కెసిఆర్ కుటుంబ పాలనను తరిమేస్తాం - ప్రజా సంగ్రామ యాత్రలో బండి సంజయ్

 


కెసిఆర్ అవినితీ పాలనకు వ్యతిరేకంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర శనివారం ప్రారంభమైంది.  చార్మినార్ వద్ద భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించి అక్కడే యాత్ర ప్రారంభ సభ నిర్వహించారు. 

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ తెలంగాణ ఇన్‌చార్జ్ తరుణ్‌ఛుగ్‌, బీజేపీ నేతలు డీకే అరుణ, విజయశాంతి, అరుణ్‌సింగ్‌, లక్ష్మణ్‌ ఇతర నేతలు సభలో పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంబంపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ప్రజల ఆశయాలు, ఆకాంక్షలకు విరుద్ధంగా మూర్ఖపు పాలన కొనసాగుతోందని ఆరోపించారు.

కుటుంబ, అరాచక, అవినీతి పాలనతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, కష్టాల్లో ఉన్న ప్రజలకు బీజేపీ అండగా ఉందని చెప్పడానికే యాత్రను చేపట్టినట్టు తెలిపారు. ప్రజల సమస్యలన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి వివరిస్తామని, వారు పట్టించుకోకుంటే ఆందోళన చేస్తామని పేర్కొన్నారు. కేంద్రం సంక్షేమ పథకాలను యాత్రలో ప్రజలకు వివరించి, వారి ఆశీర్వాదం కోరుతామన్నారు. తెలంగాణ ప్రజల్లో ఉత్సాహాన్ని నింపేందుకే సంగ్రామ యాత్రను చేపట్టామని తెలిపారు.

దళితున్ని ముఖ్యమంత్రి చేస్తానని కెసిఆర్ మోసం చేశాడని మూడెకరాలు భూములు ఇస్తానంటూ మోసం చేశాడని విమర్శించాడు.  దళితులను దళితబంధు పేరుతో మోసం చేస్తున్నట్లు  బీసీలకు గొర్రెలు, బర్రెలు ఇచ్చి కేసీఆర్ మోసం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలోని 90 శాతం మంది హిందువులను కాపాడే పార్టీ బీజేపీ అని బండి సంజయ్ అన్నారు. రాష్ట్ర ప్రజల్లో భరోసా నింపడానికి, వారికి అండగా ఉండటమే ఈ యాత్ర ప్రధాన లక్ష్యమని ఎంపీ బండి సంజయ్‌‌ అన్నారు.

ఉద్యోగాలు భర్తి చేయకుండా నిరుద్యోగులను మోసం చేశాడని రాష్ట్రంలో  లక్షలాది మంది నిరుద్యోగులు ఉపాధి లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ధ్వజ మెత్తారు. తాలిబన్లకు మద్దతు తెలిపే మతోన్మాదులకు మద్దతు పలుకుతున్న కెసిఆర్ పాలనను  తరిమి తరిమి కొడతామని హెచ్చరించారు.

అమలు కాని హామీలతో ప్రజలను మభ్యపెడుతున్నారని, బంగారు తెలంగాణను మాఫియా తెలంగాణగా మార్చేశారని దుయ్యబట్టారు. బీజేపీ సునామీలో కేసీఆర్ కొట్టుకుపోవడం ఖాయమని కిషన్ రెడ్డి జోస్యం చెప్పారు. తెలంగాణలో ఉద్యోగులకు జీతాలివ్వలేని దుస్థితి నెలకుందని ఆరోపించారు. సెప్టెంబరు 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో రావణ రాజ్యం అంతరించాలని బండి సంజయ్ చేపట్టిన యాత్ర విజయవంతం అవుతుందని బిజెపి అధికారంలోకి వస్తుందని తెలంగాణ ఇన్‌చార్జ్ తరుణ్‌ఛుగ్‌ అన్నారు.

 తొలి రోజు పాదయాత్ర హైదరాబాద్‌లోని అఫ్జల్‌గంజ్‌, నాంపల్లి, లక్డీకాపూల్‌ మీదుగా మెహిదీపట్నం వరకు 10 కిలోమీటర్ల మేర సాగుతుంది. శనివారం రాత్రి మెహిదీపట్నంలోని పుల్లారెడ్డి ఫార్మసీ కాలేజీలో బస చేస్తారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు