శవాలన్నీ ముక్త కంఠం తో ఒకే మాట చెపుతున్నాయి

 "శవవాహిని గంగ"


ముప్పై ఐదేళ్ల క్రితం " రండి . సామూహికంగా రాముడికి సున్తీ చేద్దాం " అని ఒక తెలుగు కవి కవిత్వం రాశాడు . అప్పుడందరూ దాన్నొక

"Poetic Expression" గానే భావించారు తప్పిస్తే రాజ్య ధిక్కారం గానో మరో రకంగానో భావించి ఆ కవిని ట్రోల్ చేయడమూ , బిహైండ్ ది బార్స్ పెడతామని బెదిరించడమో చేయలేదు . ఒకప్పుడు మహాకవి శ్రీశ్రీ " ఓరోరి వెంగళప్ప " అని ముఖ్యమంత్రిని సైతం తన లిమరిక్కులతో ఎద్దేవా చేసాడు . ఇప్పుడా తెలుగు కవి కానీ , శ్రీ శ్రీ కానీ మళ్ళీ అలాగే రాస్తారా ? అంటే అనుమానమే . అక్షరాన్ని శాసించే వ్యవస్థలు తప్ప అక్షరాన్ని సహించే వ్యవస్థలు బలపడకపోవడమే ఇప్పటి విషాదం

పారుల్ కక్కర్ అనే ఒక గుజరాతీ కవి తన సోషల్ మీడియా ఖాతా లో , కరోనా కారణంగా చనిపోయి గంగా నదిలో కొట్టుకుని వచ్చిన శవాలను చూసి రాసిన "శవ వాహిని గంగ " అన్న చిన్న కవిత దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతున్నది . ఒకప్పుడు భావి గుజరాత్ ఐకాన్ అని ప్రస్తుతించిన వర్గాలే ఇప్పుడు ఆమెను ట్రోల్ చేస్తున్నాయి . ఆమెకు తక్కువలో తక్కువ ఇరవైనిమిది వేల బెదిరింపు కాల్స్ వచ్చాయట. . గుజరాత్ లేఖక్ మండలి ఆమెకు సపోర్ట్ గా నిలవగా దేశవ్యాప్తం గా ఆమెకు మద్దతు వెల్లువెత్తుతోంది . ఆ చిన్న కవిత ఇప్పటికే ఆరు భాషలలోకి అనువాదం అయింది . ఆ కవిత తెలుగు అనువాదం ఇది

శవ వాహిని
గుజరాతీ మూలం : పారుల్ కక్కర్
ఆంగ్లానువాదం : సలీల్ త్రిపాఠీ

శవాలన్నీ ముక్త కంఠం తో ఒకే మాట చెపుతున్నాయి
దిగులు పడవద్దు . దిలాసాగా వుండండి
ఓ రాజా ! నీ రామ రాజ్యం లో శవాలు గంగా నదిలో ప్రవహిస్తున్నాయి

చెట్లన్నీ బూడిద కుప్పలయ్యాయి , స్మశానములో చోటు లేదు
సంరక్షకులు లేరు , శవ వాహకులు లేరు
దుఃఖించడానికి మనిషే లేడు
మాట పెగలని మృత్యు భయం లో మాదొక వ్యర్ధ ప్రేలాపన

ప్రతి ఒక్క ఇంటిలోకి లిబిటినా ప్రవేశించి
అశ్వ వేగం తో మృత్యు భీకర నృత్యం చేస్తున్నది
ఓ రాజా ! నీ రామ రాజ్యం లో శవాలు గంగా నదిలో ప్రవహిస్తున్నాయి

కరుగుతున్న దహన యంత్రపు పొగ గొట్టం కంపిస్తున్నది
వైరస్ మమ్మల్నందరినీ వణికిస్తున్నది
గాజులన్నీ పగిలి గుండెలు ముక్కలు ముక్కలు గా విరిగిపోతున్నవి

నగరం తగలబడిపోతున్నప్పుడు అతడి ఫిడేల్ వాదన
రక్త దాహం తీర్చుకుంటున్న బిల్లా రంగా
ఓ రాజా ! నీ రామ రాజ్యం లో శవాలు గంగా నదిలో ప్రవహిస్తున్నాయి

మీరు అమిత కాంతి తో ప్రకాశిస్తున్నప్పుడు , వెలిగిపోతున్నప్పుడు
భయం గొలిపే మీ వేషధారణ నిప్పురవ్వలు వెదజల్లుతున్నది
ఓ రాజా ఎట్టకేలకు ఈ నగరం మీ నిజరూప దర్శనం చేసుకున్నది

ఆ దిగంబర రాజు బలహీనుడయ్యాడు , కుంటివాడయ్యాడు
రండి బయటికి వచ్చి గట్టిగా అరచి చెప్పండి
ధైర్యాన్ని చూపండి . కానీ , అయితే లు వద్దు
మీరింకా ఎంత మాత్రమూ సౌమ్యులని చెప్పవద్దు
అగ్ని కీలలు ఆకాశాన్నంటుతూన్నాయి . కోపోద్రిక్త నగరం
ఎలుగెత్తి చెపుతోంది
ఓ రాజా ! నీ రామ రాజ్యం లో శవాలు గంగా నదిలో ప్రవహిస్తున్నాయి

లిబి టినా. రోమన్ పురాణాలలో మృత్యు దేవత పేరు

ఇదీ ఆ కవిత.
సేకరణ
ప్రొఫెసర్ వినాయక రెడ్డి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు