అధిక విద్యుత్ బిల్లుల పై వినియోగ దారుల అగ్రహం


 అశాస్త్రీయంగా బిల్లులు పెంచారని మండి పాటు

సామాన్యులపై  భరించ లేని విదంగా వేలల్లో బిల్లులు పెంచారని ఆగ్రహం

విద్యుత్ శాఖ బహిరంగ విచారణలో  గరం గరం

విద్యుత్ వినియోగదారులపై ఇష్టాను రీతిలో  అశాస్త్రీయంగా బిల్లులు పెంచడం  సరికాదని మండిపడ్డారు. వేలల్లో బిల్లు వచ్చాయని ప్రజ జలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తున్నదని బహిరంగ విచారణలో పాల్గొన్న వ్యక్తులు ప్రభుత్వంపై, విద్యుత్ శాఖ పై ఆగ్రహంతో  విమరర్శలు చేశారు.

 సోమవారం ఉత్తర తెలంగాణ విద్యుత్ సంస్థల( ఎన్ పిడిసి ఎల్) ఆధ్వర్యంలో ముగ్గురు కమిటీ సభ్యులైన రంగారావు, కృష్ణయ్య, మనోహర్ రాజు ఆధ్వర్యంలో హన్మకొండలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో “విద్యుత్ బిల్లుల పై బహిరంగ విచారణ”  సాగింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ అన్యాయంగా విద్యుత్ అధికారులు సామాన్యులపై ఒక్కో మీటర్ కు వేలాది రూపాయల బిల్లుల భారం మోపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

 మాజీ ఎపి, కాంగ్రెస్ నాయకులు సిరిసిల్ల రాజయ్య మాట్లాడుతూ సామాన్య ప్రజలపై విద్యుత్ అధికారులు, ప్రభుత్వం, డెవలప్మెంట్ చార్జీల పేరుతో విపరీతమైన ఛార్జీలను పెంచడం వల్ల సామాన్యులపై తీవ్రమైన ఆర్థిక భారం పడుతున్నదని, ప్రభుత్వం వెంటనే పెంచిన బిల్లులు తగ్గించాలన్నారు. విద్యుత్ శాఖ అధికారులు ప్రతి నెల ఒకటో తేదీ నుండి పదవ తేదీ వరకు నిర్వహించే బిల్లింగ్ విధానాన్ని 15 నుంచి 20 తారీకు వరకు నిర్వహించకపోవడం వల్ల నెల రోజులు దాటిన తరువాత వచ్చే బిల్లులు తడిసి మోపెడు అవుతున్నాయని, ప్రతి నెల పదవ తేదీ వరకు బిల్లింగ్ విధానం చేపట్టాలని కోరారు.ఏఐకెఎస్ జాతీయ ఉరాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి మాట్లాడుతూ ఇప్పటికే 36 వేల కోట్లు ప్రభుత్వ శాఖల నుంచి రావలసిన బకాయిలుంటే వాటిని వసూలు చేయకుండా ప్రజలపై అక్రమంగా, అశాస్త్రీయంగా బిల్లులు పెంచుతూ పేదవాళ్ల నడ్డి విరుస్తున్నారని అన్నారు. గతంలో 1.45 యూనిట్ కు ఉండగా ప్రస్తుతం 1.95 పైసలు యూనిట్ కు పెంచారని అన్నారు.ప్రభుత్వం, డిస్ట్రిబ్యూషన్, పంపిణీ, వినియోగదారులు మధ్య తీవ్రమైన వ్యత్యాసం ఏర్పడుతున్నదని ఉత్పత్తి, పంపిణీ వ్యవస్థ సరిగ్గా ఉన్నప్పటికీ అధికారులు మాత్రం సామాన్య ప్రజలపై ప్రభావాన్ని చూపే విధంగా చర్యలు చేపడుతున్నారని, పెద్ద పెద్ద వాళ్లకు విద్యుత్ బకాయిలు ఉన్నప్పటికీ వారి మీద చర్యలు లేవని 100, 200 బిల్లు కట్టని వారిపై విద్యుత్ అధికారులు చర్యలు తీసుకుంటారని మల్లారెడ్డి అన్నారు. సామాన్యులు వినియోగించే బిల్లులపై విపరీతంగా ధరలు పెంచుతున్నారని, బడా పారిశ్రామిక వేత్తలు, ఉపయోగించే పరిశ్రమలపై విద్యుత్ శాఖ, ప్రభుత్వం ఉదాసీన వైఖరి ఆ లభిస్తుందని, ఇది మంచి పద్ధతి కాదని ఆయన అన్నారు, ప్రభుత్వం డెవలప్మెంట్ చార్జీల పేరుతో అధికంగా బిల్లులు వసూలు చేస్తున్నదని,ఇప్పటికే 18 వేల కోట్లు ప్రజలపై భారం మోపే ప్రణాళికలు సిద్ధం చేసిందని ఆయన అన్నారు. గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు చాలా అధ్వాన స్థాయిలో ఉన్నాయని, ట్రాన్స్ఫార్మర్ దగ్గరికి పోతే మళ్లీ తిరిగి వచ్చే పరిస్థితి లేదని, ట్రాన్స్ ఫార్మర్ కాలిపోయినా, ఫీజు పోయినా వేసే నాథుడు కరువయ్యాడని అన్నారు. విద్యుత్ శాఖ అధికారులు ముందు ప్రజల అభిప్రాయాలు కూడా తీసుకోవాలని,అశాస్త్రీయంగా, అన్యాయంగా బిల్లులు మోపవద్దని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. గోపాల్ చౌదరి మాట్లాడుతూ పంపిణీ వ్యవస్థ సక్రమంగా లేదని, దీనిని సరి చేయడంలో విద్యుత్ శాఖ అధికారులు తగిన చర్యలు చేపట్టకపోవడం వల్లనే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రభుత్వం పెంచిన విద్యుత్ బిల్లులను తగ్గించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం చుక్కయ్య మాట్లాడుతూ విద్యుత్ శాఖ అధికారులు కరెంటు సరఫరా విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం లేదని, చీటికి మాటికి విద్యుత్ సమస్యలు తలెత్తే పాత వైర్ల స్థానంలో కొత్త లైన్లను ఉంచాలని, లూజుగా ఉన్న లైన్లను సరి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు, వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇస్తున్నామని, ప్రభుత్వం సామాన్య మానవులు వినియోగించే కొద్దిపాటి కరెంటు పైన కూడా సర్ చార్జీల పేరుతో, డెవలప్మెంట్ ఛార్జీల పేరుతో అధికంగా బిల్లులు వేయడం ప్రజలపై భారం పడుతుందని కాబట్టి ప్రభుత్వం బిల్లుల పెంచే విధానాన్ని విరమించుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని, విద్యుత్ శాఖ అధికారులను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన రైతులు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ శాఖ అధికారుల వ్యవహార తీరు చాలా అధ్వానంగా ఉందని, కరెంటు పోయినా ఏదైనా కాలిపోయిన వెంటనే వచ్చి మరమ్మతులు చేయడంలో విద్యుత్ అధికారులు జాప్యం చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం ఉచిత కరెంటు ఇచ్చినప్పటికీ, నాణ్యమైన కరెంటును సరఫరా చేసే విధంగా తగు చర్యలు చేపట్టాలని, ట్రాన్స్ఫార్మర్ కాలిపోయిన సమయంలో వెంటనే కొత్తది బిగించడంలో తీవ్రమైన జాప్యం జరుగుతున్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ కమిటీ సభ్యులు మాట్లాడుతూ బహిరంగ చర్చలో ప్రజల అభిప్రాయాలను నివేదిక రూపంలో ప్రభుత్వానికి విద్యుత్ శాఖ అధికారులకు తెలపడం జరుగుతుందన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు