హజురాబాద్ ఫలితాలను బట్టి కెసిఆర్ ముందస్తు ఎన్నికల వ్యూహం ?

బహుశా ఏడాది ముందు ఎన్నికలకు వెళ్లొచ్చని పరిశీలకుల అంచనా
విపక్షాలకు షాక్ ఇచ్చేందుకే కెసిఆర్ ప్లాన్


హుజురా బాద్  ఉప ఎన్నికల ఫలితాలు  రాష్ట్ర రాజకీయలపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. ఈ ఎన్నికలు అధికార టిఆర్ఎస్ కు ఆ పార్టి అధినేత కెసిఆర్ కు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. హుజురాబాద్ లో  గెలుపు, ఓటములు  కెసిఆర్ భవిష్యత్ ను నిర్ణయించ బోతున్నాయి. అందుకే కెసిఆర్ ఏ మాత్రం తగ్గేది లేదన్నట్లు బహుముఖ వ్యూహం ప్రదర్శిస్తున్నారు. ప్రభుత్వ పరంగా దళిత భందు వంటి భారి ఆర్థిక పాకేజీలే కాకుండా అనేక సంక్షేమ పథకాలతో  రాజకీయంగా అన్ని విధాలా వ్యూహాలతో ముందుకు వెళుతున్నారు.

దుబ్బాక ఉప ఎన్నికల్లో ఎదురైన ఓటమిని గుణపాఠంగా తీసుకుని హుజురాబాద్ లో మంత్రివర్గాన్నంత దించి ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎదుటి పక్షం వ్యక్తి మామూలు వ్యక్తి కాదు. టిఆర్ఎస్ లో దాదాపు కెసిఆర్ కు ఇంచు మించు గా ఎదిగి రెండో  శ్రేణి నాయక గణంలో కెసిఆర్ అనంతరం ఈయనే అన్నట్లు బాగా పాపులర్ అయిన వ్యక్తి ఈటల రాజేందర్.

పైగా కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టి  నుండి పోటీలో నిలిచారు. కెసిఆర్ వి ఒంటెద్దు పోకడలంటు ధిక్కరించి మంత్రి పదవి కోల్పోయిన ఈటెల రాజేందర్ కు సర్కార్ నుండి వేధింపులు తప్ప లేదు. దాంతో ఆయన భారతీయ జనతా పార్టీలో చేరారు. 

ఈటలపై పోటీకి నిలిపేందుకు టిఆర్ఎస్ కు మొదట్లో అభ్యర్థి దొరక లేదనే చెప్పాలి. అనేక మంది అభ్యర్థులను ఈటల పై పోటీకి దించేందుకు లెక్కలు వేసి చూసుకుని ఈటల బిసి సామాజిక వర్గానికి చెందిన వాడని అదే సామాజిక వర్గాలకు చెందిన వ్యక్తి అయితే బాగుంటుందని  ఆఖరికి యాదవ కులానికి చెందిన అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను పోటీలో దించారు. 

హుజురాబాద్ నియోజక వర్గంలో గత మూడు నాలుగు నెలల నుండి ఎన్నడు ఎక్కడా లేని హడా వుడి కనిపిస్తోంది మండలానికో మంత్రి ఊరికో ఎమ్మెల్యే వాడకో బుడ్డలీడర్ ఈటల రాజేందర్ ను ఓడించే పనిలో ఉన్నారు. ఆర్థిక మంత్రి అల్లుడు హరీశ్ రావు హుజురాబాద్ ఉప ఎన్నికలకు మామ తరపున అన్ని తానై ఈటలను రాజకీయంగా సమాధి చేయాలనే పగతో పనిచేస్తున్నారు.

ఎట్టి పరిస్థితి లోను హుజురాబాద్ ఉప ఎన్నికల్లో  ఓటమి అనే పదం తన చెవులకు  వినపడకూడదని కెసిఆర్ పదే పదే పార్టి నేతలకు హెచ్చరికలు చేస్తు వచ్చారు. ఖర్చుకు ఎట్లాగు వెనుకాడేది లేదు కనుక హుజురాబాద్ లో  ఓటర్ల పై కరెన్సి వర్షం కురుస్తోంది. ఇక మద్యానికి అయితే కొదువే లేదు..హుజూరాబాద్ కాస్త హుజూర్ బార్ గా మారి పోయింది.

హుజురాబాద్ ఉప ఎన్నికలు ఏ రీతిలో చూసినా కెసిఆర్ కు ఆయన పార్టీకి ఛాలెంజ్ అనే చెప్పవచ్చు. గెలుపు ఓటములతో టిఆర్ఎస్ పార్టి కెసిఆర్ రాజకీయ భవిష్యత్ తో పాటు అయనను నమ్ముకున్న అనేక మంది భవిష్యత్ ముడి పడి ఉంది. 

హుజురాబాద్ ఉప ఎన్నికల అనంతరం వచ్చిన ఫలితాలను బట్టి కెసిఆర్ ముందస్తు ఎన్నికల నిర్ణయం ఉంటుందని అధికార టిఆర్ఎఎస్ పార్టి నేతలే ఓ అంచనాతో ఉన్నారు. 

తెలంగాణ లో టిఆర్ఎస్ పార్టీకి ఇప్పటి వరకు ఎదురు లేదు. హుజురాబాద్ లో ఓడితే టిఆర్ఎస్ పతనం ప్రారంబమైనట్లే భావించవచ్చు.  రాష్ట్రంలో ప్రధానంగా కాంగ్రేస్, బిజెపి పార్టీలు బలం  పుంజుకునే వ్యూహాలతో ముందుకు వెళుతున్నాయి. మాజి ఐపిఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరో వైపు రాష్ట్రంలో పర్యటిస్తు బహుజన కులాలను ఏక తాటిపైకి తేవాలని రాజకీయ సభలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వంపై విపక్ష పార్టీల వ్యతిరేకత పెరిగి పోక ముందే ఇంకా ఆ పార్టీలకు సమయం ఇవ్వకుండా ముందస్తు ఎన్నికలకు ప్లాన్ జరగవచ్చని భావిస్తున్నారు.

 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు