కేంద్రం తీరుపై సుప్రీం కోర్టు అసహనం


 ట్రైబ్యునళ్లలో ఖాళీలు, నియామకాల వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి పై సుప్రీం కోర్టు తీవ్ర అసహనం  ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయస్థానం తీర్పులు, ఉత్తర్వులను కేంద్రం గౌరవించట్లేదని.. తమ సహనాన్ని పరీక్షిస్తోందని సుప్రీంకోర్టు మండిపడింది. 

ట్రైబ్యునళ్లపై కేంద్రం చేసిన కొత్త చట్టంపై సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్  జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం  ఆగ్రహం వ్యక్తం చేసింది.. సుప్రీంకోర్టు తీర్పులంటే కేంద్రానికి గౌరవం లేదని చీఫ్ జస్టిస్  జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు. కేంద్ర ప్రభుత్వం తమ సహనాన్ని పరీక్షిస్తున్నదని అన్నారు. కేంద్రం చేసిన కొత్త చట్టం గతంలో తాము రద్దు చేసిన చట్టం లాంటిదేనని ఆయన అభిప్రాయపడ్డారు. కొత్తగా మరొకటి చేయాల్సిన అవసరం ఏముందని  ఎన్వీ రమణ ప్రశ్నించారు. 

కోర్టు ముందు మూడు దారులున్నాయని ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. ట్రైబ్యునళ్లను రద్దు చేయమంటారా?.. కేంద్రం తెచ్చిన కొత్త చట్టాన్ని రద్దు చేయాలా?.. కేంద్రంపై కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టాలా? అంటూ ఆయన ప్రశ్నించారు. అలాగే ట్రైబ్యునళ్లలో ఖాళీలను భర్తీ చేయకపోవడంపై ఎన్వీ రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు.  

కేంద్రం తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా .. రెండు నెలల్లోగా ట్రైబ్యునళ్ల నియామకాలు చేపడతామని తెలిపారు. ఈ సమాధానంపై సంతృప్తి చెందని ధర్మాసనం.. ‘‘గత రెండేళ్ల నుంచి ట్రైబ్యునళ్లలో ఖాళీలు ఉన్నాయి.. ఇప్పటి వరకు ఒక్క నియామకం కూడా చేపట్టలేదు.. ఖాళీలను భర్తీ చేపట్టకుండా ట్రైబ్యునళ్లను బలహీనపరుస్తున్నారు.. గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలు, ఉత్తర్వులను కేంద్రం గౌరవించకపోవడం చాలా విచారకరం. మేం కేంద్రంతో ఘర్షణకు దిగాలనుకోవట్లేదు. కానీ మీరు మా సహనాన్ని పరీక్షిస్తున్నారు’’ అని ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది.

ట్రైబ్యునళ్లలో నియామకాల ప్రక్రియకు వారం రోజులు గడువు విధిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. అనంతరం తదుపరి విచారణను సెప్టెంబరు 13కి వాయిదా వేస్తున్నట్లు తెలిపాారు. ఇప్పటికైనా కేంద్రం తమ తీరు మార్చుకుంటుందని ఆశిస్తున్నామని అన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు