రెవెన్యూకు సంభందించిన అన్ని సమస్యలు సత్వరం పరిష్కరించాలి..సిఎం కెసిఆర్

మంత్రులు, కలెక్టర్లతో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సోమవారం ప్రగతి భవన్ లో సమావేశం నిర్వహించారు. మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, ఆయా శాఖల కార్యదర్శులు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

➧ రెవెన్యూకు సంబంధించిన అన్ని రకాల సమస్యలను సత్వరం పరిష్కరించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. 
➧ ధరణి పోర్టల్ లో అవసరమైన అన్ని రకాల మార్పులు, చేర్పులను వారం రోజుల్లోగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. 
➧ 9వ తరగతి నుండి ఆపై తరగతులను ఫిబ్రవరి 1వ తేదీ నుండి నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు.
➧ కరోనా వ్యాక్సినేషన్ కోసం ఏర్పాట్లు వెంటనే పూర్తి చేయాలని చెప్పారు. అడవుల పునరుద్ధరణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. 
➧ అన్ని శాఖల్లో వెంటనే పదోన్నతులు ఇవ్వాలని, ఖాళీలన్నీ ఒకేసారి వెంటనే భర్తీ చేయాలని ఆదేశించారు.

➧ అన్ని పట్టణాల్లో జనాభాకు అనుగుణంగా సమీకృత మార్కెట్లు, వైకుంఠ ధామాలు నిర్మించాలని సీఎం ఆదేశించారు.


తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు రెవెన్యూ రికార్డుల నిర్వహణ ఎంతో అస్తవ్యస్తంగా ఉండేదని, దీని కారణంగా ఘర్షణలు, వివాదాలు తలెత్తేవని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్నారు. రెవెన్యూ రికార్డులు స్పష్టంగా లేకపోవడం వల్ల కలిగే అనర్ధాలను రూపుమాపేందుకు, ప్రతి గుంటకూ యజమాని ఎవరో స్పష్టంగా తెలిసేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసిందని వెల్లడించారు. భూ రికార్డుల సమగ్ర ప్రక్షాళన, కొత్త పాస్ పుస్తకాల పంపిణీ, కొత్త రెవెన్యూ చట్టం తదితర సంస్కరణల ఫలితంగా భూ యాజమాన్య విషయంలో స్పష్టత వస్తున్నదని చెప్పారు. భూ రికార్డుల నిర్వహణ, అమ్మకాలు, కొనుగోళ్లు తదితర ప్రక్రియలన్నీ పారదర్శకంగా, అవినీతి రహితంగా, ఎలాంటి జాప్యం లేకుండా ఉండేందుకు తీసుకొచ్చిన ధరణి పోర్టల్ వందకు వంద శాతం విజయవంతమైందని ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. వ్యవసాయ భూముల అమ్మకాలు, కొనుగోళ్ల విషయంలో మరింత వెసులుబాటు కలిగించేందుకు అవసరమైన మార్పులను వారం రోజుల్లోగా ధరణి పోర్టల్ లో చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. రెవెన్యూ పరమైన అంశాలన్నింటినీ జిల్లా కలెక్టర్లే స్వయంగా పూనుకొని సత్వరం పరిష్కరించాలని కోరారు. ఇప్పటికే రిజిస్ట్రేషన్లు పూర్తయిన వ్యవసాయ భూముల మ్యుటేషన్ ను వెంటనే నిర్వహించాలని కలెక్టర్లను ఆదేశించారు. పెండింగ్ మ్యుటేషన్ల కోసం తాజాగా దరఖాస్తులు తీసుకోవాలని, వారం రోజుల్లోగా మ్యుటేషన్లు చేయాలని కోరారు. 

‘‘ధరణి పోర్టల్ ను మరింత యూజర్ ఫ్రెండ్లీగా మార్చాలి. ఇందుకోసం తక్షణం కొన్ని మార్పులు, చేర్పులు చేయాలి. ఎన్నారైలకు తమ పాస్ పోర్ట్ నంబరు ఆధారంగా రిజిస్ట్రేషన్లు చేయడానికి ధరణి పోర్టల్ లో అవకాశం కల్పించాలి. కంపెనీలు, సొసైటీలు కొనుగోలు చేసిన భూములకు కూడా పాస్ బుక్ పొందే విధంగా ధరణిలో వెసులుబాటు కల్పించాలి. గతంలో ఆధార్ కార్డు నంబరు ఇవ్వనివారి వివరాలను ధరణిలో నమోదు చేయలేదు. అలాంటివారికి మరోసారి అవకాశం ఇచ్చి, ఆధార్ నంబరు నమోదు చేసుకొని పాస్ పుస్తకాలు ఇవ్వాలి. ఏజెన్సీ ఏరియాల్లోని ల్యాండ్ ట్రాన్స్ ఫర్ రెగ్యులేషన్స్ వివాదాలన్నింటినీ జిల్లా కలెక్టర్లు నెల రోజుల్లో పరిష్కరించాలి. స్లాట్ బుకింగ్ చేసుకున్నవారు తమ బుకింగ్ ను క్యాన్సిల్ చేసుకోవడానికి, రీ షెడ్యూల్ చేసుకోవడానికి ధరణిలోనే అవకాశం కల్పించాలి. నిషేదిత భూముల జాబితాను ఎప్పటికప్పుడు అవసరమైన మార్పులతో సవరించాలి. కోర్టు తీర్పులకు అనుగుణంగా మార్పులు చేయాలి. ప్రభుత్వం రైతుల నుండి సేకరించిన భూమిని కూడా వెనువెంటనే నిషేధిత జాబితాలో చేర్చాలి. కోర్టు కేసులు మినహా పార్ట్ - బిలో చేర్చిన అంశాలన్నింటినీ పరిష్కరించాలి. 

సాదాబైనామాల క్రమబద్దీకరణ కోసం వచ్చిన దరఖాస్తులను జిల్లా కలెక్టర్లు పరిశీలించి, పరిష్కరించాలి. ధరణి పోర్టల్ లో జీపీఏ, ఎస్పీఏ, ఏజీపీఏ చేసుకోవడానికి అవకాశం కల్పించాలి. జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ఏర్పడే జిల్లాస్థాయి ట్రిబ్యునల్ లో ఇప్పటివరకు రెవెన్యూ కోర్టుల పరిధిలో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించాలి. రెవెన్యూ పరమైన అంశాలన్నింటినీ కిందిస్థాయి అధికారులకు అప్పగించి, కలెక్టర్లు చేతులు దులుపుకుంటే ఆశించిన ఫలితం రాదు. కాబట్టి కలెక్టర్లే అన్ని విషయాల్లో స్వయంగా పరిశీలన జరిపి, నిర్ణయాలు తీసుకోవాలి’’ అని ముఖ్యమంత్రి అన్నారు. 

‘‘ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో తొమ్మిదవ తరగతి నుండి ఆ పై తరగతులకు ఫిబ్రవరి 1 నుంచి తరగతులు నిర్వహించాలి. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, ఇతర వృత్తి విద్యా కోర్సుల తరగతులను నిర్వహించాలి. ఈ లోగా అన్ని విద్యా సంస్థలను, హాస్టళ్లను, రెసిడెన్షియల్ స్కూళ్లను, వాటిలోని టాయిలెట్లను సిద్ధం చేయాలి. అవన్నీ పరిశుభ్రంగా ఉండే విధంగా కలెక్టర్లు అవసరమైన చర్యలు తీసుకోవాలి. విద్యా సంస్థలు నిర్వహించక చాలా రోజులు అవుతున్నది కాబట్టి అందులోని సామాగ్రినంతటినీ శుభ్రపరచాలి. అప్పుడు నిల్వ చేసిన బియ్యం, పప్పు, ఇతర ఆహార ధాన్యాలు, వంట సామాగ్రి పురుగుపట్టే అవకాశం ఉంటుంది కాబట్టి స్టాకును సరి చూసుకోవాలి. మొత్తంగా ఈ నెల 25 లోగా విద్యా సంస్థలను తరగతులు నిర్వహించడానికి అనుగుణంగా సిద్ధం చేయాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ తదితర హాస్టళ్లను మంత్రులు సందర్శించి, విద్యార్థుల వసతికి అనుగుణంగా తీర్చిదిద్దాలి’’ అని ముఖ్యమంత్రి ఆదేశించారు.

‘‘పల్లె ప్రగతి కార్యక్రమం చాలా అద్భుతంగా జరుగుతున్నది. తెలంగాణ పల్లెలు దేశంలోనే ఆదర్శ గ్రామాలుగా మారుతున్నాయి. దేశంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణలోని అన్ని గ్రామాలకు ట్రాక్టర్లు, డంప్ యార్డులు, వైకుంఠ ధామాలు, నర్సరీలు, పల్లె ప్రకృతి వనాలు, మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికీ మంచినీరు సమకూరుతున్నాయి. ఇది దేశంలో మరే రాష్ట్రంలోనూ జరగలేదు. ఇది తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం’’ అని ముఖ్యమంత్రి అన్నారు. 

‘‘తెలంగాణ ఏర్పడిన నాడు రాష్ట్రంలో కేవలం 84 గ్రామ పంచాయతీలకు మాత్రమే సొంతంగా ట్రాక్టర్లు ఉండేవి. కానీ, నేడు 12,765 గ్రామ పంచాయతీలకు గాను 12,681 గ్రామాల్లో ట్యాంకర్లు, ట్రాలీలతో కూడిన ట్రాక్టర్లు సమకూరాయి. తెలంగాణ పంచాయతీలు ఎక్కడ నుండి ఎక్కడికి పోయాయో చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. గతంలో అడవులు నరకడమే తప్ప పెంచడమనే మాటేలేదు. కానీ నేడు తెలంగాణ పల్లెల్లో పచ్చదనం వెల్లివిరుస్తున్నది. పచ్చదనం – పరిశుభ్రత విషయాల్లో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది. ప్రతి గ్రామంలో నేడు నర్సరీ ఏర్పాటైంది. రాష్ట్రవ్యాప్తంగా 12,755 నర్సరీలు ఉన్నాయి. గ్రామాల్లో మొక్కలు పెట్టి, వాటిని సంరక్షించే పనులు ఎంతో బాధ్యతగా జరుగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో నాటిన మొక్కల్లో 91శాతం బతికాయి. ప్రతి గ్రామానికి ఓ ఉద్యానవనం ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం పల్లె ప్రగతిలో భాగంగా పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని 19,470 ఆవాస ప్రాంతాల్లో పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. 19,027 చోట్ల స్థలాలను గుర్తించింది. 15,646 చోట్ల మొక్కలు కూడా నాటడం పూర్తయింది. మిగతా చోట్ల వేగంగా పనులు జరుగుతున్నాయి. రైతులు కూర్చొని చర్చించుకోవడానికి గతంలో ఓ వేదిక అంటూ లేదు. ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని క్లస్టర్ కు ఒకటి చొప్పున రైతు వేదికలను నిర్మిస్తున్నది. రాష్ట్రంలో మొత్తం 2,601 చోట్ల రైతు వేదికలు నిర్మాణం ప్రారంభం కాగా, ఇప్పటికే 2580 చోట్ల నిర్మాణం పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా 12,736 గ్రామాల్లో డంప్ యార్డుల నిర్మాణం జరుగుతున్నది. 91శాతం పనులు పూర్తయ్యాయి. 9,023 చోట్ల డంపింగ్ యార్డుల్లో కంపోస్ట్ తయారీ జరుగుతున్నది. గతంలో స్మశానవాటికలు లేక సొంతస్థలం లేనివారు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఈ దుస్థితిని నివారించడానికి ప్రభుత్వం ప్రతి గ్రామంలో ఖచ్చితంగా వైకుంఠధామం నిర్మించాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని 12,742 గ్రామాల్లో వైకుంఠధామాల నిర్మాణం జరుగుతున్నది. రైతులు తమ పంటలను ఎండబెట్టడానికి, నూర్పడానికి వీలుగా కల్లాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా మొదటివిడత 93,875 చోట్ల కల్లాల నిర్మాణం ప్రారంభమైంది. గతంలో గ్రామ పంచాయతీలు కరంటు బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో విద్యుత్ సంస్థలకు భారీ మొత్తంలో బకాయిలు పడాల్సిన పరిస్థితి ఉండేది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చొరవ కారణంగా గ్రామ పంచాయతీలు కరంటు బిల్లులను ఎప్పటికప్పుడు చెల్లిస్తున్నది. ప్రతినెలా రూ.308 కోట్ల చొప్పున గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం క్రమం తప్పకుండా నిధులు విడుదల చేస్తున్నది. దీనివల్ల గ్రామ అభివృద్ధి కార్యక్రమాలు ఎలాంటి అవరోధం లేకుండా కొనసాగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఇన్నిరకాల సౌకర్యాలు, వెసులుబాట్లు, పచ్చదనం, పరిశుభ్రత, పారదర్శక పద్ధతులు కలిగిన రాష్ట్రం తెలంగాణ తప్ప మరొకటి లేదు. గ్రామాల్లో పెరిగిన పరిశుభ్రత వల్ల ఈసారి డెంగ్యూ వ్యాధి రాకపోవడాన్ని మనం గమనించవచ్చు’’ అని ముఖ్యమంత్రి అన్నారు. 

‘‘తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ మంది ప్రజలు గ్రామాల్లోనే నివసిస్తున్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు నేల విడిచి సాము చేయకుండా గ్రామాలే కార్యవేదికగా గుర్తించాలి. గ్రామాలను గొప్పగా తీర్చి దిద్దడమే లక్ష్యంగా పెట్టుకోవాలి. అడిషనల్ కలెక్టర్, డీపీఓలు తరచూ గ్రామాల్లో పర్యటించి పల్లె ప్రగతి పనులను పరిశీలించాలి. మంత్రులు, ఎమ్మెల్యేలు గ్రామాల్లో పర్యటించినప్పుడు ఖచ్చితంగా పల్లె ప్రగతి పనులను సమీక్షించాలి. ఏవైనా ఇబ్బందులు ఉంటే పరిష్కరించాలి. మండల పంచాయతీ అధికారులు నిత్యం అన్ని గ్రామాల్లో పర్యటించాలి. ప్రతి గ్రామంలో నర్సరీ ఉంది కాబట్టి ఎక్కడైనా మొక్కలు చనిపోతే వెంటనే రిప్లేస్ చేయాలి. ప్రతి ఇంటికీ ఆరు మొక్కలు అందించాలి’’ అని ముఖ్యమంత్రి ఆదేశించారు. 

మంత్రి దయాకర్ రావును  అభినందించిన కెసిఆర్

పల్లె ప్రగతి కార్యక్రమ లక్ష్యాలకు అనుగుణంగా గ్రామాల్లో అద్భుతంగా పనులు జరుగుతున్నాయని, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రత్యేక కృషి చేసి కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారని ముఖ్యమంత్రి అభినందించారు. మంత్రి దయాకర్ రావుతోపాటు పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్  రఘునందన్ రావు, ఇతర అధికారులను ముఖ్యమంత్రి ప్రశంసించారు. ఆయా జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ప్రత్యేక శ్రద్ధతో పల్లె ప్రగతి పనులను పర్యవేక్షిస్తున్నారని, గ్రామ సర్పంచ్ లు, గ్రామ కార్యదర్శులు ఎంతో శ్రమకోర్చి పనులు చేస్తున్నారని సీఎం అభినందించారు. 

సంగారెడ్డి కలెక్టర్ కు ప్రశంస 

అన్ని గ్రామాల్లో వైకుంఠ ధామాలు నిర్మించాలనే ప్రభుత్వ లక్ష్యాన్ని నూటికి నూరుశాతం నెరవేర్చిన సంగారెడ్డి కలెక్టర్ శ్రీ మంత్రిప్రగడ హన్మంతరావును ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ప్రశంసించారు. జిల్లాలోని మొత్తం 647 గ్రామాల్లో వైకుంఠధామాలు నిర్మించి, వాటిని అందుబాటులోకి తెచ్చారని సీఎం అన్నారు. సంగారెడ్డి జిల్లాను ఆదర్శంగా తీసుకొని మిగతా జిల్లాల్లో కూడా వందకు వందశాతం వైకుంఠధామాలు నిర్మించాలని సీఎం కోరారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు