మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు టెక్ రవి మృతి

 


మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, డివిజినల్ కమిటీ స్థాయి నాయకుడు రవి అలియాస్ టెక్ రవి అలియాస్ జైలాల్ ప్రమాదవ శాత్తు మృతి చెందాడని ఆ పార్టి ప్రకటన చేసింది. అయితే రవి మృతి చెంది ఏడాది కావస్తుండగా ఆలస్యంగా పార్టి ప్రకటించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. రవి మృతిని ఇంతకాలం ఎందుకు దాచి పెట్టారో పార్టి స్పష్టత ఇవ్వలేదు. నెల్లూరు జిల్లాకు చెందిన రవి మావోయిస్టు పార్టీలో పలు హోదాల్లో  పనిచేశాడు. 2014లో రవి జార్ఖండ్‌ రాష్ట్రానికి  వెళ్లి అక్కడే పార్టి కార్యకలాపాలు నిర్వహించాడు. సాంకేతికంగా  రవి ఆరి ేరిన దిట్ట కావడంతో ఆయన్ను టెక్ రవిగా పిలిచే వారు. మావోయిస్టు  గెరిల్లా ఆర్మీలో కీలక బాధ్యతలు నిర్వహించాడు.

రవి బాణం బాంబు తయారు చేసి ప్రయోగించే క్రమంలో ప్రమాద శాత్తు పేలి చనిపోయినట్లు పార్టి పేర్కొంది.   జార్ఖండ్ లోని కోల్హాన్ అటవీ ప్రాంతంలో గెరిల్లా ఆర్మీ ఎత్తుగడల క్యాంపైన్ లో భాగంగా గత ఏడాది జూన్ 25వ తేదీన బాణం బాంబు పరిశీలించే క్రమంలో ప్రమాదవశాత్తు అది విస్ఫోటనం చెందడంతో తీవ్రంగా గాయపడి రవి మృతిచెందాడని పార్టి ప్రకటించింది. ఆ మరుసటి రోజే విప్లవ లాంఛ‌నాలతో రవి అంత్యక్రియలు నిర్వహించినట్లు మావోయిస్టు పార్టీ కేంద్రం కమిటి నాయకులు విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు. 

మావోయిస్టు పార్టీ ప్రకటన పూర్తి పాఠం....

కామ్రేడ్ రవి (జైలాల్) అమర్ రహే!
కామ్రేడ్ రవి (జైలాల్) ఆశయాలను కొనసాగిద్దాం!

ప్రియమైన ప్రజలారా!
భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) కేంద్రకమిటీ స్టాఫ్ సభ్యుడు (డివిజనల్ కమిటీ స్థాయి) మన ప్రియతమ కామ్రేడ్ రవి (జైలాల్) అమరత్వ వార్తను అనివార్య పరిస్థితులలో దాదాపు సంవత్సరంన్నర కాలం ఆలస్యంగా తెలియజేస్తున్నందుకు తీవ్రంగా చింతిస్తున్నాం. మీ-మా రవి అమరత్వ వార్త మీకు కలిగించే అపార దు:ఖం, వేదన, బాధలో పాలుపంచుకుంటూ, కేంద్రకమిటీ కామ్రేడ్ రవి తల్లితండ్రులు బుచ్చమ్మరమణయ్యలకు, కుటుంబ సభ్యులందరికీ, బంధుమిత్రులందరికి ప్రగాఢ సంతాపాన్నీ, సానుభూతిని తెలియజేస్తున్నది. కామ్రేడ్ రవి స్వస్థలం ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా.

శతృవు కొనసాగిస్తున్న విప్లవ ప్రతీఘాతుక వ్యూహాత్మక దాడి ʹసమాధాన్ʹను ఎదుర్కోవడానికి పార్టీ నాయకత్వంలో పీఎల్ జీఏ నిర్వహిస్తుండిన ఎత్తుగడలపరమైన ఎదురుదాడుల క్యాంపెయిన్లో భాగంగా, ఝార్ఖండ్లోని కొల్హాన్ అటవీ ప్రాంతంలో తను అభివృద్ధి చేసిన బాణం బాంబును పరీక్షించే క్రమంలో జరిగిన ప్రమాదంలో కామ్రేడ్ రవి జూన్ 25, 2020న ఉదయం 11 గం||లకు తీవ్రంగా గాయపడి అమరుడయ్యాడు. ఆకస్మికంగా, అనూహ్యంగా జరిగిన కామ్రేడ్ రవి అమరత్వం(జైలాల్)తో అక్కడి పీఎల్‌జీఏ క్యాంపులోని నాయకత్వం, పీఎల్‌జీఏ కమాండర్లు, యోధులు, ప్రజలు తీవ్ర ధిగ్ర్భాంతికి లోనయ్యారు.

తమ ప్రియతమ సహచరుడు నిపుణుడైన,యోగ్యుడైన టెక్నిషియన్, ఎలక్ట్రానిక్ మరియు కమ్యూనికేషన్ పర్సన్, కంప్యూటర్ ఆపరేటర్, అత్యంత విశ్వసనీయుడైన అమరుడు కామ్రేడ్ రవి (జైలాల్)కి జూన్ 26న చివరి వీడ్కోలు చెప్పి, శ్రద్ధాంజలి అర్పించి, విప్లవ లాంచనాలతో అంతిమ క్రియలు నిర్వహించారు. ʹకామ్రేడ్ రవి (జైలాల్) అమర్ రహే! కామ్రేడ్ రవి ఆశయాలను తుదకంటా కొనసాగిస్తాం! శతృ ʹసమాధాన్ʹ దాడిని ఓడిద్దాంʹ అంటూ నినాదాలిస్తూ శపథం చేసారు.

విప్లవోద్యమం గర్వించే కామ్రేడ్ రవి లాంటి ఉత్తమ పుత్రున్ని కని, విద్యాబుద్ధులతోపాటు, విప్లవ రాజకీయాలను చిన్నప్పటినుండే నేర్పిస్తూ, పెంచి పెద్దచేసి, దేశ విప్లవోద్యమానికి అంకితం చేసిన తల్లిదండ్రులు ధన్యజీవులు.
భారత విప్లవోద్యమానికి తమ ప్రాణాలను ధారపోసిన వేనవేల అమరుల త్యాగాల స్ఫూర్తితో విప్లవోద్యమంలోకి అడుగిడిన కామ్రేడ్ రవి (జైలాల్) పార్టీ ఇచ్చిన వివిధ పనులను బాధ్యాతాయుతంగా నిర్వహిస్తూ వచ్చాడు. ఆ తర్వాత పార్టీ నిర్ణయాన్ని అమలు చేస్తూ, 2014లో గెరిల్లా జోన్లలో బాధ్యతలు నిర్వహించడానికి వెళ్ళిన కామ్రేడ్ రవి (జైలాల్) అప్పటినుండి, తన అమరత్వం దాకా ఝార్ఖండ్ లో ఈఆర్‌బీ స్టాఫ్ గా పని చేసాడు.

వివిధ నైపుణ్యాలు కలిగిన కామ్రేడ్ రవి, కంప్యూటర్ ఆపరేటర్ గా, ఎలక్ట్రానిక్ మరియు కమ్యూనికేషన్ పర్సన్ గానే కాక, ఇంప్రువైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైసెస్ ను అభివృద్ధి చేస్తూ, ప్రజాయుద్ధాన్ని పెంపొందించడంలో పీఎల్ జీఏకు కొత్త ఆయుధాలు అందించే టెక్నిషియన్ గా వివిధ రూపాల్లో విప్లవోద్యమానికి తన సేవలను అందించాడు. ఈ క్రమంలో డివిజనల్ కమిటీ స్థాయికి ఎదిగాడు. నాయకత్వం, క్యాడర్లు, ప్రజలతో సన్నిహితంగా కలిసి, మెలసి ఉంటూ, అందరికి తలలో నాలుకయ్యాడు. కామ్రేడ్ రవి అమరత్వం విప్లవోద్యమానికి ప్రత్యేకించి బీహార్-ఝార్ఖండ్ ఉద్యమానికి వెంటనే పూడ్చుకోలేని తీవ్రమైన లోటు. విప్లవోద్యమం ఆయన సేవలను ఎల్లప్పుడూ స్మరించుకుంటుంది. కామ్రేడ్ రవి అమరత్వపు దు:ఖం నుండి మీరు వీలైనంత త్వరగా కోలుకోవాలని కోరుతూ, కోలుకుంటారని ఆశిస్తున్నది. అది అంత సులువైనది కాదనేది వాస్తవమే అయినప్పటికీ, విప్లవకారుల మరణం మనలో మరింత వర్గకసిని, లక్ష్యం కోసం పోరాడే తెగింపును చివరి శ్వాస వరకు ఉద్యమంలో నిలబడాలన్న దృఢసంకల్పాన్ని ఇనుమడింపజేస్తుంది.

అత్యున్నతమైన కామ్రేడ్ రవి ప్రాణత్యాగం మనకు ఆదర్శం. ఆ ఆదర్శాన్ని ఎత్తిపడుతూ, ఆయన ఆశయాలైన భారత నూతన ప్రజాస్వామిక విప్లవాన్నీ, సోషలిస్టు విప్లవాన్నీ, అంతిమంగా కమ్యూనిజాన్ని సాధించే లక్ష్యంతో తుదకంటా పోరాడదామని మరోసారి ప్రతిజ్ఞ చేస్తున్నది.
విప్లవాభివందనాలతో,
కేంద్రకమిటీ,
భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు)

గడ్చిరోలిలో భారీ ఎన్‌కౌంటర్‌

మహారాష్ట్రలోని గడ్చిరోలిలో భారీ ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. ధనోరా తాలూకా గ్యారబట్టి అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య శనివారం ఎదురు కాల్పులు జరిగాయి. పోలీసుల కాల్పుల్లో 26 మావోయిస్టులు మృతి చెందారు. ఎదురు కాల్పుల్లో ముగ్గురు జవాన్లకు తీవ్ర గాయలయినట్లు గడ్చిరోలి ఎస్పీ అంకిత్‌ గోయల్‌ పేర్కొన్నారు. 

ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన ఆరుగురు మావోయిస్టుల మృత దేహాలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. సంఘటనా ప్రాంతంలో కూంబింగ్ ఇంకా కొనసాగుతోంది. 


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు