డ్రగ్స్ నియంత్రణ లో ఎంతటి వారినైనా ఉపేక్షించవద్దు - సిఎం కెసిఆర్

 


డ్రగ్స్ నియంత్రణ విషయంలో ఎంతటివారినైనా ఉపేక్షించవద్దని, ఏ రాజకీయ పార్టీకి చెందిన వారైనా సరే, నేరస్థులను కాపాడేందుకు ప్రజాప్రతినిధుల సిఫారసులను నిర్ద్వందంగా తిరస్కరించాలని  ఆదేశించారు. 

రాష్ట్రంలో గంజాయి తదితర నార్కోటిక్ డ్రగ్స్ వినియోగాన్ని కూకటివేళ్లతో పెకిలించాలనే లక్ష్యంతో ఈ రోజు ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన శుక్రవారం  ‘రాష్ట్ర పోలీసు మరియు ఎక్సైజ్ అధికారుల సదస్సు’ జరిగింది.

దేశవ్యాప్తంగా విస్తృతమవుతున్న గంజాయి తదితర నార్కోటిక్ డ్రగ్స్ వాడకాన్ని తెలంగాణలో  సమూలంగా నిర్మూలించాలని  అన్నారు.   నార్కోటిక్ డ్రగ్స్ వాడకం అనేది ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న దుర్వ్యసనమని, సమాజమనే వేరుకు పట్టిన చీడ పురుగు వంటిదని సీఎం తెలిపారు. ప్రజలను డ్రగ్స్ కు వ్యతిరేకంగా చైతన్యం చేసేందుకు సృజనాత్మక కార్యక్రమాలను రూపొందించాలని సీఎం అన్నారు.

1000 మంది సుశిక్షితులైన పోలీస్ సిబ్బందిని ప్రత్యేకంగా నియమించుకుని  అత్యాధునిక హంగులతో కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ ను ఏర్పాటు చేసుకోవాలని డీజీపీ  మహేందర్ రెడ్డిని సీఎం ఆదేశించారు. 


దేశవ్యాప్తంగా విస్తృతమవుతున్న గంజాయి తదితర నార్కోటిక్ డ్రగ్స్ వాడకాన్ని తెలంగాణలోంచి కూడా సమూలంగా నిర్మూలించడానికి పోలీస్ అధికారులు వినూత్నరీతిలో బాధ్యత కలిగిన మానవులుగా ఆలోచనలు చేయాలని, సామాజిక బాధ్యతతో ప్రతి ఒక్కరి సహకారం తీసుకొని సామాజిక ఉద్యమంగా మలచిననాడే డ్రగ్స్ కంట్రోల్ సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు రాష్ట్ర పోలీసు, ఎక్సైజ్ శాఖ అధికారులకు పిలుపునిచ్చారు. 

తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతలు అద్భుతంగా అమలవుతున్న నేపథ్యంలోనే రాష్ట్రం అనతికాలంలో అత్యద్భుతంగా అభివృద్ధి పథాన దూసుకుపోతున్నదని సీఎం అన్నారు. 

డ్రగ్స్ నియంత్రణ విషయంలో ఎంతటివారినైనా ఉపేక్షించవద్దని, ఈ విషయంలో ఏ పార్టీకి చెందిన వారైనా సరే, నేరస్తులను కాపాడేందుకు ప్రజాప్రతినిధుల సిఫారసులను నిర్ద్వందంగా తిరస్కరించాలని పోలీసు అధికారులకు సీఎం స్పష్టం చేశారు. 

ఈ సదస్సులో రాష్ట్ర మంత్రులు మహమూద్ అలీ,  వి. శ్రీనివాస్ గౌడ్,  వేముల ప్రశాంత్ రెడ్డి, చామకూర మల్లారెడ్డి, ఎంపీలు  బీబీ పాటిల్,   ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిసోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, మాజీ డీజీపీ  అనురాగ్ శర్మ, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్  సి.వి. ఆనంద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, రాచకొండ పోలీస్ కమిషనర్  మహేశ్ భగవత్, సీఎంఓ అధికారులు నర్సింగ రావు,  భూపాల్ రెడ్డి, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ  రవి గుప్తా, ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, కమిషనర్లు, డీసీలు, పోలీస్ శాఖకు చెందిన రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయి, ఎస్పీలు, కమిషనర్లు, డీసీలు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు