దేశ రాజకీయాల్లో భాజపా హవా - ప్రశాంత్ కిశోర్

 మరికొన్ని దశాబ్దాల పాటు బీజేపీ


‘భారత రాజకీయాలను మరికొన్ని దశాబ్దాల పాటు బీజేపీ ప్రభావితం చేస్తుంది. సరిగ్గా చెప్పాలంటే బీజేపీ కేంద్రంగానే భారత రాజకీయాలు కొనసాగుతాయి. స్వాతంత్ర్యానంతరం నుంచి 40 ఏళ్ల పాటు కాంగ్రెస్ ఎలాంటి స్థానంలో ఉందో బీజేపీ మరికొన్ని దశాబ్దాల పాటు అలాంటి స్థానంలోనే ఉంటుంది. ప్రధానమంత్రి మోదీని ప్రజలు విసిరికొడతారని కొందరు అంటున్నారు. 30 శాతం ఓటు బ్యాంక్ సాధించిన ఏ పార్టీ అయినా ప్రజల నుంచి అంత తొందరగా పోదు. మోదీ ఉంటారా లేదా అనేది పక్కన పెడితే బీజేపీ మాత్రం ఉంటుంది. చాలా దశాబ్దాల పాటే ఉంటుంది. మరికొన్ని దశాబ్దాలు బీజేపీ చుట్టే రాజకీయం నడుస్తుంది’’ అని ప్రశాంత్ కిశోర్ అన్నారు.

కాగా, రాహుల్ గాంధీ ఈ విషయాన్ని గ్రహించడం లేదని, మోదీని ప్రజలు విసిరి కొడతారని రాహుల్ ఇంకా అనుకుంటున్నారని ప్రశాంత్ కిశోర్ అన్నారు. ‘‘రాహుల్ గాంధీకి బహుశా ఇదే సమస్య కావచ్చు. మోదీని ప్రజలు విసిరి కొడతారని ఆయన భ్రమపడుతున్నారు. ఇలాంటిదేమీ జరగదు. క్షేత్ర స్థాయిలో పరిశీలన చేయండి మోదీ ఎంత బలంగా ఉన్నారో అర్థం అవుతుంది. ఇప్పటి పరిస్థితుల్లో ఎవరూ ఆయనకు ఎదురు వెళ్లలేరు కూడా’’ అని ప్రశాంత్ కిశోర్ అన్నారు.

 ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యలపై బీజేపీ నేత అజయ్ సెహ్రావత్ స్పందించారు. బీజేపీ ప్రభావాన్ని ప్రశాంత్ కిశోర్ కూడా అంగీకరించారని, అయితే ఈ విషయాన్ని అమిత్ షా గతంలోనే చెప్పారని ఆయన ట్వీట్ చేశారు. ‘‘మరిన్ని దశాబ్దాల పాటు భారత రాజకీయాల్ని బీజేపీనే ఏలుతుందని ప్రశాంత్ కిశోర్ కూడా అంగీకరించారు. ఇదే నిజం కూడా. ఈ విషయాన్ని అప్పుడెప్పుడో అమిత్ షా డిక్లేర్ చేశారు కూడా’’ అని సెహ్రావత్ అన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు