాజరైన కార్యక్రమం ఇంతవరకు జరుగలేదని మహిళా జర్నలిస్టులు వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్, ఐటీ శాఖా మంత్రి కేటీ రామారావు స్ఫూర్తిదాయకంగా ప్రసంగించారు. ముఖ్యంగా తన మున్సిపల్ శాఖలో ఉన్న లోపాలను ఎత్తి చూపుతూ వార్తలను రాసే ఒక ప్రముఖ మహిళా జర్నలిస్టును ప్రస్తావిస్తూ సరదాగా చేసిన వాఖ్యలు కూడా పలువురిని ఆకట్టుకున్నాయి. అయితే,  ఈ పురస్కారాలను అందుకున్న ఒకరిద్దరు తమ కూతుర్లతో రాగా, ఆ పిల్లలను మంత్రి కేటీఆర్ ఎత్తుకొని ఆడించడం ఈ కార్యక్రమంలో ప్రత్యేకత.  నిజంగా ఈ కార్యక్రమం ఒక పండగలా జరిగింది. 

             జర్నలిజం రంగంలో తొలిసారి మహిళా జర్నలిస్టులకు ప్రపంచ మహిళా దినోత్సవం సందర్బంగా ప్రత్యేక పురస్కారాలు అందించే గొప్ప కార్యక్రమం ఏర్పాటు చేసి విజయ వంతంగా నిర్వహించడంతో మా సమాచార, పౌర సంబంధాల శాఖ ప్రతిష్ట మరోసారి పెరిగింది. ఈ కార్యక్రమం నిర్మాత అయిన సమాచార శాఖ కమీషనర్, రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ సి.ఎస్. అర్వింద్ కుమార్ దే ఈ క్రెడిట్  అని చెప్పొచ్చు.

        అయితే, ఇంకా కొన్ని మీడియా ఛానెళ్లలో ఒకరిద్దరు మహిళా జర్నలిస్టులు మిగిలారని కొందరు మిత్రులు సమాచారం అందించారు. ఇక్కడ జరిగిన పొరపాటుకు చింతిస్తున్నాం.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు