దేశ వ్యాప్తంగా మొదలైన కరోన టీకా కార్యక్రమం

 


ఏడాది కాలంగా ప్రపంచాన్ని గడ గడ లాడించిన కరోనా మహమ్మారిని కట్టడి చేసే చర్యలు మొదలయ్యాయి. 

ప్రధాన మంత్రి నరేంద్ర మోది శనివారం ప్రారంభించారు.  దేశ వ్యాప్తంగా 3,006 ప్ర‌దేశాల్లో ఒకేసారి వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ ప్రారంభ మైంది. ఒక్కో కేంద్రంలో 100 మందికి టీకా వేశారు. దేశవ్యాప్తంగా 3,351 కేంద్రాల్లో 1,91,181 మందికి కరోనా టీకాలు వేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. 

టీకా మందు ఇతర దేశాల నుండి తెప్పించింది కాదు.  స్వయంగా మన దేశంలో తయారు కావడం మనకు గర్వ కారణం. 

సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా  తయారు చేసిన కోవిషీల్డ్‌ అట్లాగే  భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్‌ దేశ వ్యాప్తంగా పంపించారు.  అక్కడక్కడా టీకాలు తీసుకున్న వారికి స్వల్ప అస్వస్థతలు కలిగినా వారికి వెంటనే చికిత్స చేశారు.  ఈ అస్వస్థత కేసులు డిల్లీ లో నమోదయ్యాయి. 


ప్రధాన మంత్రి నరేంద్ర మోది భావోద్వేగం

టీకా మందు ప్రారంభోత్సవం సందర్భంగా  ప్రధాన మంత్రి నరేంద్ర మోది భావోద్వేగానికి గురయ్యాడు. కరోనా నియంత్రణకు తమ ప్రాణాలు సైతం లెక్కచేయకుండా పనిచేసిన వైద్యులు, వైద్య సిబ్బంది, పారిశుద్య సిబ్బంది సేవలను ప్రధాని కొనియాడారు. కరోనా మహమ్మారి ఎన్నో చేదు జ్ఞాపకాలను మిగిల్చిందని, ఎంతో మంది తల్లుల కడుపుకోతకు కారణమైందని మోదీ కంట తడి పెట్టుకున్నారు. కరోనాను తరిమికొట్టేందుకు లక్షలాది మంది వైద్యులు, ఫ్రంట్‌లైన్‌ వారియర్స్  నిర్విరామంగా పనిచేశారని, ఈ క్రమంలో వారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. విధి నిర్వహణలో భాగంగా కొంత మంది ఇంటి ముఖం కూడా చూడలేదని ప్రధాని పేర్కొన్నారు.

ఆసుపత్రుల్లో చేరిన వృద్ధులను వారి కుటుంబ సభ్యులు కలుసుకోలేక అనాథల్లా మిగిలిపోయారన్నారు. ప్రాణాలు కోల్పోయినవారికి సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు కూడా నిర్వహించలేని దుస్థితి ఏర్పడిందన్నారు.

టీకా తయారీకోసం భారత శాస్త్ర వేత్తలు చేసిన కృషిని అభినందించారు.  వైద్యులు, వైద్య సిబ్బంది, పారిశుద్య కార్మికులు తొలి టీకా తీసుకునేందుకు హక్కులు కలిగిన వారని అన్నారు.

ఈ సందర్భంగా ప్రధాని గురజాడ అప్పారావు కవిత చదివి వినిపించారు. దేశ ప్రజల కోసం ఫ్రంట్ లైన్ వారియర్స్  చేసిన సేవలు గుర్తు చేస్తూ సొంత లాభం కొంత మానుకో, పొరుగువారికి తోడుపడు.. దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్ అని ఫ్రంట్ లైన్ వారియర్స్ తమ ఇండ్లకు కూడ వెళ్లకుండా  నిర్విరామంగా పనిచేశారని అన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు