సాగు చట్టాల రద్దు - రైతుల చారిత్రక విజయం

 


సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు  ప్రకటించి ప్రధాన మంత్రి నరేంద్ర మోది రైతులను క్షమించ మని కోరాడు. సాగు చట్టాలను వ్యతిరేకిస్తు ఏడాది కాలంగా రైతులు కొనసాగిస్తున్న ఆందోళనకు ఇక తెరపడినట్లే చెప్పవచ్చు. అయితే పార్లమెంట్ లో చట్ట రూపం దాల్చే వరకు ఆందోళన విరమించే ప్రసక్తి లేదని  రైతు సంఘాల నాయకుడు రాకేష్ టికాయత్ ప్రకటించాడు.  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఉదయం 9 గంటలకు జాతిని ఉద్ధేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని తమ ప్రభుత్వం నిర్ణయించినట్లు  ప్రధాని కీలక ప్రకటన చేశారు.

"దేశానికి క్షమాపణలు చెబుతున్నాను, స్వచ్ఛమైన హృదయంతో మేం రైతులను వ్యవసాయ చట్టాలపై ఒప్పించలేకపోయాం. మేం మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించడానికి నేను ఇక్కడ ఉన్నాను... ఈ నెల పార్లమెంటు సమావేశాల్లో రద్దు లాంఛనాలను పూర్తి చేస్తాం" అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.

దేశంలో రైతుల ఆందోళన ప్రపంచ వ్యాప్తంగా  భారత దేశం ప్రతిష్టను బాగా దెబ్బతీసింది. ఎవరి విజయం ఎవరి ఓటమి అనే విశ్లేషణలు ఉండనే ఉంటాయి. రైతుల ఆందోళన రాజకీయంగా భారతీయ జనతా పార్టీకి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్టకు ప్రతిభందకంగా తయారైంది. రైతుల మేలు కోరే సాగు చట్టాలను తీసుకు  వచ్చాయని  కేంద్రం పదే పదే చెప్పిన విషయాలను రైతులు విశ్వసించ లేదు. కార్పోరేట్ వర్గాల ప్రయోజనాల కోసమే సాగు చట్టాలు తెచ్చారని రైతు సంఘాల నేతలు విమర్శలు చేశారు.

రైతులు ఆందోళన చేపట్టి ఏడాది కావస్తోంది. రైతులు తమ ఆందోళన ఇంకా ఉధృతం చేసేందుకు సమాయత్తం అయ్యారు. ఈ నెల 22 న లక్నోలో  మహా పంచాయత్ పేరిట ఆందోళనకు సిద్దపడ్డారు. మరో వైపు వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాలలో ఎన్నికలు జరగనున్నాయి. రైతులు ఆందోళన విరమించే పరిస్థితి కనిపించక పోవడంతో  ప్రధాన మంత్రి నరేంద్ర మోది మెట్టు దిగి సాగు చట్టాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

ఇది ముమ్మాటికి రైతుల విజయమే అవుతుంది. దేశంలో రైతుల ఆందోళన చారిత్రాత్మకం. ఇది చరిత్రలో లిఖించ బడిన వాస్తవం. రైతుల జీవన్మరణ సమస్యతో ముడి పడి ఉన్న వ్యవసాయ రంగంలో పాలకులు ఇష్టాను రీతిలో చట్టాలు తీసుకురాకుండా రైతుల ఆందోళన ఓ హెచ్చరికగా మిగిలి పోతుంది.  

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు