ఓటుకు ఆధార్ లింకు బిల్లుకు ఆమోదం

విపక్షాల తీవ్ర నిరసన మధ్య లోక్ సభలో ఆమోదం


ఓటుకు ఆధార్ లింకి చేసే ఎన్నికల చట్టాల (సవరణ) బిల్లు-2021 కు విపక్షాల తీవ్ర నిరసనల మధ్య లోక్‌సభ సోమవారం ఆమోదించింది. కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరన్ రిజిజు లోక్ సభలో ప్రవేశపెట్టారు. బిల్లుకు వ్యతిరేకంగా విపక్షాలు ఆందోళనలకు దిగడంతో సభ పలుమార్లు వాయిదా పడింది. చివరికి మధ్యాహ్నం తర్వాత గందరగోళం మధ్యనే బిల్లు పాస్ అయినట్లు ప్రకటించారు.బోగస్‌ ఓటింగ్‌ను నిరోధించడానికే ఈ బిల్లును తీసుకొచ్చినట్టు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజీజ్‌ స్పష్టం చేశారు.

ఓటరు కార్డును ఆధార్‌నెంబర్‌కు అనుసంధానం చేసే విధంగా ఈ బిల్లును విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఓటర్‌ ఐడి నెంబర్ కు  ఆధార్‌ నెంబర్‌ లింక్‌ చేయడం వల్ల  వ్యక్తిగత స్వేచ్చకు భంగం కలుగుతుందని , సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్దంగా బిల్లును తీసుకొచ్చారని ప్రతిపక్షాలు విమర్శించాయి. దళితులు , మైనారిటీలను టార్గెట్‌ చేసి ఆ వర్గాల ఓట్లను తీసేసేందుకు కుట్ర జరుగుతోందని మజ్లిస్‌ ఎంపీ అసదుద్దీన్‌ విమర్శించారు.  చట్ట విరుద్ధమైన ఎన్నికల చట్టాల (సవరణ) బిల్లును కేంద్రం వెనక్కి తీసుకోవాలని మరో కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారి డిమాండ్ చేశారు. ఓటర్‌ కార్డుతో ఆధార్‌ నెంబర్‌ లింక్‌ చేస్తే దేశ పౌరసత్వం లేని వాళ్లు కూడా ఓటర్లుగా రిజిస్టర్‌ చేసుకునే ప్రమాదముందని ఆయన  ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ప్రతిపక్ష నేతల విమర్శలపై న్యాయ శాఖ మంత్రి వివరణ ఇచ్చారు.  నకిలీ ఓట్లను తొలగించేందుకు , ఎన్నికల ప్రక్రియ సజావుగా కొనసాగేందుకు మాత్రమే ఈ చట్టాన్ని తీసుకొస్తునట్టు కేంద్ర మంత్రి కిరణ్‌ రిజీజ్‌ స్పష్టం చేశారు. బిల్లుకు సహకరించాల్సిన విపక్షాల అడ్డుకోవడం దురదృష్టకరమని అన్నారు. ఒక వ్యక్తికి ఒకే ఓటు ఉండాలన్న నిబంధన అమలు చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.  లోక్ సభలో ఆమోదం చెందిన బిల్లును రాజ్యసభకు పంపించనున్నారు.  కొత్త ఒటర్ల నమోదు సందర్భంలో ఆధార్ నెంబర్ కోరనున్నారు. అట్లాగే ఇప్పటికే నమోదు అయి ఉన్న ఓటర్లు ఆధార్ అనుసంధానం చేసుకోవచ్చు.  అయితే ఆధార్ లింకు తప్పని సరి అవుతుందా లేక   ఐచ్ఛికంగా ఉంటుందా అనే విషయంపై  క్లారిటి రావాల్సి  ఉంది. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు