పరిస్థితులు అదుపులో ఉన్నాయన్న సిఎస్

 తెలంగాణ లో లాక్ డౌన్ లేనట్లే 


లాక్ డౌన్ విధించే పరిస్థితులపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ స్పష్టత నిచ్చారు. లాక్ డౌన్ లేనట్లే నని  అన్యాప దేశంగా చెప్పుకొచ్చారు. బుధవారం బీఆర్కే భ‌వ‌న్‌లో సోమేశ్ కుమార్ మీడియాతో మాట్లాడారు.  రాష్ట్రంలో పరిస్థితులు పూర్తిగా అదుపులో ఉన్నాయన్నారు. క‌రోనాపై సీఎం కేసీఆర్ ఎప్పటిక‌ప్పుడు స‌మీక్షిస్తున్నారని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య తెలంగాణ‌లో త‌క్కువ‌గా ఉందన్నారు. ఆసుపత్రుల్లో మందులు, ఆక్సిజన్ అందుబాటులో ఉన్నాయని బెడ్ల కొరతలేదని  62 వేల ఆక్సిజ‌న్ బెడ్లు ఉన్నాయని ఇంకా సమ కూరుస్తామని చెప్పారు.  


హైదరాబాద్ మెడికల్ ట్రీట్ మెంట్ కు కేంద్రంగా మారిందని ప్రజలు ఎవరూ కరోనాకు భయపడాల్సిన అవసరం లేదన్నారు.  రాష్ర్టంలో కరోనా పేషంట్లకు మెరుగన వైద్యం అందిస్తున్నామని అందుకే ఇతర రాష్ట్రాల నుండి పేషెంట్లు ఎక్కువగా ఇక్కడికి వస్తున్నారని  అన్నారు. అవసరాలకు అనుగుణంగా ఆసుపత్రుల్లో సౌకర్యాలు మెరుగు పరుస్తామని తెలిపారు.  వైద్య ఆరోగ్య శాఖ వైద్యులు,  సిబ్బంది కరోనాను నియంత్రించేందుకు బాగా కష్ట పడుతున్నారని చెప్పారు. 

రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేకుండా సకాలంలో ఎయిర్ లిఫ్ట్ చేయడం వల్ల మూడు రోజుల సమయం ఆదా అయిందని అన్నారు. తెలంగాణలో 120 టన్నుల ఆక్సిజన్ రోజూ అవసరమవుతుందని, తాము మాత్రం 400 టన్నుల ఆక్సిజన్‌ను అందుబాటులో ఉంచామని తెలిపారు. 

తెలంగాణకు అవసరం ఉన్న రెమిడిసివర్ ఇంజక్షన్లు పంపాలని కేంద్రాన్ని కోరామని తెలిపారు. రాష్ట్రంలో 11 లక్షల కోవిడ్ కిట్లు అందుబాటులో ఉన్నాయని, ప్రతి జిల్లాలో ఆర్టీపీసీఆర్ టెస్టులు కూడా అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు. ఇప్పటి వరకూ 42 లక్షలకు పైగా వ్యాక్సిన్‌ను అందించామని, 45 ఏళ్ల వయస్సు పైబడిన వారికి వ్యాక్సిన్ అందుబాటులోనే ఉందని చెప్పారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు