మంత్రి ఈటెలను తప్పించేందుకు స్కెచ్ వేసిందెవరు ?

 ఓ వైపు కరోనా ఉధృతి గందర గోళంగా మారిన నేపద్యంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ను మంత్రి వర్గం నుండి తప్పించే కుట్ర జరుగుతోందా ? 
ముఖ్యమంత్రి కెసిఆరే స్వయంగా ఈటెలను బయటికి పంపేందుకు స్కెచ్ వేశారా ?
తెలంగాణ లో ఏం జరుగ బోతోంది ?


మంత్రి వర్గంలో సీనియర్ తెలంగాణ ఉద్యమంలో ఆది నుండి కెసిఆర్ తర్వాత ద్వీతీయ శ్రేణి నాయకత్వ స్థానంలో కొనసాగుతూ వచ్చిన ఈటెల రాజేందర్ పై భూ కబ్జా ఆరోపణలు కల కలం రేపాయి. విచిత్రంగా ఈ ఆరోపణలు తొలుత కెసిఆర్ దినపత్రిక నమస్తే తెలంగాణ పత్రికతో పాటు టిన్యూస్ ఛానెల్లో రావడం అందరిని ఆశ్చర్య పరిచింది.

మెదక్ జిల్లా మాసాయిపేట మండ‌లం అచంపేట్‌, హ‌కీంపేట్ గ్రామాల్లో  ఇప్పటికే 100 ఎకరాలు కబ్జా చేసి తన కుటుంబ సబ్యుల పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేయించిన మంత్రి మరి కొందరు రైతుల అసైన్డ్ భూములు కబ్జా చేయాలని చూస్తున్నారనేది ఆరోపణ. సిఎం కెసిఆర్ విచారణకు ఆదేశించినట్లు వార్తలు.

ఈ ఆరోపణలపై మంత్రి ఈటెల శుక్రవారం రాత్రి హైదరాబాద్ లో తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి  నిజా నిజాలు తేల్చేందుకు ఏ విచారణ కైనా సిద్దమని అన్నారు. హై కోర్టు సిట్టింగ్ జడ్జితో కాని మరేదైన దర్యాప్తు సంస్థతో కాని విచారణ జరిపించాలని అన్నారు. తాను ఎలాంటి బూ కబ్ఝాలకు పాల్పడ లేదని అన్నారు. భూకభ్జాకు పాల్పడినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం పుచ్చుకుంటానని అన్నారు. 

తన కుమారుడు చేపట్టిన పౌల్డ్రి పరిశ్రమ కోసం బ్యాంకు ద్వారా 100 కోట్ల రుణం తీసుకున్నామని 1986 నుండి పౌల్డ్రి పరిశ్రమలో ఉన్న అనుభవంతో ఈ వ్యాపారం చేస్తున్నామని తెలిపారు. తానెప్పుడు ఎక్కడా అక్రమాస్తులు సంపాదించలేదన్నారు. ఉన్న ఆస్తుల్లో కొన్ని తెలంగాణ ఉద్యమం కోసం అమ్మానని అన్నారు. రైతులకు సంభందించిన అసైన్జ్ భూముల్లో పంటలు సాగు చేయడం లేదని అవి తొండలు గుడ్లు పెట్టని భూములని భూసేకరణ ద్వారా భూములు సేకరించి ఇవ్వాలని ఈ విషయాన్ని సిఎంవో కార్యాలయం అధికారి నర్సింగరావును కోరానని ఈ విషయం ముఖ్యమంత్రి కెసిఆర్ కు కూడ చెప్పానని తెలిపారు. భూసేకరణ ప్రక్రియ ద్వారా సేకరించడం కాలయాపనతో కూడుకున్నదని నేరుగా రైతులను సంప్రదించి భూములు సేకరిస్తే మంచిదని అధికారులు  సూచన చేశారని అన్నారు. రైతులు తమకు పనికి రాని భూములు ఏం చేసుకోలేక పోతున్నామని  అమ్మి పిల్లల పెండ్లిళ్లు చేసుకుంటామని చెప్పారని మంత్రి తెలిపారు.  ప్రభుత్వానికి రైతులు తమ భూములు సరెండర్ చేశారని అన్నారు. రైతుల భూముల్లో ఏ షెడ్లు  లేవని ఉంటే కూల గొట్టవచ్చని అన్నారు.

మంత్రి ఈటెల రాజేందర్ పై వచ్చిన ఆరోపణల వెనక చాలా పెద్ద తతంగమే నడిచినట్లు చర్చ జరుగుతోంది. చాలా రోజులుగా ముఖ్యమంత్రి కెసిఆర్ కు మంత్రి ఈటెలకు పొసగటం లేదు. మంత్రి వర్గం నుండి బయటికి పంపిస్తారని అనేక సార్లు వార్తలు వచ్చాయి. మంత్రి ఈటెల రాజేందర్ కూడ చాలా సార్లు పలు వేదికలపై తన ఆవేదనను వెల్లగక్కారు. 

మంత్రి ఈటెల ను బలిపశువును చేసేందుకు టార్గెట్ చేశారని అందుకే అసైన్డ్ భూముల వ్యవహారంలో ఇరికించే కుట్ర చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్ ఆరోపించారు.

రాష్ట్రంలో మంత్రి వర్గం మార్పులు చేర్పులు ఉండబోతున్నాయని వార్తలు వచ్చిన నేపద్యంలో ఈటెలను తప్పించేందుకు ఈ ఆరోపణలు ముందుకు తీసుకువచ్చి ఉండవచ్చని చర్చ జరుగుతోంది. ఆరోపణల విషయానికి వస్తే రాష్ట్రంలో మంత్రులు మల్లారెడ్డితో పాటు గంగుల కమలాకర్ లపై కూడ ఆరోపణలు వచ్చాయి. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుపై కూడ గతంలో రైతులు ఆరోపణలు చేసిన సందర్భాలున్నాయి. ఈటెల పై వచ్చిన ఆరోపణలపై ముఖ్యమంత్రి కెసిఆర్ ఎందుకు సీరియస్ అయినట్లు...? ఏం జరుగబోతోంది..? అనేది కొద్ది రోజుల తర్వాత తేల నుంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు