‘కాపీ’ రాతగాడు, ‘కాఫీ’ సినిమా రాయుడు - కాపీ గాండ్ల ఇజ్జత్ తీసిన డాక్టర్ గుఱ్ఱం సీతారాములు

 

నా బిడ్డలు పాడిన పాటను అతుకుల బొంత జేసి కాక్ టైల్ డిజే లా చేస్తున్నావ్ ? తెలంగాణా బిడ్డ అని చెప్పుకొని తెలంగాణ అమరవీరుల మీద ఎన్ని పాటలు రాశావ్ ? సారంగ దరియా లో సగం పాట నా అమ్మ అక్కలు తరాలుగా పాడారు పాడుకుంటున్నారు.


పాట సామాజిక సంవాదానికి అదనపు చేర్పు. పూర్వకాలంలో అది  శ్రమజీవుల నెత్తుటి చుక్కలకు సాంత్వన. ఒక నాటి  ప్రజా వాగ్గేయ కారులు ఆయా పాయల ధార్మిక ఆద్యాత్మిక తాత్విక స్రవంతిని ప్రజాపరం చేయడానికి తమ యుక్తిని శక్తిని సంపూర్ణంగా ఉపయోగించుకున్నారు. మధ్యయుగాల్లో వచ్చిన భక్తి ఉద్యమం లో పాటది ప్రధాన పాలు. 

జాతీయోద్యమానికి ఇఫ్టా- ప్రజానాట్య మండలి, నక్షల్బరికి  జననాట్యమండలి, జనతన సర్కార్ కి చేతనా నాట్యమంచ్, ఆవాన్ నాట్య మంచ్, కబీర్ కళా మంచ్, మలి విడత ప్రజా ప్రత్యామ్నాయ పోరాటాల గుండె సవ్వడి ప్రజా కళామండలి. మలి విడత తెలంగాణ ఆంధ్ర పాలక పక్షపు గుండెల్లో బర్మార్లు మోగించింది. ఉద్యమానికి ఊపిరి ఊదింది పాట, యుద్దానికి కవాతు నేర్పింది. 

 సఫ్దర్ హాష్మి, చెరబండరాజు,శివసాగర్,గద్దర్,విలాస్,జీతేన్ మారాండి,శీతల్ , రూపాళి. వాళ్ళు పాడిన,రాసిన ఏ పాట అయినా అది ఒక ప్రజా బాణీ అయినా పాట మూలానికి సారం ఇచ్చారు. ఇళ్ళల్లో పాడుకునే సామూహిక బృంద గానాల విస్తృతిని పెంచారు. పాటకు వాగ్గేయ పరంపరను ఇచ్చారు. అన్నిటికన్నా ముఖ్యంగా పాటను ఆవాహన చేసుకొని కుత్తెకలు తెగ నరకాలి అని చూసినా గొంతెత్తి పాడారు. 

 పొడలా పొడలా గట్ల నడుమ మీద పొడిచి నాదిరా చందామామా చందమామకే గంధా మేలో ... గాజుల్ గల్ మనకుండా.. గంధపు పేడోత్తకుండా. పక్క మల్లెలు చెదర కుండా’ ఎంత సుకుమార మైన మార్దవం ఉంది ఈ పాటలో ఒక్క సారి మా భూమిలో ఈ పాట చిత్రీకరణ చూడండి ఆ పాటకు వాడిన వాయిద్య సహకారం చూడండి. మరెందుకు ఆ సినిమా చూడడానికి ఆ పాటలు వినడానికి ఎడ్ల బండ్లు, గుర్రపు బగ్గీలు, బస్సు లు కిరాయికి పెట్టుకొని వంద కిలోమీటర్లు పోయి చూసారు. మదనా సుందారి మదనా సుందారి    తంగేడు కురలాది జమిడి పాపెడదో, కొమ్మొల్ల మెరిసేటి నీ బొట్టు చూసో, నీళ్ళల్ల కదిలేటి నీ నీడ చూసో.. మదనాసుందారి.. వెన్నెలల రాత్రుల్లో వన్నెల్లు చూసో ఇది కదరా తెలంగాణా ఆత్మ అంటే !  ఇది కదరా తెలంగాణ నియ్యతి అంటే ! 

మరి నువ్వేంది రా నా బిడ్డలు పాడిన పాటను అతుకుల బొంత జేసి కాక్ టైల్ డిజే లా చేస్తున్నావ్ ? తెలంగాణా బిడ్డ అని చెప్పుకొని తెలంగాణ అమరవీరుల మీద ఎన్ని పాటలు రాశావ్ ? సారంగ దరియా లో సగం పాట నా అమ్మ అక్కలు తరాలుగా పాడారు పాడుకుంటున్నారు. నాలుగు తొడుగుల వాక్యాలు అతుకేసి మార్కెట్ లో అమ్ముకుని నన్ను జానపదం ఆవహించింది అంటావ్ అలా  చెప్పుకోవడం అంత నీచం లేదు. 

ఇవ్వాళ ప్రతొక్క గోసి గొంగడి కట్టుకున్న థర్డ్ రేట్ వాడూ పాటని ఓట్ల అమ్మకపు సరుకు కు ఎరువవుతున్న ప్రతోడూ వాగ్గేయ కారుడు అవుతున్నాడు. తెలంగాణ లో వాగ్గేయకారుడు ఒక్క గద్దర్ మాత్రమే ఇంకెవరన్నా తమ పేరు పక్కన అది పెట్టుకుంటే వాగ్గేయ పరంపరను అవమాన పరచడమే. 

నేను సైతం నేను సైతం అన్న పాట  సగం కాపీ.. దానికి జాతీయ అవార్డు ఇచ్చిన వాడు ఎలాగో బుర్ర లేని వెధవ ఏ ఒక్క రోజయినా ఆ పాట ప్రజా కవిత్వం పెట్టిన  బిక్ష అన్నావా  అది నీకయినా, శ్రీ శ్రీ కయినా . 

పాటను సగం కొట్టేసినా ఒక్క విరసం నాయకుడూ అది తప్పు అని అన్నారో లేదో నాకు తెలియదు.

కానీ మగధీర లో తన రెండు వాక్యాలు కొట్టేసి వాడుకున్నందుకు నిలదీసిన వంగపండుని డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేసాడు అని కూస్తిరి. 

ఇప్పటికే తెలంగాణ వచ్చాక సారధి కొలువుల  పేరుతో నెలకింత వేసి వందలాది గొంతులకి , కాళ్ళకి బంధం వేస్తిరి. వాళ్లకి ముందు నుయ్యి వెనక గొయ్యి వీరులారా వందనం అని పాడిన గొంతులు మొక్కలు పెంచండి అంటూ మెట్ల కిన్నెర రవీంద్ర భారతి మెట్ల మీద రోదిస్తోంది. గొంగడి నేల పాలు జేస్తిరి. ఇప్పుడు తెలంగాణ పాట శృతి తప్పింది. అదో ఏదో రోజు తన గొంతును సవరించుకునే రోజూ వస్తది.  

ఒక  నాడు కలేకూరి,శివసాగర్,గద్దర్ పాటలు సినిమాల లో ఉన్నాయి అంటే దానికొక లక్ష్యం ఉంది. ఉద్యమ రాజకీయాలకు ఆ పాటలు ఒక మద్దతు వాక్యాలు అయ్యాయి. మరి నువ్వేం చేస్తున్నావ్ గ్రంధ సాంగుడా అలియాస్ సారంగ దరుడా ?

##సారంగదరియా పాటను కాపీ కొట్టిన ‘కాపీ’ రాతగాడు, ‘కాఫీ’ సినిమా రాయుడు ##శేఖర్కమ్మల  రేలా రే గాయనికి క్రెడిట్ ఇస్తాడా ? యు ట్యూబ్ క్లిక్స్ గొప్పలు చెప్పుకుంటారా ఏవిరా మీవల్ల ఈ పాటకి పరంపర కి ఒరిగింది ?

డాక్టర్ గుఱ్ఱం సీతారాములు

కవి -రచయిత

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు