కెసిఆర్ కాళ్లు మొక్కిన సిద్దిపేట కలెక్టర్


 ఆదివారం సిద్దిపేట కలెక్టర్ కార్యాలయ నూతన భవణ సముదాయం ప్రారంభోత్సవం సందర్భంగా అందరూ విస్తుపోయే సంఘటన జరిగింది. సాధారణంగా ప్రజా ప్రతినిధులు తమకు గురుతుల్యులకు పెద్దలకు  పాదాభివందనం చేయడం అరుదుగా జరుగుతుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ వినమ్రంగా తనకు నచ్చిన పెద్దలకు, గురువులకు  పాదాభివందనాలు చాలా సార్లు చేశారు.  కాని అధికారులు అదీ ఓ ఐఏఎస్ అధికారి హోదా కలిగిన జిల్లా కలెక్టర్ ప్రజా ప్రతినిధులకు పాదాభివందనం చేయడం ఎక్కడైనా చూశారా ? 

సిద్దపేట లో ఈ విచిత్రం జరిగింది. కార్యాలయ భవణం ప్రారంభం సందర్బంగా జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి ముఖ్యమంత్రి కాళ్లకు వంగి పాదాభివందనం చేసారు. చీఫ్ సెక్రెటరి సోమేశ్ కుమార్ సహా ఇతర అధికారులు, మంత్రులు ఇతర ప్రజా ప్రతినిధులు పురోహితులు చూస్తుండగా ఈ సంఘటన జరిగింది. ముఖ్యమంత్రి సమక్షంలో తన కుర్చీలో కూర్చున్న కలెక్టర్ ఆ తర్వాత లేచి హఠాత్తుగా ఆయనకు పాదాభి వందనం చేశారు. ముఖ్యమంత్రి కూడ ఊహించని ఈ  పరిణామంతో ఆయన ఓ అడుగు వెనక్కి వేసి కలెక్టర్ ను వారించినప్పటికి ఆయన  పాధాభివందనం కానిచ్చేశాడు.

ఆ తర్వాత ముఖ్యమంత్రి, చీఫ్ సెక్రెటరి వేదపండితులు ఇచ్చిన అక్షింతలు వేసి ఆశీర్వదించారు. ఓ జిల్లా కలెక్టర్ ముఖ్యమంత్రి కాళ్లకు దండం పెట్టడం ఏమిటని  అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఈ పోస్టు బాగా వైరల్ అయింది. జిల్లా కలెక్టర్లు తమకు అభిమానం కలిగినా ఆగ్రహం కలిగినా సహజంగా బయట పడరు.  నాలుగు గోడల మద్య ఎక్కడో జరిగితే జరిగి ఉండవచ్చు కాని ఇలా పబ్లిక్ గా జరిగిన సంఘటన కావడం వల్ల చర్చ జరుగుతోంది. సిద్దిపేట జిల్లా కలెక్టర్ ఏమిటి ఇలా చేసాడని అధికారుల పరువు తీసాడని కూడ విమర్శలు వచ్చాయి. 

ఇట్లా ఉంది తెలంగాణ రాష్ట్రంలో జిల్లా కలెక్టర్ల తీరు.

ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో కలెక్టర్‌ ఒక ప్రకటనలో వివరణ ఇచ్చారు. శుభ కార్యక్రమం జరిగినప్పుడల్లా పెద్దల ఆశీస్సులు తీసుకోవడం తెలంగాణ సంప్రదాయమన్నారు. ఫాదర్స్‌ డే కూడా కావడంతో సీఎం కేసీఆర్‌ను తండ్రిలా భావించి ఆశీస్సులు తీసుకున్నట్లు తెలిపారు. తెలంగాణ బిడ్డగా, అధికారిగా అభివృద్ధిని కళ్లారా చూశానని, సీఎం ఆలోచనలను అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కామారెడ్డిలోనూ కలెక్టర్‌ శరత్‌ సీఎంకు పాదాభివందనం చేశారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు