ఒమైక్రాన్ పై ఆందోళన వద్దు - జాగ్రత్తలు పాటించండి - మంత్రి హరీష్ రావు

 


ఒమైక్రాన్‌ వేరియంట్‌ వల్ల ప్రాణభయం లేదని  అనవసరంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య ఆరోగ్య శాఖ  మంత్రి హరీష్‌రావు అన్నారు. హైదరాబాద్ లో ఒమైక్రాన్ కేసులు వెలుగు చూసిన నేపద్యంలో బుధవారం మంత్రి  మీడియాతో మాట్లాడారు. ఒమైక్రాన్‌ వేరియంట్‌‌తో ప్రజలు అనవసర మైన  ఆందోళనతగ్గించి తగిన ముందు  జాగ్రత్తలు పాటించాలని కోరారు. విదేశాల నుంచి వచ్చినవారి కాంటాక్ట్‌ ట్రేస్‌ చేస్తున్నట్లు తెలిపారు. అలాగే తెలంగాణలో కరోనా పరీక్షలు కూడా పెంచుతున్నట్లు స్పష్టం చేశారు. అందరూ విధిగా వ్యాక్సిన్‌ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో ఫస్ట్‌డోస్‌ వ్యాక్సినేషన్‌ 98 శాతం పూర్తైందని మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో 2 డోసుల వ్యాక్సినేషన్‌ కూడా 64 శాతం పూర్తైనట్లు వివరించారు. బూస్టర్‌ డోస్‌ ఇచ్చేందుకు కేంద్రాన్ని సంప్రదించామని చెప్పారు. ఒమైక్రాన్ కేసుల ముందు జాగ్రత్తలో భాగంగా  21 లక్షల ఐసోలేషన్‌ కిట్లు సిద్ధం చేశామని పేర్కొన్నారు. తెలంగాణలో 25,390 పడకలకు ఆక్సిజన్‌ సౌకర్యం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే అన్ని ఆస్పత్రుల్లో బెడ్స్‌ను ఆక్సిజన్‌ బెడ్స్‌గా మార్చినట్లు వెల్లడించారు. ప్రజలంతా మాస్కులు ధరించాలని భౌతికదూరం పాటించాలని మంత్రి హరీష్‌రావు కోరారు.

నగరంలో రెండు ఒమైక్రాన్ కేసులు

హైదరాబాద్ నగరంలో ఒమైక్రాన్ కేసులు కల కలం రేపాయి. అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. ఒమైక్రాన్ నిర్దారణ అయిన వారిని  ఐసొలేషన్ కు తరలించారు. వీళ్లతో కాంటాక్ట్ లోకి వచ్చిన వాళ్లను ట్రేస్ చేసే పనిలో పడ్డారు.

 కెన్యా నుంచి ఓ మహిళ ఈ నెల 12 న హైదరాబాద్ వచ్చింది. ఆమె శాంపిల్స్ తీసుకొని జెనోమ్ సీక్వెన్సింగ్ కు పంపించగా ఒమిక్రాన్ నిర్థారణ అయింది.  ఆమెను టిమ్స్ కు తరలించి ఐసొలేషన్ లో ఉంచారు. ఇక సోమాలియా నుంచి మరో వ్యక్తి హైదరాబాద్ వచ్చాడు. అతడికి కూడా జెనోమ్ సీక్వెన్సింగ్ లో ఒమిక్రాన్ అని తేలింది.

ఓ ఏడేళ్ల బాలుడు విదేశాల నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు వచ్చినా  అతడు ఎయిర్ పోర్ట్ లోనే ఉండి  అక్కడి నుండే  కోల్ కతా వెళ్లాడని, ఆ బాలుడి నుంచి తీసుకున్న శాంపిల్ లో ఒమిక్రాన్ నిర్దారణ అయిందని తెలిపారు. ఈ వివరాల్ని పశ్చిమ బెంగాల్ అధికారులకు తెలియ చేశామని అతడికి తెలంగాణకు సంబంధం లేదని హెల్త్ డైరక్టర్ శ్రీనివాస రావు  తెలిపారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు