విలాసమే కాదు విజ్ఞాన ప్రదేశాలూ ఉన్నాయి...గోవాలో

 


సౌకర్యవంతమైన, విలాసవంతమైన జీవనశైలికి గోవా రాష్ట్రం ఒక మంచి ఉదాహరణ. ఇక్కడికి వచ్చే టూరిస్టులు అంత త్వరగా ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్లాలని కోరుకోరు. ఎందుకంటే ఎక్కడ లభించే సౌకర్యాలు అటువంటివి. ఏవిధమైన ఆంక్షలు లేని, ఇతరులతో ఇబ్బందులు లేకుండా తానూ కోరుకొనే విధంగా జీవించే ఏకైక ప్రదేశం గోవా. అందుకే చాలా మంది ఏమాత్రం సెలవు దొరికినా వెళ్లే పర్యాటక ప్రాంతం గోవా.


అరేబియా సముద్ర తీరంలో ఉన్న గోవా కు 101 కిలో మీటర్ల విస్తీర్ణం లో సముద్ర తీరం ఉంది. 16 శాతాబ్దంలో పోర్చుగీస్ వారు ఈ గోవాపై పూర్తిగా ఆధిపత్యాన్ని సాధించారు. 1510 లో పోర్చుగీసు వారు అప్పటి బీజాపూర్ సుల్తాన్ యూసుఫ్ ఆదిల్ షా ను ఓడించి గోవా ను స్వాధీన పర్చుకున్నారు. 450 సంవత్సరాల అనంతరం 1961 లో గోవాను భారత ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఇప్పటికీ పోర్చుగీసు సంస్కృతీ, సాంప్రదాయాలు ఇక్కడ కనిపిస్తాయి. గోవాను పోర్చుగీసులు పరిపాలించే సమయంలో ఇక్కడ క్రైస్తవ మత వ్యాప్తికి సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ అనే మత ప్రచారకుడు కృషి చేశారు. కేవలం గోవాలో మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో పర్యటించి సువార్త వ్యాప్తికి ఆయన పని చేసారు. ఈ పర్యటనల్లో భాగంగా ఆయన మకావూలో పర్యటిస్తున్నప్పుడు అనారోగ్యానికి గురై 1553లో కన్ను మూశారు. ఆ తరువాత ఆయన శరీరాన్ని గోవాకు తరలించి ఒక గాజు పెట్టెలో కుళ్లిపోకుండా ఉండేలా ఏర్పాట్లు చేసారు. ఇప్పటికి కూడా బసిలికా ఆఫ్ బామ్ జీసస్ చర్చిలో సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ మమ్మీను చూడవచ్చు.
*చూడాల్సిన బాసిలికా చర్చ్, పురాతత్వ శాఖ మ్యూజియం*
ఓల్డ్ గోవా లో ఉన్న ఈ బాసిలికా చర్చ్ కు ఎడమ పక్కనే కేంద్ర పురాతత్వ శాఖ నిర్వహిస్తున్న పురావస్తు ప్రదర్శనశాల ఉంది. ఈ మ్యూజియంలో పోర్చుగీసు పాలకులు, మాట ప్రబోధకులు, గోవా పరిసర ప్రాంతాల్లో దొరికిన పురాతన విగ్రహాలు, పురాతన చిత్రపటాలు, ఫిరంగులు, ఆయుధాలు ఇలా ఎన్నో ఉన్నాయి. అక్కడే ఉన్న గైడ్ నుమాట్లాడుకొనడంతో ఆ మ్యూజియం విశేషాలు, పోర్చుగీసు వారి పాలనా విశేషాలు, మతమార్పిడులు తదితర అంశాలను వివరించారు.
*అద్భుతం...అగుడా కోట సముదాయం*
అగుడా ఫోర్ట్.... నిస్సందేహంగా భారతదేశంలో చక్కగా నిర్వహిస్తున్న వారసత్వ కట్టడాలలో ఒకటి. ఇది 17వ శతాబ్ధ కాలం నాటి కోట. ఈ కోటను పోర్చుగీసు పాలకులు డచ్ మరియు మరాఠా పాలకుల దాడుల నుండి తమను సంరక్షించుకోవడానికిగాను నిర్మించారు. వేలాది పర్యాటకులు ఈ కోట సందర్శనకు వస్తారు. పోర్చుగీసు పాలకులు మనకు ఇచ్చిన బహుమతిగా కనిపిస్తుంది. అరేబియా అలల తాకిడిని తట్టుకునేలా, 79 ఫిరంగులతో శత్రుదుర్భేద్యంగా నిర్మించారు. కోట లోపల 1864లో నిర్మించిన లైట్‌హౌస్‌ ఆకట్టుకుంటుంది. అత్యంత ఎత్తైన టవర్ పై నిర్మించిన ఈ లైట్ హౌస్ ఆసియా ఖండం లోనే పురాతనమైనదిగా చెపుతారు. 1976 వరకు ఈ ఫోర్ట్ నిర్వహణలో ఉంది. కోట లోపల 3, 85,000 గ్యాలన్ల వర్షపు నీటిని స్టోర్ చేసుకొనే విధంగా అద్భుతమైన రిజర్వాయర్ ను నిర్మించారు. గోవా రాష్ట్ర భారత పురాతత్వ శాఖ అధికారిగా ఉన్న మిత్రుడు సాంబ శివ కుమార్ కు ఫోన్ చేయడంతో కోటలోని తన సిబ్బందిని మాకు కలిపించి,. కోటలోని ఓల్డ్ లైట్ హౌస్, నీటిని నిల్వ చేసే రిజర్వాయర్ లను ప్రత్యేకంగా మాకు చూపించారు. ఇతరులకు వీటి ప్రవేశం నిషేధం. కోట నిర్వహణ అద్భుతంగా ఉంది. ఈ ఫోర్ట్ లోని లైట్ హౌస్ టవర్ వద్ద, a ఆ ఫోర్ట్ లో ఫోటోస్ తీసుకొని, ఏ.ఎస్.ఐ కార్యాలయంలో కూల్ డ్రింక్స్, స్నాక్స్ తిని తిరిగి బయలు దేరాం.
*గోవాలో 12 వేల బార్లు ఉన్నాయట*
దేశంలోనే అత్యంత చిన్న రాష్ట్రాల్లో ఒకటిగా 25 రాష్ట్రం గా ఉన్న గోవా లో 12 వేల బార్లు ఉన్నాయని స్థానిక డ్రైవర్ చెప్పాడు. ఈ రాష్ట్రానికి దేశ విదేశాల నుండి భారీ సంఖ్యలో వచ్చే పర్యాటకుల సౌకరార్థం ఈ బార్లు సేవలందిస్తాయని తెలిపాడు. దేశంలోనే అత్యధిక జీ.డీ.పి తో ధనిక రాష్ట్రంగా కూడా గోవా ఉంది. ముఖ్యంగా ఇక్కడి నివాసితులు పర్యాటకుల పట్ల మంచి గౌరవంతో, ఏమాత్రం చీటింగ్ లేకుండా ఉండడం ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. గోవా కు వెళ్లేవారు
బీచ్ లు కాకుండా తప్పక చూడాల్సినవి బాసిలికా చర్చ్, మ్యూజియం,ఆగోడా ఫోర్ట్.(13.01.2021 )
కన్నెకంటి వెంకట రమణ
జాయింట్ డైరెక్టర్
సమాచార శాఖ, 9849905900

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు