సినీ నటుడు నర్సింగ్ యాదవ్ మృతి

 


అనారోగ్యంతో సినీ నటుడు నర్సింగ్ యాదవ్ సోమజిగూడా యశోద ఆస్పత్రిలో మృతి చెందారు. గత కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధ పడుతున్నారు. ఈ క్రమంలోనే గ‌త కొంత‌కాలంగా ఆయనకు డ‌యాలిసిస్ జ‌రుగుతోంది. సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్సపొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. నర్సింగ్ యాదవ్ తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ భాషల్లోనూ నటించారు. దాదాపు 300కి పైగా చిత్రాల్లో నటించారు. ఆయన హైదరాబాద్‌లో 1963 మే 15న రాజయ్య, లక్ష్మీ నరసమ్మ దంపతులకు జన్మించారు.


నర్సింగ్ యాదవ్‌కు భార్య చిత్ర యాదవ్, కుమారుడు రుత్విక్ యాదవ్ ఉన్నారు. నర్సింగ్ యాదవ్ మొదటి సినిమా విజయ నిర్మల దర్శక నిర్మాతగా వచ్చిన ‘హేమాహేమీలు’. కాగా.. ‘క్షణక్షణం’, ‘మనీ’ సినిమాలు నర్సింగ్ యాదవ్‌కు మంచి బ్రేక్ ఇచ్చాయి. అలాగే  గాయం, ముఠామేస్త్రీ, మాస్‌, శంక‌ర్ దాదా ఎంబీబీయ‌స్‌, అనుకోకుండా ఒక రోజు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, రేసుగుర్రం, పిల్ల‌జ‌మీందార్‌, సుడిగాడు, కిక్‌ త‌దిత‌ర చిత్రాల్లో ఆయ‌న చేసిన కేర‌క్ట‌ర్ల‌కు చాలా మంచి పేరు వ‌చ్చింది. 

మెగాస్టార్ చిరంజీవి కూడా ఆయనకు చాలా సినిమాల్లో అవకాశమిచ్చారు. 1997లో వచ్చిన ‘దౌడ్’ అనే హిందీ సినిమాలో నర్సింగ్ యాదవ్ నటించారు. ఆయన పూర్తి పేరు మైలా నరసింహ యాదవ్ . కానీ ఇండస్ట్రీలో ఆయన నర్సింగ్ యాదవ్‌గా స్థిరపడిపోయారు. కామెడీ విలన్‌గా.. విలక్షణ నటుడిగా ఆయన మంచి పేరు తెచ్చుకున్నారు. రజినీకాంత్ నటించిన ‘బాషా’ సినిమాలోనూ ఆయన మంచి కేరెక్టర్ చేశారు. ఇటీవల మెగాస్టార్ రీ ఎంట్రీ చిత్రం ఖైదీ నెంబ‌ర్ 150లోనూ నర్సింగ్ యాదవ్ న‌టించారు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు