కెసిఆర్ ను పి.కె గట్టెక్కించ గలడా ?

 


పికె అంటే  ఎన్నికల వ్యూహకర్తగా బిరుదు స్థిరం చేసుకున్న ప్రశాంత్ కిశోర్  షార్ట్ కట్ నేమ్. ప్రస్తుత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఒకప్పుడు కుడి భుజం. నరేంద్ర మోదీ మూడో సారి  గుజరాత్ ముఖ్యమంత్రిగా అయ్యేందుకు 2012 లో  పికె  వ్యూహం ఫలించింది. ఆ తర్వాత ప్రశాంత్ కిశోర్ పేరు మారు మోగింది. గుజరాత్ కు మూడో సారి ముఖ్యమంత్రి కావడం ఏమిటి ప్రశాంత్ కిశోర్ వ్యూహంతో నరేంద్ర మోది 2014 లో దేశానికి ప్రధాన మంత్రి కాగలిగాడు. అప్పటి నుండి ప్రశాంత్ కిశోర్ కు ఎన్నికల వ్యూహకర్తగా తిరుగు లేకుండా పోయింది. ఆయన ఏ పార్టీతో ఒప్పందం చేసుకున్నా  గెలుపు ఖాయం.  ఆయనకు డబ్బులిస్తే ఏ పార్టీకి అయినా ఏ వ్యక్తికి అయినా వ్యూహకర్తగా పనిచేస్తాడు. సిటిజెన్స్ ఫర్ అకౌంటబుల్ గవర్నెన్స్ (సిఎజి)  పేరిటి ఆయన ఓ సంస్థనే స్థాపించాడు. అందులో అనేక మంది పనిచేస్తారు. దీన్ని 2014 తర్వాత ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ ( (ఐ-పిఎసి) గా మార్చారు. దీన్ని క్లుప్తంగా ఐపాక్ అని పిలుస్తారు. ఎపి సిఎం జగన్ మోహన్ రెడ్డికి 2019 ఎన్నికల్లో వ్యూహకర్తగా పనిచేసి ఆయన విజయానికి తోడ్పడ్డాడు. తాజాగా పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రేస్ పార్టి అధినేత్రి మమతా బెనర్జీ అధికారం నిలబెట్టాడు. ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు అనేకం ప్రశాంత్ కిశోర్ స్ట్రాటజీ కోసం ప్రాకులాడు తుంటాయి. 

తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే ప్రశాంత్ కిశోర్ తాజాగా సిఎం కెసిఆర్ తో పనిచేసేందుకు సిద్దపడినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మద్య కెసిఆర్ ఢిల్లీ వెళ్లినపుడు  పికె తో మంతనాలు జరిపినట్లు  వార్తలు వచ్చాయి. తెలంగాణ తెచ్చిన ఉద్యమ నేతగా  2014 తొలి ఎన్నికల్లో కెసిఆర్ కు జనం బ్రహ్మ రథం పట్టారు. 2018 ఎన్నికల్లో కూడ ఆయన చరిష్మా ఏ మాత్రం తగ్గకుండా రెండోసారి  కూడ అధికారం లోకి రాగలిగారు. కాని ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులు చాలా మారి పోయాయి. కెసిఆర్ ను ప్రజలు కాదుకదా పార్టి నేతలే  నమ్మ లేని పరిస్థితులు వచ్చాయి.   ప్రస్తుతం కెసిఆర్ బయటికి గంభీరంగా కనిపిస్తున్నా 2023 ఎన్నికల్లో ఏం జరుగుతుందో నన్న ఆందోళన వెంటాడు తోంది.  2019 పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి అనూహ్యంగా మూడు ఎంపి సీట్లు గెలుచుకుంది. కేవలం హైదరాబాద్ నగరంలో ఒకే ఒక్క అసెంబ్లి స్థానం గెలుచుకున్న బిజెపీ ప్రసుత్తం మూడు అసెంబ్లి సీట్లకు చేరింది.  తెలంగాణ లో  బిసి సామాజిక వర్గానికి చెందిన బండి సంజయ్ పార్టి అధ్యక్షుడిగా భాద్యతలు చేపట్టినప్పటి నుండి కెసిఆర్ కు చుక్కలు చూపిస్తున్నాడు.  దుబ్బాక ఉప ఎన్నికల విజయ దుంధుభి తర్వాత జిహెచ్ ఎంసి ఎన్నికలు ఆ తర్వాత  ప్రతిష్టాత్మకమైన హుజురాబాద్ ఉప ఎన్నికల వరకు బిజెపి టిఆర్ఎస్ వ్యూహాలను చిత్తు చేసి కెసిఆర్ కు సవాల్ గా నిలిచింది. ఇదే కెసిఆర్ కు ప్రస్తుతం మింగుడు పడటం లేదు. రాష్ట్రంలో కాంగ్రేస్ పార్టీతో అంతగా ప్రమాదం లేక పోయినా బిజెపీతో ముప్పు పొంచి ఉన్నదనే విషయం కెసిఆర్ గ్రహించాడు. తెలంగాణ లో ఆయన మాటలు జనం గతంలో లాగా సమ్మోహితులు అయి వినడం లేదు. కెసిఆర్ ఎన్ని హామీలు, వాగ్దానాలు చేసినా  అవన్ని  నమ్మ శక్యం కాదని జనం కొట్టి పారేసే స్థాయికి వచ్చారు.  బిజేపీలో కి టిఆర్ఎస్ నుండి భారీగా వలసలు ప్రారంభం కానున్నాయని ఇంటలి జెన్సు వర్గాల నివేదికలు సిఎం కెసిఆర్ టేబుల్ కు చేరి పోయాయి. 

ఎట్లా ఆలోచించినా  2023 ఎన్నికలు  టిఆర్ఎస్ కు అంతగా అచ్చి వచ్చేవిగా కనిపించడం లేదు.  కెసిఆర్ స్ట్రాటజీ ఇక వర్కవుట్ అయిత లేదని అర్దం అయి ప్రశాంత్ కిశోర్ తో ఒప్పందం చేసుకున్నాడని విశ్లేషణలు వస్తున్నాయి.  అయితే తెలంగాణ లో పరిస్థితులు టిఆర్ఎస్ కు ఏ మాత్రం అనుకూలంగా లేవని ఈ పరిస్థితుల్లో ప్రశాంత్ కిశోర్ ఎన్నికల స్ట్రాటజి ఎంత వరకు ఫలిస్తుందనే ఆసక్తి కూడ నెల కొంది.  తెలంగాణ లో ఎలాగైనా అధికారంలోకి రావాలని బిజెపి  ఇప్పటికే దీర్ఘకాలిక వ్యూహంతో సాగుతోంది.  సిఎం కెసిఆర్  నిర్లక్ష్యం చేసిన అంశాలనే  బిజెపి తన అస్త్రాలుగా మలుచు కోవాలనే వ్యూహంతో ఉంది.  చరిత్ర ఎప్పుడూ ఒకే విదంగా  ఉండదు. ఎవరి స్ట్రాటజీలు ఎంత ఉన్నా  జనం స్ట్రాటజీ జనానికి ఉంటుంది. జనం డిసైడ్ అయితే  ఏ స్ట్రాటజి కూడ పనిచేయదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు