వరవర రావును విడుదల చేయండి



వరవర రావును విడుదల చేయండి


స్కాటిష్ పెన్, ఐరిష్ పెన్, పెన్ ఇంటర్నేషనల్, ఇంగ్లిష్ పెన్, పెన్ ఢిల్లీ ల సంయుక్త ప్రకటన

(ఈ బహిరంగ ప్రకటనతో పాటే, ఇవే విషయాలతో ప్రధాని నరేంద్ర మోడీకి కూడా లేఖ రాశారు)

వివిధ దేశాలకు చెందిన పెన్ శాఖలుగా మేము భారత దేశపు సుప్రసిద్ధ కవి వరవరరావు గురించి రచయితల భావప్రకటనా స్వేచ్ఛను పరిరక్షించాలనుకునే వారందరి దృష్టికీ తేదలచాము. ఆయన మీద ఉన్న ఆరోపణలన్నిటినీ రద్దు చేయాలని కోరుతున్నాం. ఆయన విడుదల కోసం జరిగే మా ప్రచార కార్యక్రమంలో మీరు పాల్గొంటారని ఆశిస్తున్నాం.

82 సంవత్సరాల వరవరరావు కవి, సామాజిక కార్యకర్త. ఆయనను హింసకు ప్రేరేపిస్తున్నారనే ఆరోపణతో భారతదేశంలో మరెందరో కార్యకర్తలతో పాటు కలిపి చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద 2018లో నిర్బంధించారు. భీమా కోరేగాం యుద్ధపు 200 సంవత్సర ఉత్సవాల సందర్భంగా 2017 డిసెంబర్ లో జరిగిన ఎల్గార్ పరిషద్ అనే ఒక స్వచ్ఛంద సభకు సంబంధించినవి ఈ ఆరోపణలు. వివాదాస్పదమైన భీమా కోరేగాం కేసు, ఆ పేరు మీద అరెస్టులు, జైలు నిర్బంధాలు మమ్మల్నీ,  ప్రపంచవ్యాప్తంగా ఎందరో మానవహక్కుల సంస్థలనూ దిగ్భ్రాంతికి గురి చేశాయి.  

2018లో అరెస్టు చేసిన నాటి నుంచీ వరవరరావును దారుణమైన పరిస్థితులలో నిర్బంధించారు. ఆయనను నిర్బంధించిన కుఖ్యాతి పొందిన తలోజా సెంట్రల్ జైలు ఆయన వయసును, సున్నితమైన ఆరోగ్యాన్నీ ఎంతమాత్రం పట్టించుకోలేదు. 2020 జూలైలో ఆయనకు కోవిడ్-19 సోకిందని బైటపడి ముంబై లోని జేజే ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆయన ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవడం లేదనీ, మూత్రంతో నిండిన పడక మీద అపస్మారక స్థితిలో ఆయన పడి ఉన్నారనీ ఆయనను చూసిన కుటుంబ సభ్యులు గుర్తించారు.

2021 ఫిబ్రవరి 22 న వరవరరావును మధ్యంతర బెయిల్ మీద విడుదల చేస్తూ, బొంబాయి హైకోర్టు “...విచారణలో ఉన్న ఈ ఖైదీకి వయసు రీత్యా, అనేక ఆరోగ్య సమస్యల రీత్యా, తలోజా సెంట్రల్ జైలులోని ఆస్పత్రిలో అవసరమైన ఆరోగ్య చికిత్స చేయడానికి తగిన సామర్థ్యం లేదు. ఆయనను మళ్లీ తలోజా జైలుకు పంపించడం తప్పనిసరిగా ప్రాణానికి ముప్పు తెస్తుంది” అని రాసింది.

బొంబాయి హైకోర్టు చేసిన ఈ నిర్ణయంతో కొంతవరకు మాకు కలిగిన ఊరట, ఇప్పుడు ఆరునెలల బెయిల్ సమయం ముగిసిపోయి, ఆయన తిరిగి జైలుకు వెళ్లవలసి వస్తుందనే భయాలతో, తొలగిపోతున్నది. మీడియాతో మాట్లాడవద్దనీ, స్వస్థలమైన తెలంగాణకు వందల కిమీ దూరంలోని ముంబై దాటి వెళ్లవద్దనీ, వరవరరావుకు విధించిన బెయిల్ షరతుల పట్ల కూడా మేం విచారం వ్యక్తం చేస్తున్నాం.
వరవరరావు భవిష్యత్తు గురించి తన భయాందోళనను వ్యక్తం చేస్తూ స్కాటిష్ పెన్ ట్రస్టీ, రైటర్స్ ఎట్ రిస్క్ కమిటీ సభ్యులు బాషాబి ఫ్రేజర్ ఇలా అన్నారు:

“వరవరరావును మళ్ళీ జైలుకు పంపిస్తారనే ఆలోచన మమ్మల్ని ఆందోళన పరుస్తున్నది. 84 సంవత్సరాల మానవతావాద సామాజిక కార్యకర్త, నిర్దోషి ఫాదర్ స్టాన్ స్వామిని ఇట్లాగే రాజకీయ ఖైదీగా నిర్బంధించి, 2021 జూలైలో ఆయన జైలులోనే చనిపోయేలా చేసిన ఉదంతం మాకు గుర్తుకొస్తున్నది. ఫాదర్ స్టాన్ స్వామిని కూడా సరిగ్గా గౌరవనీయుడైన 82 సంవత్సరాల కవి, సామాజిక కార్యకర్త వరవరరావు లాగే ఎల్గార్ పరిషత్ కేసులో విచారణ లేకుండా నిర్బంధించారు. వరవరరావు మీద ఆరోపణలన్నీ అబద్ధాలు. ఆయన మీద బనాయించిన ఆరోపణలన్నీ ఉపసంహరించుకోవాలనీ, ఆయనను సగౌరవంగా స్వేచ్ఛాజీవిగా ఉండేలా విడుదల చేయాలనీ మేం డిమాడ్ చేస్తున్నాం.”

మార్క్సిస్టు కవీ, సామాజిక కార్యకర్తా అయిన వరవరరావు తెలుగు సాహిత్యంలో అతి ముఖ్యమైన వ్యక్తుల్లో ఒకరు. ఆయన 1960ల నుంచీ కవిత్వం రాస్తూ 15కు పైగా సంపుటాలు ప్రచురించారు. ఆయన విప్లవ రచయితల సంఘం సంస్థాపకులలో ఒకరు. ఆధునిక తెలుగు సాహిత్యం మీద కేంద్రీకరిస్తూ సృజన అనే సాహిత్య మాసపత్రికను 25 సంవత్సరాలపాటు నడిపారు. కాప్టివ్ ఇమాజినేషన్ అనే ఆయన జైలు డైరీ 2010లో ఇంగ్లిష్ లో వెలువడింది. భారతదేశపు శ్రామికులకు భూమి, పని హక్కులు సాధించడంలో ఆయన విశేష కృషి చేశారు. ఆయన 2018లో అరెస్టయినప్పటి నుంచీ ఆయనను విడుదల చేయాలని వివిధ దేశాల పెన్ శాఖలు విజ్ణ్జప్తి చేస్తున్నాయి. ఆయనకు అంకితం చేసిన ఫ్రీడం రాగా అనే కవితా సంకలనం గత సంవత్సరం విడుదలయింది. ఆయన కవితల ఇంగ్లిష్ సంపుటాన్ని పెంగ్విన్ సంస్థ ఈ సంవత్సరం ప్రచురించనున్నది.

“ఇప్పుడు 82 ఏళ్ల వయసులో ఉన్న వరవరరావు కవిత్వ ప్రతిష్ట అంతర్జాతీయ స్థాయిలో పాఠకులను సంపాదించింది. ఆయన పాటించిన విలువలవల్ల, మానవహక్కుల పరిరక్షణా కృషీవల్ల విస్తృతంగా గౌరవం పొందారు. ఆయన అద్భుతమైన కృషినీ, వయసునూ, క్షీణిస్తున్న ఆరోగ్యాన్నీ దృష్టిలో ఉంచుకుని భారతీయ పాలకులు ఆయన అన్నీ ప్రజాస్వామిక స్వేచ్ఛలనూ పునరుద్ధరిస్తారని ఆశిస్తున్నాం. నిజమైన, క్రియాశీలమైన ప్రజాస్వామ్యపు నిజమైన విలువ అటువంటి మానవీయ వైఖరిలోనే ప్రతిఫలిస్తుంది” అని ఫ్రీడం టు రైట్ కాంపేన్ (ఐర్లాండ్) సహ స్థాపకురాలు, ఐరిష్ పెన్ బోర్డ్ సభ్యురాలు జూన్ కాన్సిడైన్ అన్నారు.

ఈ కింద సంతకం పెట్టిన పెన్ శాఖలకు చెందినవారందరమూ వరవరరావును, ఎల్గార్ పరిషత్ కేసు సహనిందితులను తక్షణమే విడుదల చేయాలని విజ్ణ్జప్తి చేస్తున్నాం. అలాగే శాంతియుతంగా భావప్రకటనాస్వేచ్ఛను వినియోగించుకున్నందుకు నిర్బంధానికి గురైన ఖైదీలందరినీ విడుదల చేయాలని కోరుతున్నాం.

స్కాటిష్ పెన్, ఐరిష్ పెన్, పెన్ ఇంటర్నేషనల్, ఇంగ్లీష్ పెన్, పెన్ ఢిల్లీ.

(పెన్ – పి ఇ ఎన్ ఇంటర్నేషనల్ 1921లో ప్రారంభమై, ప్రస్తుతం వందకు పైగా దేశాలలో శాఖలతో నడుస్తున్న అంతర్జాతీయ సాహిత్యకారుల సంస్థ. లండన్ కేంద్ర కార్యాలయంగా పనిచేస్తుంది)

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు